అక్రమ నిర్మాణాలు.. ఆఫీసర్ల నో మానిటరింగ్!

by Sathputhe Rajesh |
అక్రమ నిర్మాణాలు.. ఆఫీసర్ల నో మానిటరింగ్!
X

హన్మకొండ జిల్లాలో అక్రమనిర్మాణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిర్మాణదారులు నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నగరంలో 70శాతం నిర్మాణాలు అక్రమమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. సెట్​బ్యాక్ ​లేకుండా ఇంటి నిర్మాణాలు, అనుమతి లేకుండా సెల్లార్ల ఏర్పాటు చేపడుతున్నారు. కళ్లెదుటే అక్రమ భవంతులు కనిపిస్తున్నా సబంధిత అధికారులు కభోదుల్లా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కేవలం నోటీసులు అందజేసి చేతులు దులుపుకుంటున్నారనే వాదనలు ఉన్నాయి. రాజకీయ పలుకుబడి, మామూళ్ల పర్వంతోనే ఆకాశన్నంటేలా నిర్మాణాలు వెలుస్తున్నాయి. పెద్దపెద్ద వాణిజ్య సముదాయాలకు కూడా సెల్లార్‌ పార్కింగ్‌ లేవు. ఆస్పత్రులు, షాపింగ్‌మాల్స్‌ ఎదుట రోడ్లపైనే పార్కింగ్‌ చేస్తున్నా కార్పొరేషన్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. ర్యాంపులతో రోడ్లను ఆక్రమిస్తున్నా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మరో వైపు పచ్చదనం కొరవడడంతో కాంక్రీట్​జంగల్‌గా నగరం మారుతోంది.

–దిశ, హన్మకొండ టౌన్

దిశ, హన్మకొండ టౌన్ : హన్మకొండలో భవన నిర్మాణదారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఏటా వందల సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తుండగా 70 శాతం వరకు నిబంధనలకు విరుద్ధంగానే సాగుతున్నాయి. సెట్‌బ్యాక్‌ మొదలుకొని సెల్లార్లు, అనుమతి లేని అంతస్తులు కళ్ల ఎదుటే నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మున్సిపాలిటీ నుంచి తీసుకున్న అనుమతికి క్షేత్రస్థాయిలో చేపట్టిన నిర్మాణాలకు సంబంధం ఉండడం లేదు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో అసలు సెల్లార్ల నిర్మాణానికి అనుమతులే లేవు.

అయినా 100 గజాల స్థలంలోనూ సెల్లార్‌ నిర్మిస్తున్నారు. బహుళ అంతస్తుల భవనాల్లో 70 శాతానికి పైగా నిర్మాణాలకు సెల్లార్లు ఉంటున్నాయి. పైగా సెమీ సెల్లార్‌ పేరుతో అధికారుల కళ్లకు ‘మామూలు’గానే గంతలు కడుతున్నారు. సెల్లార్‌ నిర్మించి వ్యాపార అవసరాల కోసం అద్దె ఇచ్చుకుంటున్నారు. పెద్దపెద్ద వాణిజ్య సముదాయాలకు కూడా సెల్లార్‌ పార్కింగ్‌లు లేవు. ఆస్పత్రులు, షాపింగ్‌మాల్స్‌ ఎదుట రోడ్లపైనే పార్కింగ్‌ చేస్తున్నారు. కార్పొరేషన్‌ అధికారులు సైతం అప్పుడప్పుడు హడావిడి చేస్తూ నోటీసులతో చేతులు దులుపుకుంటున్నారు.

పెంట్‌హౌస్‌లపై చర్యల్లేవు..

భవన నిర్మాణాల్లో నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. స్థలాన్ని బట్టి సిల్ట్​తో కలుపుకొని జీ+1 నుంచి జీ+4 వరకు అనుమతులు ఇస్తుంటారు. 100 గజాలలోపు స్థలం ఉంటే జీ+1, 200 గజాలపైన ఉంటే జీ+2, 500 గజాల స్థలం ఉంటే జీ+4 వరకు అనుమతులు మంజూరు చేస్తారు. అయితే భవనం చిన్నదైనా, పెద్దదైనా అసలుకు కొసరు ఉండాల్సిందే అన్నట్లు నిర్మాణదారులు తయారయ్యారు.

రెండు నుంచి నాలుగు అంతస్తుల వరకు ఉండే భవనాల్లో తప్పనిసరిగా పెంట్‌హౌస్‌ నిర్మిస్తున్నారు. అధికారులు అడ్డుకుంటే రాజకీయ పలుకుబడి, లేదంటే డబ్బు ఎరజూపుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ సెల్లార్లు, పెంట్‌హౌస్‌లపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

కొరవడిన పచ్చదనం..

సీసీ, తారు రోడ్లతో పచ్చదనం కొరవడుతోంది. రోడ్ల పక్కనే భారీ భవంతులు వెలుస్తున్నాయి. నిర్మాణాలకు అనుమతులు పొందే ముందు విధిగా మొక్కలు నాటాలనే నిబంధన ఉంది. దీనిని సక్రమంగా అమలు చేసేలా పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. జిల్లాలోని పురపాలికల్లో నూతనంగా నిర్మిస్తున్న భవనాల వద్ద మొక్కలు నాటిన దాఖలాలు ఎక్కడా లేవు.

పర్యవేక్షణ ఏదీ?

పట్టణాల్లో ఎక్కడ ఇళ్లు నిర్మిస్తున్నారో అధికారులు, సిబ్బందికి స్పష్టత ఉండడం లేదు. ఆన్​లైన్​లో దరఖాస్తు ఆమోదించిన తరువాత క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. నిబంధనలు అతిక్రమిస్తున్నారా లేదో పర్యవేక్షించాలి. జిల్లాలో మొక్కలు నాటేందుకు స్థలం వదలకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు. పచ్చదనం పెంపొందించే విషయంలో ప్రభుత్వ ఆశయం అమలు కావడంలేదు. పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు కార్యాలయాల్లో కూర్చుని అనుమతులిచ్చేసి తరువాత పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..!

నిర్మాణాల వద్ద విస్తీర్ణానికి అనుగుణంగా కనీసం నాలుగు మొక్కలైనా నాటాలి. 300 గజాలు ఉంటే ఎనిమిది ఉండాలి. ఈ విషయాన్ని పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు పరిశీలించాలి. పచ్చదనం లేకుంటే ఆక్యుపెన్సీ ధ్రువీకరణ పత్రం ఇవ్వకూడదు. ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం గజం స్థలం వదలకుండా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి మరీ.

Advertisement

Next Story