NEW RATION CARDS:కొత్త రేషన్ కార్డులకు అర్హతలు ఇవే! కేబినెట్ సబ్ కమిటీ ముందుకు ప్రతిపాదనలు

by Prasad Jukanti |
NEW RATION CARDS:కొత్త రేషన్ కార్డులకు అర్హతలు ఇవే! కేబినెట్ సబ్ కమిటీ ముందుకు ప్రతిపాదనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలోని అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయింది. సమావేశానికి మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెల్లరేషన్ కార్డు కోసం ఆదాయ పరిమితిపై కీలకంగా చర్చ జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం లక్షన్నర, 3.50 ఎకరాల మాగాణి లేదా 7.5 ఎకరాల చెలక భూమి కలిగిన వారిని ఎంపిక చేయాలని, పట్టణ ప్రాంతాల్లో భూములను కాకుండా వార్షిక ఆదాయం గరిష్టంగా రెండు లక్షలలోపు ఉన్నవారిని అర్హులుగా ఎంపిక చేయాలనే ప్రతిపాదనలు వచ్చాయని మంత్రి ఉత్తమ్ చెప్పారు.

పాత కార్డు స్థానంలో స్వైపింగ్ కార్డులు!

కొత్త తెల్లరేషన్ కార్డుల మంజూరీలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారెవరూ ఈ అవకాశం కోల్పోకుండా దీనిపై లోతైన అధ్యయనం జరుపుతున్నామని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా అధికార, ప్రతిపక్షాలకు చెందిన ప్రజా ప్రతినిధులందరి నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. విధివిధానాల ఖరారు విషయంలో తక్షణమే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ లేఖలు రాసి వారి నుంచి సూచనలు తీసుకోవాలని అధికారులను ఉత్తమ్ ఆదేశించారు. సక్సేనా కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే దేశంలోని మిగతా రాష్ట్రాలలో అవలంబిస్తున్న విధి విధానాలను అధికారుల టీమ్ అధ్యయనం చేసినట్లు మంత్రి వెల్లడించారు. అంతర్ రాష్ట్రాల నుంచి వలస వచ్చినవారికి రెండు చోట్లా తెల్లకార్డులు ఉన్నట్లైతే వారికి ఆప్షన్ ఇవ్వాలనే ప్రతిపాదనపై చర్చించామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయనని, కాంగ్రెస్ ప్రభుత్వ కొత్త కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించడంతో 10 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. కాగా పాత రేషన్ కార్డుల స్థానంలో స్వైపింగ్ కార్డుల రూపంలో కొత్త కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

కేబినెట్‌ సబ్‌ కమిటీ ప్రతిపాదనలు..

- అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు

- గ్రామీణ ప్రాంతాలలో రూ. లక్షన్నర వార్షిక ఆదాయం లేదా మాగాణి 3.50 ఎకరాలు, లేదా చెలక 7.05 ఎకరాల లోపు భూమి

- పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 2 లక్షలు

- పట్టణాల్లో వార్షిక ఆదాయం ఆధారంగా మంజూరు

- విధి, విధానాల రూపకల్పనలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం

- ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలను పరిగణనలోకి..

- సక్సేనా కమిటీ సిఫారసులు సైతం..

- మిగతా రాష్ట్రాలలో అర్హత ప్రమాణాల పరిశీలన

- అంతర్ రాష్ట్రాలలో రెండు కార్డులు ఉంటే ఆప్షన్

Advertisement

Next Story