ట్యాక్స్ 'సెటిల్ మెంట్' లేనట్టేనా?

by Seetharam |
ట్యాక్స్ సెటిల్ మెంట్ లేనట్టేనా?
X

దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్‌కు సంబంధించి వన్ టైం సెటిల్‌మెంట్ (ఓటీఎస్) స్కీం నిలిచిపోయింది. పేరుకుపోయిన మొండి బకాయిలను వసూలు చేసుకునేందుకు ..గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో సర్కారు అమలు చేసిన వన్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీం ఈసారి అమలు చేసే అవకాశాలు కన్పించటం లేదు. గడిచిన రెండేళ్లలో వన్‌టైమ్ సెటిల్‌మెంట్ స్కీంను అమలు చేయాలని సర్కారును జీహెచ్ఎంసీ కోరేది. ప్రతీ ఏడాది జూలై మధ్య నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు ఈ స్కీంను అమలు చేస్తూ జీహెచ్ఎంసీ వందల కోట్ల మొండి బకాయిలను వసూలు చేసుకునేది. ఈ ఏడాది జూలై రెండో వారం తర్వాత అమల్లోకి రావల్సిన వన్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీంను జీహెచ్ఎంసీ పరిధిలో అమలు చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ జీహెచ్ఎంసీ ఇప్పటివరకు సర్కారుకు ఎలాంటి లేఖ రాయలేదు. దీంతో ప్రాపర్టీ ట్యాక్స్‌కు సంబంధించిన వన్‌టైమ్ సెటిల్‌మెంట్ లేనట్టేనా? అన్న ప్రశ్నకు అధికారుల నుంచి అవుననే సమాధానం వస్తుంది.

రెండెళ్లలో రూ.570 కోట్లు వసూలు

కరోనా సమయంలో 2020 ఆగస్టు 15 నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు అలాగే, మార్చి 1 నుంచి మార్చి నెలాఖరు వరకు రెండుసార్లు వన్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీంను అమలు చేసిన జీహెచ్ఎంసీ రూ.400 కోట్లను వసూలు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత 2021లో జూలై 10 నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు ఓటీఎస్‌ను అమలు చేసి సుమారు రూ.170 కోట్ల మొండి బకాయిలను వసూలు చేసుకున్నట్లు వెల్లడించారు. ఇలా రెండేళ్లలో మూడు సార్లు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ స్కీంను అమలు చేసిన జీహెచ్ఎంసీ రూ.570 కోట్లను వసూలు చేసుకున్నట్లు తెలిపారు.

మందగించిన ట్యాక్స్ కలెక్షన్

ఈ ఏడాది ప్రారంభ మాసమైన ఏప్రిల్‌లో ట్యాక్స్‌ను ముందస్తుగా వసూలు చేసుకునేందుకు ఐదుశాతం రాయితీనిస్తూ అమలు చేసిన ఎర్లీబర్డ్ స్కీం ముగిసింది. దీంతో జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తి పన్ను కలెక్షన్ బాగా మందిగించింది. నెల రోజుల పాటు ఎర్లీబర్డ్ స్కీంను అమలు చేసి దాదాపు రూ.787 కోట్లను వసూలు చేసుకున్న జీహెచ్ఎంసీ ఆ తర్వాత మే 1 నుంచి జూన్ 7 వరకు అంటే 38 రోజుల్లో కేవలం రూ.64 కోట్లు మాత్రమే వసూలైంది. సగటున రోజుకు కనీసం రూ.2 కోట్లు కూడా వసూలు కాలేదు. ఇందుకు కలెక్షన్ చేయాల్సిన ట్యాక్స్ సిబ్బందికి ఎలక్షన్ డ్యూటీలు వేయటంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story