ఎస్సీ, ఎస్టీ, మానవ హక్కుల కమిషన్లకు చైర్మన్లను నియమించండి.. ఇందిరా శోభన్

by Javid Pasha |
ఎస్సీ, ఎస్టీ, మానవ హక్కుల కమిషన్లకు చైర్మన్లను నియమించండి.. ఇందిరా శోభన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మానవ హక్కుల కమిషన్ల చైర్మన్లను నియమించాలని తెలంగాణ ఆత్మ గౌరవ వేదిక అధ్యక్షురాలు ఇందిరా శోభన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్ ల నియామకం చేపట్టకుండా జాప్యం చేస్తూ అణగారిన బలహీన వర్గాల హక్కులకు భంగం కలిగిస్తోందని ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ హక్కుల కమిషన్ల చైర్మన్ల పదవీ కాలం ముగిసి సంవత్సరం, మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ పదవీకాలం ముగిసి నెలలు గడుస్తున్నా చైర్మన్ల నియామకం చేపట్టకుండా ఎందుకు జాప్యం చేస్తోందని ఒక ప్రకటనలో ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన కూడా కోర్టు మెట్లు ఎక్కితేగానీ లేక తమలాంటి వాళ్ళు పోరాడితే గానీ ఎస్సీ , ఎస్టీ , మానవ హక్కుల కమిషన్లకు చైర్మన్ లు రాలేదని అన్నారు.

ఇటీవల ఎమ్మెల్సీ కవిత తన హక్కులకు భంగం కలిగిందంటూ మహిళా కమిషన్ కు పిర్యాదు చేయడం వల్ల బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి నోటీసులు పంపి స్వయంగా హాజరై బండి సంజయ్ వివరణ ఇచుకోవాల్సి వచ్చిందని ఆమె గుర్తు చేశారు. రాష్ట్ర గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కి మహిళ కమిషన్ నోటీసు లు పంపడమేకాకుండా స్వయంగా హాజరై క్షమాపణ కోరడం జరిగిందని ఇలాంటి శక్తివంతమైన కమిషన్లకు చైర్మన్ లను ఎందుకు నియమించటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సచివాలయంలోకి సామాన్యులకు అవకాశం కల్పించడం లేదని, దీనిపై తెలంగాణ సీఎంవో, సీఎస్ లకు మెయిల్ చేస్తూ వాటిని రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించానన్నారు. ఈ నెలాఖరులోగా స్పందించక పోతే కోర్టుకు వెళ్తానని ఆమె హెచ్చరించారు .

Advertisement

Next Story