మత్తులో చిత్తు.. గంజాయి అడ్డాలుగా మారిన కార్మికవాడలు

by Sathputhe Rajesh |
మత్తులో చిత్తు.. గంజాయి అడ్డాలుగా మారిన కార్మికవాడలు
X

దిశ, నస్పూర్ : పారిశ్రామిక ప్రాంతమైన నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో యువత మత్తుకు బానిసవుతోంది. పలువురు గంజాయి తాగుతూ విచక్షణ కోల్పోయి దాడులకు పాల్పడుతున్నారు. కార్మిక కాలనీల్లో జూలాయిగా తిరిగే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గతంలోనూ క్రైమ్ రెట్ అధికంగా ఉండడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి కౌన్సెలింగ్ చేసి అవగాహన కల్పించేవారు. ప్రస్తుతం కొంతమంది యువకులు మళ్లీ జులాయిగా తిరుగుతూ చెడు అలవాట్లకు బానిసవుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడులకు దిగి బెదిరిస్తున్నారు. దీంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్లో చిచ్చు రేపుతోంది. నియంత్రించాల్సిన సంబంధిత శాఖల అధికారులు చోద్యం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మత్తులో దాడులు

మద్యం, గంజాయి మత్తులో ఉన్న యువత విచ్చలవిడిగా తిరుగుతూ వాహనలతో భయబ్రాంతులకు గురయ్యేలా నడపడం, రాత్రి సమయంలో గుంపులుగా తిరుగుతూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. గంజాయి తాగడం అనేది స్కూల్ పిల్లలకు ఫ్యాషన్గా మారింది. రెండు రోజుల క్రితం ప్రగతి స్టేడియంలో విద్యార్థులే గ్రూప్ లుగా ఏర్పాడి దాడులు చేసుకోవడంతో అక్కడ ఉన్న వారు భయందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో ప్రగతి స్టేడియం,కృష్ణ కాలనీలోని శాంతి స్టేడియం పక్కనే ఉన్న సింగరేణి క్వార్టర్స్ గంజాయికి అడ్డగా మారిందనే చర్చ సాగుతుంది.

తల్లిదండ్రుల అప్రమత్తత అవసరం

విద్యార్థి దశ నుంచి పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి. ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన సూచనలు సలహాలు ఇవ్వాలి. లేకుంటే వారు చెడు మార్గంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. గంజాయికి అలవాటు పడితే ఆరోగ్యంతో పాటు భవిష్యతు నాశనమవుతుంది.

కొరవడిన నిఘా

యువత అలవాట్లు వారి ప్రవర్తనపై నిఘా కొరవడిందనే వాదన ఉంది. గతంలో కార్మిక కాలనీలలో సాయంత్రం పెట్రోలింగ్ చేసేవారు. టెక్నాలజీ పెరిగిన శ్రద్ధ లేకపోవడంతో కాలనీల యవతపై నిఘా కొరవడిందనే వాదన ఉంది. పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహించి యువతను సన్మార్గంలో నడిచేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story