గ్రామాల్లో కొత్త రోడ్లు వేస్తాం.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హామీ

by Nagam Mallesh |
గ్రామాల్లో కొత్త రోడ్లు వేస్తాం.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హామీ
X

దిశ, చందుర్తిః వేములవాడ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కొత్త రోడ్లు వేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు. మండల కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లేందుకు రూ. 25 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా లు భూమి పూజ చేశారు. ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు సీసీ రోడ్డు నిర్మించనున్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రూ.325 కోట్లతో పనులు చేపట్టి నియోజకవర్గంలోని చెరువుల నింపుతామని వెల్లడించారు. సాగు నీటి ఇబ్బందులు దూరం చేస్తామని ప్రకటించారు. రుద్రంగిలో రూ. కోటి నలభై లక్షల వ్యయంతో ఆసుపత్రి నిర్మాణానికి ఇటీవల భూమి పూజ చేశామని, చంద్రుర్తిలో నిర్మిస్తున్న ఆసుపత్రిని త్వరలో సందర్శిస్తామని పేర్కొన్నారు. లో లెవెల్ వంతెనలు ఉన్న చోట హై లెవెల్ వంతెనలు నిర్మిస్తామని తెలిపారు. గ్రామాలకు అవసరమైన రోడ్లు వేయిస్తామని వివరించారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకు సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని విప్ వెల్లడించారు. పోస్ట్ మార్టం సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేయిస్తున్నామని పేర్కొన్నారు. ఇక్కడ పంచాయతీ రాజ్ ఈఈ భూమేశ్వర్, ఎంపీడీఓ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story