- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యథేచ్చగా వ్యాపారం.. పక్కదారి పడుతోన్న పేదల ధాన్యం!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యం, రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ఇస్తున్న రేషన్ బియ్యం రెండూ అక్రమాలకు అడ్డాగా మారాయి. పేదలకు అందాల్సిన బియ్యాన్ని మిల్లర్లు కొట్టేస్తున్నారు. బియ్యాన్ని అందించాల్సిన రేషన్ డీలర్లు సైతం కార్డులు, డిజిటల్‌లో సాంకేతిక సమస్యలను చూపిస్తూ బియ్యం ఇవ్వకుండా అక్రమ మార్గంలో అమ్ముకుంటున్నారు. వెరసి రాష్ట్రంలో ప్రతి నెలా ఇస్తున్న రేషన్ బియ్యంలో దాదాపు 75 శాతం మిల్లులకు చేరి, మళ్లీ రేషన్ షాపులకు వస్తుండగా, మరోవైపు ఎక్స్ పోర్ట్ అవుతుంది. మొత్తం ఈ ప్రక్రియలో అధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితమవడంతో రోజురోజుకూ ఈ వ్యవహారం మరింత ఉధృతమవుతోంది.
ధాన్యం.. విక్రయం..
మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న ధాన్యం మిల్లులకు చేరిన తరువాత పక్కదారి పడుతోంది. రాష్ట్రంలో ఏటా వానాకాలం, యాసంగి సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సివిల్ సప్లై ద్వారా సర్కారు మిల్లింగ్‌కు ఇస్తోంది. మిల్లింగ్ అనంతరం సెంట్రల్ పూల్ కింద ఎఫ్‌సీఐకు, స్టేట్ పూల్ కింద రాష్ట్రానికి మిల్లర్లు ధాన్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మిల్లింగ్ చేసి ఇవ్వాల్సిన మిల్లర్లు, వాటిని ఎక్స్ పోర్ట్ చేసుకుంటున్నారు. అనంతరం స్టేట్, సెంట్రల్ పూల్‌కు ఇవ్వాల్సిన ధాన్యాన్ని మాత్రం జాప్యం చేస్తున్నారు.
రేషన్ బియ్యమే.. సీఎంఆర్‌కు..
ప్రభుత్వం సీఎంఆర్ కోసం మిల్లర్లకు ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు ముందుగానే మిల్లింగ్ చేసుకుని బయటకు విక్రయించుకుంటున్నారు. అనంతరం సీఎంఆర్ లెక్క కోసం రేషన్ బియ్యాన్ని చూపిస్తున్నారు. ఇందుకోసం గ్రామాలు, మండల కేంద్రాల్లో ఏజెంట్ల వ్యవస్థను ఏర్పాటుచేసుకుని వ్యాపారం సాగిస్తున్నారు. పీడీఎస్ బియ్యాన్ని ఏజెంట్ల ద్వారా సేకరించిన తరువాత మిల్లర్లు వాటిని పాలిష్ చేసి ఎఫ్‌సీఐ, స్టేట్ పూల్‌కు అప్పగిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణ చేస్తున్న వాహనాలు పట్టుబడడమే నిదర్శనం. రాష్ట్రంలో 2019–20 యాసంగి సీజన్ నుంచి ప్రస్తుత సీజన్ సీఎంఆర్ వరకు పూర్తి స్థాయిలో రికవరీ కాకపోవడానికి కూడా ఇదొక కారణంగా కనిపిస్తోంది. సీఎంఆర్ జాప్యానికి సివిల్ సప్లై జరిమానాలు విధించినా మిల్లర్లు వాటిని బేఖాతరు చేస్తూ వ్యాపారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. దీంతో రాష్ట్రంలో ధాన్యం, బియ్యం మిల్లర్లకు వ్యాపారంగా మారాయి.
తనిఖీలు లేవు, స్టాక్ లెక్క తేలట్లే..
రాష్ట్రంలో కొనుగోలు ద్వారా సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్ కోసం జిల్లాల్లోని మిల్లులకు ఇచ్చిన ధాన్యం లెక్క తేలట్లేదు. మరోవైపు రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు డీలర్లకు ఇస్తున్న రేషన్ బియ్యం స్టాక్‌ల్లోనూ లెక్కలు తేలట్లేదు. ఫలితంగా రాష్ట్రంలో మిల్లర్లకు పీడీఎస్ బియ్యం, ధాన్యం కాసుల వర్షం కురిపిస్తోంది. సీఎంఆర్ ఆలస్యంతో తనిఖీలు చేపడుతున్న అధికారులకు పూర్తిస్థాయిలో ధాన్యం లెక్క తేలట్లేదు, మరోవైపు రేషన్ దుకాణాల్లో స్టాక్ అంశమూ ప్రయాసగా మారింది. ఇటీవల అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఓ గ్రామంలో దాదాపు 86 క్వింటాళ్ల రేషన్ బియ్యం లెక్క తేలకపోవడంతో ఆ దుకాణాన్ని అధికారులు సీజ్ చేశారు.
సివిల్ సప్లై అంటే భయం లేదు..
రాష్ట్రంలోని మిల్లర్లకు, రేషన్ డీలర్లకు పౌరసరఫరాల శాఖ అంటే భయం లేకనే యథేచ్చగా వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి కూడా గత మూడు సీజన్ల నుంచి రాష్ట్రంలోని సీఎంఆర్ లెక్కలు తేలడం లేదు. ఖమ్మం జిల్లాలో అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న అధికారులు ఇంతవరకూ ఆ రెండు మిల్లుల వ్యవహరంపై ఏమీ తేల్చలేదు. అధికారులు మిల్లర్లు ఇస్తున్న అమ్యామ్యాలకు అలవాటు పడడంతోనే ధాన్యం, బియ్యం బ్లాక్ మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నదని తెలుస్తున్నది. కానీ అధికారులు, సివిల్ సప్లై ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటే ఈ వ్యాపారానికి అడ్డుకట్టే పడే అవకాశం ఉన్నా.. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.