ముస్లింలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీనే: ఎంపీ లక్ష్మణ్

by Mahesh |   ( Updated:2024-05-07 16:25:12.0  )
ముస్లింలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీనే: ఎంపీ లక్ష్మణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్లే బీసీలు తీవ్రంగా నష్టపోయారని, ముస్లింలు బీసీల కోటాలో రిజర్వేషన్లు కాజేస్తున్నారంటే అందుకు కారణం కాంగ్రెస్సే కారణమని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శలు చేశారు. మాజీ డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్ కూడా బీసీ కోటాలో డిప్యూటీ మేయర్ అయ్యారన్నారు. హైదరాబాద్ లో బీసీ జర్నలిస్టు సంఘం మంగళవారం నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనాభాలో 50 శాతం కంటే ఎక్కువగా ఉన్న బీసీల ఎదగకపోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. బీసీలు ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిపోయారని ఆయన ఫైరయ్యారు. ఓటును ఆయుధంగా ఉపయోగించి బీసీలను ఎదిగేలా చేసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉందన్నారు.

బీసీ జర్నలిస్టులంతా సోషల్ మీడియా వారియర్లుగా మారాలని ఆయన కోరారు. వారి ఆలోచన విధానాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తి పరచాలన్నారు. అంబేద్కర్ బీసీల సంక్షేమం కోసం నెహ్రూ వద్ద ప్రతిపాదన పెడితే.. నెహ్రూ ససేమీరా అన్నారని ఫైరయ్యారు. కానీ ఇప్పుడు తెలంగాణలో రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీన్ని మీడియాలో చూపించడం లేదని, కనీసం సోషల్ మీడియా ద్వారా అయినా వివరించాలన్నారు. రాజీవ్ గాంధీ కూడా కులాల రిజర్వేషన్లను వ్యతిరేకించారని, మండల కమిషన్ ని విభేదించారని లక్ష్మణ్ గుర్తుచేశారు.

కులం పేరుతో కాకుండా ఆర్థిక స్థితిగతులపై ఉద్యోగ రిజర్వేషన్ ఇవ్వాలని రాజీవ్ గాంధీ ప్రతిపాదించారని, మోడీ మొదటిసారి ప్రధాని అయ్యాక బిల్లు లోక్ సభలో పెట్టగా బీజేపీకి బలం ఉండి బిల్ పాస్ అయింది, కానీ రాజ్యసభలో బిల్ ప్రవేశ పెడితే, కాంగ్రెస్, కమ్యూనిస్టులు వ్యతిరేకించడంతో బిల్ పాస్ కానివ్వలేదని గుర్తుచేశారు. అయినా మోడీ పట్టు వదలకుండా రాజ్యసభలో బీజేపీకి బలం చేకూరాక బిల్ పాస్ చేయించారని కొనియాడారు. బీసీలకు నీట్ లో 27 శాతం రిజర్వేషన్లను పెంచింది మోడీయేనన్నారు. బీసీలపై కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోందని ఆయన ఫైరయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీ కమిషన్ రిజర్వేషన్ లెక్కలు తేలిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని తాము భావిస్తున్నట్లు చెప్పారు.

రాజ్యాంగం మార్చాలని మాట్లాడిన కేసీఆర్ పై కాంగ్రెస్ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణా ఏర్పడితే చిన్న కులాలు బాగుపడతాయని అనుకున్నారని, కానీ కనీసం ఇతర పార్టీల్లో బీసీలు కనీసం పార్టీ అధ్యక్షులుగా అయ్యే అవకాశం లేకుండాపోయిందని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తంచేశారు. అదే బీజేపీలో తనలాంటి సామాజిక కార్యకర్తకు పార్లమెంటరీ బోర్డు మెంబర్ గా మోడీ అవకాశం కల్పించారని పేర్కొన్నారు. మోడీ ప్రధాని అవ్వకముందు వర్సిటీల్లో 9 మంది బీసీ ప్రొఫెసర్లు మాత్రమే ఉండేవారని, అదే మోడీ ప్రధాని అయ్యాక 9 వేల మంది బీసీ ప్రొఫెసర్లు ఉన్నారన్నారు.

Advertisement

Next Story

Most Viewed