మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం

by Sridhar Babu |
మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం
X

దిశ, పెద్దపల్లి : జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా నార్కోటిక్ కంట్రోల్ సమావేశంలో జిల్లాలో నమోదవుతున్న ఎన్డీపీఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యలు, శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, నష్టాలపై విస్తృత ప్రచారం వంటి పలు అంశాలను చర్చించారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ జిల్లాలో ఉన్న కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, మోడల్ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో డ్రగ్స్, మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై వైద్య అధికారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలోని విద్యా సంస్థలలో యాంటీడ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని, డ్రగ్స్, ఇతర మాదకద్రవ్యాలు అలవాటు ఉన్న వారిని గుర్తించి వారిని పునరావాస కేంద్రాల ద్వారా అలవాటు మాన్పించాలని అన్నారు. విద్యా సంస్థల్లో నిర్వహించే పేరెంట్, టీచర్స్ సమావేశాలలో డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలు, మత్తు పదార్థాలకు బానిసలుగా మారితే వచ్చే పరిణామాలు, బానిసత్వం నివారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన డి అడిక్షన్ సెంటర్ మొదలగు అంశాలను వివరించాలని కోరారు.

చుట్టుపక్కల ఎవరైనా పిల్లలు మాదకద్రవ్యాలకు అలవాటు పడినట్లు తెలిస్తే వెంటనే సమాచారం అందజేయాలని సూచించారు. బానిసైన వారిని గుర్తించి చికిత్స అందించాలని కోరారు. గోదావరిఖని ఆసుపత్రిలో 10 పడకల డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. అటవీ శాఖ అధికారులు వారి పరిధిలోని అటవీ భూములు పరిశీలించి గంజాయి సాగు కనిపిస్తే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. జిల్లాలోని ఆసుపత్రులు, మెడికల్ షాపులలో స్టాక్ వివరాలను ప్రతి నెలా తనిఖీ చేయాలని కలెక్టర్ డ్రగ్ ఇన్​స్పెక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ జి.క్రిష్ణ, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, జిల్లా అటవీ అధికారి శివయ్య, జిల్లా ఆప్కారి శాఖ అధికారి మహిపాల్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి డి. మాధవి, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కల్పన, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రకాష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed