సీబీఐ వస్తే దొరికిపోతామని సిట్‌తో సైలెంట్‌గా సెట్!

by Nagaya |   ( Updated:2023-05-15 11:05:59.0  )
YSRTP Chief YS Sharmila Visits Flood Affected Areas In Khammam
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ సూత్రధారులు బయట నిర్దోషులుగా తిరుగుతుంటే పాత్రధారులు బెయిల్ పై బయటపడుతున్నారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. ప్రగతి భవన్ ప్రొడక్షన్, చిన్న దొర డైరెక్షన్‌లో టీఎస్ పీఎస్సీ సిట్ దర్యాప్తు కథ కంచికి చేరినట్లేనన్నారు. ఐటీ శాఖ వైఫల్యం, కేటీఆర్ నిర్లక్ష్యం వల్లే ఈ స్కాం జరిగిందని ఆరోపించారు. సోమవారం వరుస ట్వీట్ల ద్వారా స్పందించిన ఆమె ఈ కేసులో సీబీఐ రంగంలోకి దిగితే దొరుకుతామనే భయపడ్డ దొరలు.. సిట్‌తో సైలెంట్‌గా సెట్ చేశారని ధ్వజమెత్తారు.

30 లక్షల మంది జీవితాలతో చెలగాటమాడిన అతిపెద్ద కుంభకోణంలో చివరికి బోర్డును కూడా కదిలించలేకపోయారని ఆరోపించారు. దొంగలకే తాళాలు ఇచ్చిన చందంగా మళ్లీ పాత బోర్డు సభ్యులతోనే పరీక్షలు పెడుతున్నారని ఇలా చేయడం ద్వారా మారింది పరీక్ష తేదీ మాత్రమేనని అదే బోర్డు, అదే లీకులు అవే కంప్యూటర్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. కొత్త తేదీలతో పరీక్షలు నిర్వహించినంత మాత్రాన ఇంటి దొంగలు మళ్లీ పేపర్లు అమ్ముకోరనే గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు. టీఎస్ పీఎస్సీ స్కాం తర్వాత తీసుకున్న చర్యలేంటి? ఇప్పటికేనా సీఎం కేసీఆర్ నోరు విప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed