మంత్రి తుమ్మల శుభవార్త.. ఇక ఆ పంటలకూ స్ప్రింక్లర్ సౌకర్యం

by Prasad Jukanti |
మంత్రి తుమ్మల శుభవార్త.. ఇక ఆ పంటలకూ  స్ప్రింక్లర్ సౌకర్యం
X

దిశ, డైనమిక్ బ్యూరో: డ్రిప్ మరియు స్ప్రింక్లర్ సౌకర్యం కేవలం ఆయిల్ పామ్ పంటకే కాకుండా ఇతర పంటలకు వర్తింపచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని అందుకు అనుగుణంగా ప్రణాళికలు చేసుకోవాలని సంబంధిత అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఫలితాలు చూపని ఆయిల్ ఫామ్ కంపెనీలపై వెంటనే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. శనివారం సచివాలయంలో మార్కెటింగ్, కో ఆపరేటివ్, సంబంధిత కార్పొరేషన్ ల రాష్ట్ర స్థాయి అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విత్తన కంపెనీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన హామీ మేరకు పత్తి విత్తన ప్యాకెట్లు సరఫరా చేశారా? లేదా? అధికారులు తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఒక వేళ రాష్ట్రానికి ఆ ప్యాకెట్లు వస్తే అవన్నీ రైతులకు చేరాయా లేదా కూడా తనిఖీ చేపట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ రాష్ట్రానికి అవసరం మేర ఎరువులు రెండు నెలల ముందుగానే తెప్పించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పంటల నమోదు ప్రక్రియ ఎటువంటి లోపాలకు తావులేకుండా పారదర్శకంగా జరగాలని ఆదేశించారు.

వ్యవసాయ శాఖ, ఉద్యానశాఖ, ఇతర శాఖల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను దేనికోసమైతే కేటాయించాలో, ఆ లక్ష్యాలు నేరవేర్చేవిధంగా ఉపయోగంలోకి తీసుకువచ్చి, రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్నారు. విత్తనోత్పత్తి క్షేత్రాలలో విత్తనోత్పత్తి, ప్రభుత్వ నర్సరీలలో పూలు, పండ్ల మొక్కలు ఉత్పత్తి చేసి రైతులకు తక్కువ ధరలో నాణ్యమైన విత్తనాలను, మొక్కలను సరఫరా చేసేవిధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మార్కెటింగ్ మరియు గిడ్డంగుల అధికారులు, మార్క్ ఫెడ్ అధికారులతో సమీక్షిస్తూ.. గతంలో సూచించిన విధంగా సౌరవిద్యుత్ యూనిట్లను నెలకొల్పె అవకాశాలపై సంస్థల వారిగా ప్రగతిని ఆరాతీశారు. పహాడీషరీఫ్ లో వక్ఫ్ భూములలో ఏర్పాటుచేసిన తాత్కలిక షెడ్లలో సబ్ మార్కెట్ ప్రారంభించేందుకు అవకాశాలను పరిశీలించవలసిందిగా మార్కెటింగ్ సంచాలకులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశానికి సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.

Advertisement

Next Story