మంత్రి గంగుల ప్రోద్బలంతోనే పేద ముస్లింల ఇళ్లను కూల్చారు

by Shiva |
మంత్రి గంగుల ప్రోద్బలంతోనే పేద ముస్లింల ఇళ్లను కూల్చారు
X

రేకుర్తి గుట్టపై భూబకాసురులు కన్నేశారు

ఇండ్లు కూల్చిన కబ్జా రాయుళ్లపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి

సెలవు రోజున ఇళ్లను కూల్చేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయాలి

తెలంగాణ పౌర హక్కుల సంఘం డిమాండ్

దిశ, కరీంనగర్ టౌన్ : కరీంనగర్ పట్టణంలోని రేకుర్తి 19వ డివిజన్ పరిధిలోని సర్వే నెం.194లో పేద ముస్లింలు నిర్మించుకున్న దాదాపు 20 ఇళ్లను టార్గెట్ చేసి ఈనెల 13న శనివారం మంత్రి గంగుల కమలాకర్ ప్రోద్బలంతోనే కూల్చారని తెలంగాణ పౌరహక్కుల సంఘం నిజనిర్ధారణ కమిటీ తేల్చింది. బుధవారం పౌర హక్కుల సంఘం నిజ నిర్ధారణ కమిటీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమార స్వామి నేతృత్వంలో కమిటీ సభ్యులు రేకుర్తి జరీనానగర్ లో క్షేత్రస్థాయిలో పర్యటించి, భూబకాసురులు కూల్చిన ఇళ్లను పరిశీలించారు.

రేకుర్తి గుట్ట భవిష్యత్ లో పర్యాటక ప్రాంతం అవుతుందనే నెపంతో పేద ముస్లింలకు ఇచ్చిన భూములపై కన్నేశారని ఆరోపించారు. మంత్రి గంగుల భూమాఫియాను ప్రోత్సహించడాన్ని, ఇళ్లను కూల్చడాన్ని తీవ్రంగా ఖండించారు. సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కమలాకర్ ను, మంత్రి పదవి నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తమ భూములు కబ్జాకు గురవుతున్నాయని దరఖాస్తులు జిల్లా కలెక్టర్ కు ఇస్తే స్పందించని రెవెన్యూ అధికారులు.. ఆఘమేఘాల మీద మంత్రి గెస్ట్ హౌజ్ నుంచి కలెక్టర్ కు ఫోన్ చేయగానే బాధితులకు నోటీసులు ఇవ్వకుండా పేదల ఇళ్లను కూల్చి వేయాల్సిన అవసరం ఏమోచ్చిందన్నారు.

నంబర్ ప్లేట్ లేని ఫార్చూనర్ కారులో వెళ్లి, సెలవు రోజున ఇళ్లను కూల్చిన రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయాలన్నారు. కబ్జారాయుళ్లపై సుమోటోగా కేసు నమోదు చేసి, పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ పట్టణ శివారులో రేకుర్తి,19వ డివిజన్లో పేద ముస్లింలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 20 ఏళ్ల క్రితం షేక్ ఖాన్ కుటుంబానికి 60 చదరపు గజాల చొప్పున భూమిని నివాస స్థలాలకు ఇచ్చారు. వీటికి పట్టా కాగితాలు కూడా ఉన్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద ముస్లింల కావడంలో ఆ స్థలాల్లో 20 ఏళ్ల నుంచి ఆర్థికంగా స్థోమత లేక ఇళ్లు కట్టలేకపోయారు.

ఇటీవలే వ్యయ ప్రయాసలు ఓర్చి ఇళ్లు కట్టుకోవడం ప్రారంభించారు. గత నెల రోజుల క్రితం వీరి కాలనీ సమీపంలోని గుట్టపైన నరసింహ స్వామి ఆలయానికి వచ్చిన స్థానిక మంత్రి గంగుల కమలాకర్, నిరుపేదల స్థలాలపై వివాహస్పద వ్యాఖ్యాలు చేసి తన అనుచరులను పంపి 20 ముస్లిం కుటుంబాల స్థలాలను కబ్జా చేసేందుకు గంగుల కమలాకర్ కుట్రలు పన్నాడని ఆరోపించారు. అందులో భాగంగానే మే 13న మధ్యాహ్నం ఒంటి గంటకు సుమారు పదిమంది వ్యక్తులు రెండు ఫార్చ్యూన్ కార్లలో డోజర్, జేసీబీలతో వచ్చి ఇళ్లను కూల్చి వేశారని తెలిపారు. మహిళలు కాళ్ల, వేళ్ల పడ్డా కనికరించకుండా నిర్ధాక్షిన్యంగా 20 ఇళ్లను కూల్చివేశారని పౌర హక్కుల సంఘం నేతలు ఆరోపించారు.

ఈ దుశ్చర్యను తెలంగాణ ప్రజా ఫ్రంట్, దళిత లిబరేషన్ ఫ్రంట్ తీవ్రంగా ఖండిస్తున్నాయని తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికైనా.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తక్షణమే స్పందించి, కూల్చిన ఇళ్ల స్థానంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని, నష్ట పరిహారంగా కుటుంబానికి రూ.10 లక్షల చెల్లించాలని పౌర హక్కుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ నిజ నిర్ధారణ కమిటీలో మాదన కుమారస్వామి, శ్రీపతి రాజగోపాల్, అధ్యక్షుడు, పౌర హక్కుల ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యులు నార వినోద్, బొడ్డుపెళ్లి రవి, గడ్డం సంజీవ్ కుమార్, మోటపలుకుల వెంకట్, గుమ్మడి కొమురయ్య, మార్వాడీ సుదర్శన్, దళిత లిబరేషన్ ఫ్రంట్, బాధిత కుటుంబాలు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed