తెలంగాణ రాజకీయాల్లో ఊహించని సీన్.. బీజేపీ-జనసేన పొత్తు ఖరారు..? టీడీపీ కూడా..?

by Javid Pasha |   ( Updated:2023-10-18 09:48:58.0  )
తెలంగాణ రాజకీయాల్లో ఊహించని సీన్.. బీజేపీ-జనసేన పొత్తు ఖరారు..? టీడీపీ కూడా..?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌తో వామపక్షాల పొత్తు దాదాపు ఖాయమవ్వగా.. సీట్ల సర్ధుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో టీ పాలిటిక్స్‌లో మరో పొత్తు పొడుస్తోంది. జనసేనను కలుపుకునేందుకు టీ బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కొన్ని సీట్లలో జనసేన మద్దతును బీజేపీ కోరుతోంది.

బుధవారం హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్‌తో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ భేటీ అయ్యారు. తెలంగాణలో బీజేపీ-జనసేన కలిసి ఉమ్మడిగా పోటీ చేయడంపై చర్చించారు. పవన్ కళ్యాణ్‌తో నిన్న జనసేన నేతలు సమావేశమవ్వగా.. తెలంగాణలో 30 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో జనసేనతో కలిసి పోటీ చేసేందుకు బీజేపీ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో పవన్ ఉన్నారు. గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి పవన్ బహిరంగంగా మద్దతు ప్రకటించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ మద్దతు కావాలని బీజేపీ భావిస్తోంది. దీంతో జనసేనతో పొత్తు పెట్టుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నేడు సాయంత్రం ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరగనుండగా.. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. గురువారం బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసే అవకాశముందని సమాచారం. ఈ క్రమంలో పవన్‌తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ చర్చలు జరపడం కీలకంగా మారింది.

అయితే బీజేపీ, జనసేనతో టీటీడీపీ కూడా కలుస్తుందా? అనేది హాట్‌టాపిక్‌గా మారింది. టీటీడీపీ కూడా పొత్తుకు సిద్దంగా ఉంది. తెలంగాణలో 87 సీట్లలో మాత్రమే పోటీ చేస్తామని టీటీడీపీ తెలిపింది. ఇప్పటికే ఆ సీట్లలో అభ్యర్థులను కూడా ఖరారు చేసినట్లు స్పష్టం చేసింది. ఇలాంటి తరుణంలో బీజేపీ-జనసేన పొత్తులో టీడీపీ కూడా కలుస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story