Governor: గవర్నర్ టార్గెట్‌గా కేసీఆర్ మరో బిగ్ డెసిషన్?

by samatah |   ( Updated:2022-12-03 06:29:32.0  )
Governor: గవర్నర్ టార్గెట్‌గా కేసీఆర్ మరో బిగ్ డెసిషన్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ప్రభుత్వానికి గవర్నర్‌కు మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. సర్కార్ పంపించిన బిల్లులను గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపకుండా తన వద్దే పెండిగ్ లో పెట్టుకోవడంతో ప్రగతి భవన్‌కు రాజ్ భవన్‌కు మధ్య మరింత గ్యాప్ పెంచుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి చాలా కాలంగా సర్కార్‌కు గవర్నర్‌కు మధ్య పొసగడం లేదు. అయితే ఇటీవల కేసీఆర్ ప్రభుత్వంపై గవర్నర్ దూకుడు పెంచారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలపై గవర్నర్ వెనువెంటనే స్పందించడం వాటిపై నివేదికలు కోరడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతోందనే చర్చ జరుగుతోంది.


ఈ నేపథ్యంలో గవర్నర్ టార్గెట్ గా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం బిగ్ డిసిషన్ తీసుకోబోతోందనే టాక్ వినిపిస్తోంది. యూనివర్సిటీ నియామక బోర్డు బిల్లు విషయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో పాటు వెళ్లి గవర్నర్ ను కలిశారు. బిల్లుపై గవర్నర్ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇచ్చి వచ్చారు. వివరణ ఇచ్చి వారాలు గడుస్తున్నా బిల్లుపై గవర్నర్ ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోకపోవడం ప్రభుత్వానికి మరింత ఆగ్రహం తెప్పిస్తోందనే ప్రచారం జరుగుతోంది. అలాగే ములుగు ఉద్యానవన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రిని ఛాన్స్ లర్ గా నియమించే బిల్లును కూడా తమిళిసై ఇప్పటికీ పెండిగ్ లోనే ఉంచారు. దీంతో గవర్నర్ తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారని ఇక ఈ వ్యవహారాన్ని ఉపేక్షించకుండా కఠినంగా మరింత కఠినంగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.


ఈ మేరకు త్వరలో జరగబోయే శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ను విశ్వవిద్యాలయాల ఛాన్స్ లర్ పదవి నుంచి తప్పించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకుండా ప్రభుత్వం చూస్తోంది. ఈ విషయాన్ని గవర్నర్ మీడియా ముందే విమర్శలు గుప్పించారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు ముందే వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేలా ప్రణాళికలు వేసుకున్న ముఖ్యమంత్రి.. ఆ తర్వాత అసెంబ్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలను తూర్పారబట్టాలనే వ్యూహంలో ఉన్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఇదే సమయంలో గవర్నర్ వైఖరిపై కూడా ఓ నిర్ణయం తీసుకుంటే పనిలో పని అయిపోగొట్టవచ్చనే కాన్సెప్ట్ లో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఇటీవల కేరళ ప్రభుత్వం కూడా ఛాన్స్ లర్ పదవి నుంచి గవర్నర్ ను తప్పించేందుకు ఆర్డినెన్స్ ను తీసుకువచ్చింది. అయితే ఆ ఆర్డినెన్స్ ఇంకా ఆమోదం పొందలేదు. అయితే తెలంగాణలోనూ వర్సిటీల ఛాన్సలర్ పదవి నుంచి గవర్నర్ ను తప్పిస్తూ బిల్లును ప్రవేశపెట్టి అసెంబ్లీ ఆమోదం తెలిపినా చివరకు ఆ బిల్లుపై సంతకం చేయాల్సింది గవర్నరే కావడం విశేషం. దాంతో జరుగుతున్న ప్రచారం ప్రకారం గవర్నర్ విషయంలో ప్రభుత్వం నిజంగానే బిల్లును తీసుకు వస్తుందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది.


Also Read.......

పాదయాత్రలో బహిర్గతమైన వర్గపోరు

Advertisement

Next Story