అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారిన అంబేద్కర్ స్టేడియం

by Maddikunta Saikiran |
అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారిన అంబేద్కర్ స్టేడియం
X

దిశ బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ క్రీడాప్రాంగణం అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారింది. క్రీడాకారులలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాల్సిన కేంద్రాన్ని అక్రమాలకు నిలయంగా మార్చారు. అడిగే వారే లేకపోవడంతో డీవైఎస్ఓ అడుగడుగునా అక్రమాలకు పాల్పడి వివాదాల్లో ఇరుక్కోవడంతో చర్చనీయాంశంగా మారింది. క్రీడాకారుల ఆటలతో వారు చేసే సాధనాలతో వెల్లివిరియాల్సిన క్రీడా ప్రాంగణం కొంత మంది స్పోర్ట్ వ్యాపారుల ఆజమాయిషితో వ్యాపారకేంద్రంగా తయారైంది. అంబేద్కర్ స్టేడియాన్ని పునరావాస కేంద్రంగా మార్చుకున్న స్పోర్ట్స్ వ్యాపారులు తాయిళాలతో స్పోర్ట్స్ అథారిటీ అధికారులను వారి చెక్కు చేతల్లో పెట్టుకుని వ్యాపారంలా సాగిస్తున్నారు. అవసరం ఉన్న క్రీడలకు కోచ్ లను తీసుకోకుండా ఖజానాకు కన్నం పెట్టేవిధంగా నియమకాలు చేపట్టడంపై క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిఫారసు లెటర్లనే ప్రామాణికంగా నియమకాలు చేపడుతూ క్రీడాకారుల్లో క్రీడాస్పూర్తిని నిర్వీర్యం చేస్తున్నారు. నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ నోటిఫికేషన్ లేకుండా నియామకాలు చేపడుతూ అక్రమాలకు తెరలేపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

డీవైఎస్ఓ సూత్రధారిగా అక్రమాలు

అనేక అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న కరీంనగర్ డీవైఎస్ఓ శ్రీనివాస్ గతంలో గచ్చిబౌలి స్టేడియంలో విధులు నిర్వహించిన సమయంలో అవినీతి ఆరోపణలతో బదిలీపై వేరే చేటుకు వెళ్లి అక్కడి నుండి ఈ మధ్యకాలంలో పైరవీతో కరీంనగర్ కు వచ్చాడు. అతను బాధ్యతలు చేపట్టినప్పటి నుండి అడుగడుగునా అక్రమాలకు పాల్పడుతూ వార్తల్లోకి ఎక్కాడు. తన అనుకూలమైన వ్యక్తులను క్రీడల్లో ప్రావీణ్యం లేకపోయినా కోచ్ లగా నియమించడం..కోచ్ లు అవసరం లేకపోయినా జీతాల కోసం కోచ్ లను నియమించడం వివాదాస్పదంగా మారింది. క్రీడాకారుల వద్ద అడ్డగోలుగా వసూలు చేసి వాటికి రసీదులు ఇచ్చి రికార్డులు మెయింటెన్ చేయకపోవగా కోచ్ లగా నియామకమైనా వారిని స్పోర్ట్స్ స్కూల్ లో వసతి కల్పిస్తూ వారికి స్పోర్ట్స్ స్కూల్ ను పునరావస కేంద్రంగా మార్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. పలువురు క్రీడాకారులు యువజనసంఘాల నాయకులు అతని అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అవినీతి ఆరోపణలతో బదిలివేటు వేసిన అధికారులు అంతలోనే బదిలి రద్దుచేయడంతో వివాదం రచ్చకెక్కింది.

స్పోర్ట్స్ వ్యాపారులే కీలకం

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియాన్ని కొంతమంది స్పోర్ట్స్ వ్యాపారులు అడ్డాగా మార్చుకుని వ్యాపారం సాగిస్తున్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగా అధికారులను మార్చుకుని తమ వ్యాపారాన్ని వృద్ది చేసుకుంటున్నారు. అలా అక్రమంగా అథారిటీ నుండి లాభాలు పొందుతూ అధికారులకు వాటాలు పంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలా అలావాటు పడ్డ అధికారులు వారు చెప్పిందే వేదం అన్నట్టుగా వ్యవహరిస్తూ వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ప్రైవేట్ వ్యక్తులను కోచ్ లగా నియమించి క్రీడా కారులనుండి అందినకాడికి దండుకుంటున్నారు. అలా దండుకుంటున్న డబ్బు సరిపోదన్నట్టుగా అధికారులను తప్పుతోవ పట్టించి ఆట స్థలాల లీజుకు తెరలేపుతున్నారు. అది సజావుగా జరగాలంటే అక్రమ అధికారులే బేష్ అన్నట్టుగా రాజకీయ పెద్దలతో లాబీయింగ్ చేస్తు అక్రమాల్లో ఆరితేరిన అధికారులకు పట్టం కట్టిస్తున్నారు.

ఆట స్థలాల లీజుపై క్రీడాకారుల ఆగ్రహం

కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఆట స్థలాల లీజు వ్యవహారం పెద్ద దుమారం రేపుతుంది. ఆట స్థలాలను ప్రయివేటు వ్యక్తులకు లీజుకు ఇవ్వడాన్ని క్రీడాకారులు వ్యతిరేకిస్తున్నారు. పేద, మద్య తరగతి క్రీడాకారులను నిర్వీర్యం చేసేందుకే ఆట స్థలాలను లీజుకు శ్రీకారం చుడుతున్నారని ఆరోపిస్తున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రీడాకారులు ప్రభుత్వం లీజు ఇవ్వడాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారుల తీరును నిరసిస్తు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed