జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ షమీమ్ అఖ్తర్

by Gantepaka Srikanth |
జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ షమీమ్ అఖ్తర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్సీ వర్గీకరణ అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీ సిఫారసుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి జస్టిస్ షమీమ్ అఖ్తర్ చైర్మన్‌గా జ్యుడీషియల్ కమిషన్ను నియమించింది. రాష్ట్రంలోని ఎస్సీ కులాలు, ఉప కులాల వెనకబాటుతనాన్ని అధ్యయనం చేయడంతో పాటు రిజర్వేషన్ ఫలాలు ఏ మేరకు అందాయో, వాటి ద్వారా వారి జీవన ప్రమాణాల్లో ఎలాంటి పురోగతి లభించిందో కమిషన్ స్టడీ చేయనున్నది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఆగస్టు 1న తీర్పును వెలువరించడంతో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయడం కోసం ఎస్సీ కులాలు, ఉప కులాలను వారి సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్య, ఉద్యోగ రంగాల్లోని వెనకబాటుతనం ఆధారంగా ఏయే గ్రూపుల్లో ఎలా చేర్చాలో ఫార్మాలను రూపొందించడం కూడా ఈ కమిషన్ బాధ్యత. అరవై రోజుల్లో ప్రభుత్వానికి నివేదికతో పాటు సిఫారసులను అందించాలని ప్రభుత్వం ఈ కమిషన్‌ను ఆదేశించింది. కమిషన్ ఆఫీసు ఫంక్షనింగ్‌తో పాటు అవసరమైన సిబ్బందిని, మౌలిక సౌకర్యాలను కల్పించాల్సిందిగా ఎస్సీ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్ కమిషనర్‌ను ఆ శాఖ కార్యదర్శి ఆదేశించారు.

ఈ కమిషన్ పనిచేసేందుకు నిర్దిష్టమైన విధివిధానాలను, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సును కూడా సెక్రెటరీ శుక్రవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కమిషనర్ ఆఫ్ ఇంక్వైరీస్ చట్టంలోని నిబంధనల మేరకు జస్టిస్ షమీమ్ అఖ్తర్ చైర్మన్‌‌గా వ్యవహరించే కమిషన్‌ను నియమించినట్లు సెక్రెటరీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కమిషన్ అరవై రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణ ... :

= ఎస్సీ కులాలు, ఉప కులాలను హేతుబద్ధంగా వర్గీకరి,చడం; వాటికున్న సారూప్యత (ఏక రూప స్వభావం) ఆధారంగా గ్రూపులుగా చేర్చడం; అందుబాటులో ఉన్న డాటా, 2011 జనాభా లెక్కల ఆధారంగా శాస్త్రీయంగా ఈ ప్రక్రియను పూర్తి చేయడం.

= ఎస్సీ కులాలు, ఉప కులాలు వివిధ రంగాల్లో ఎదుర్కొంటున్న వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేయడం; ముఖ్యంగా విద్య, ఉద్యోగ రంగాల్లో వారికి తగిన ప్రాతినిధ్యం ఉన్నదో లేదో స్టడీ చేయడం.

= సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా రంగాల్లో వెనకబాటుతనాన్ని గుర్తించడంతో పాటు ఎస్సీ వర్గీకరణను సమర్ధవంతంగా అమలు చేయడం ద్వారా ఆ అసమానతలను రూపుమాపేందుకు కులాలు, ఉప కులాలను గ్రూపులుగా వర్గీకరించడం.

= అధ్యయనంలో తేలిన అసమానతలు, రిజర్వేషన్ ఫలాలు అందుకోవడంలో జరిగిన అన్యాయం తదితరాలను నివేదికలో వివరించడంతో పాటు ఇకపైన వర్గీకరణ ద్వారా ఎలాంటి విధానాన్ని అవలంబించడం ద్వారా దీన్ని అధిగమించవచ్చో ప్రభుత్వానికి సిఫారసు చేయడం; అసమానతలకు తావులేని విధంగా రిజర్వేషన్ పాలసీని రూపొందించడం.

= ఈ మొత్తం ప్రక్రియను అరవై రోజుల వ్యవధిలో పూర్తిచేయడం; ఇందుకు వీలుగా కమిషన్ జరిపే క్షేత్రస్థాయి పర్యటనలు, పలు సంఘాలతో సమావేశాలు, విజ్ఞప్తుల స్వీకరణ, హైదరాబాద్‌లోనే ఆఫీసు ఏర్పాటు చేసుకోవడం.

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన నేపథ్యంలో అమలు చేయడంపై అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీనికి కొనసాగింపుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్‌గా, మంత్రి దామోదర రాజనర్సింహ కో-చైర్మన్‌గా, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ డాక్టర్ మల్లు రవి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. నాలుగుసార్లు సమావేశమైన ఈ కమిటీ చట్టపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా పకడ్బందీగా వర్గీకరణను అమలు చేయడానికి నిర్దిష్టమైన విధివిధానాలతో ఒక జ్యుడిషియల్ కమిషన్ (వన్ మ్యాన్)ను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అప్పటికే ఈ కమిటీ దాదాపు 1100 ఫిర్యాదులు, మెమొరాండంలను వ్యక్తులు, ఎస్సీ కులాలు, ఉప కులాల సంఘాల ప్రతినిధుల నుంచి స్వీకరించింది. అన్ని అభిప్రాయాలను నిశితంగా అధ్యయనం చేసిన తర్వాత జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి నివేదించింది. దాని ఆధారంగా ఇప్పుడు జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటైంది.

జస్టిస్ షమీమ్ అఖ్తర్ (63) తెలంగాణ హైకోర్టు జడ్జీగా గతంలో (2017-2022) సేవలందించారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఆయన బీ.కామ్ పూర్తి చేసి నాగ్‌పూర్‌లో లా డిగ్రీ, హైదరాబాద్‌లో ఎల్ఎల్ఎమ్ కంప్లీట్ చేశారు. న్యాయవాదిగా, జిల్లా జడ్జిగా, హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడిషియల్), వక్ఫ్ ట్రిబ్యునల్ ప్రిసైడింగ్ అధికారిగా.. అనేక హోదాల్లో పనిచేసి 2022లో రిటైర్ అయ్యారు. సివిల్, క్రిమినల్, రెవెన్యూ అంశాల్లో ఒకటిన్నర దశాబ్ద కాలానికి (1986-2002) పైగా న్యాయవాదిగా పనిచేసిన అనుభవమున్నది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని పలు జిల్లాలకూ ఆయన జడ్జిగా పనిచేశారు. ఉమ్మడ రాష్ట్రంలో జ్యుడిషియల్ అకాడమీ అదనపు డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు ఆరేండ్ల పాటు హైకోర్టు జడ్జిగా పనిచేసి 2022 డిసెంబరు 31న రిటైర్ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed