KTR:‘రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ’.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2024-11-14 15:30:03.0  )
KTR:‘రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ’.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో :రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ ఉన్నట్టు ఉందని, అందుకే నన్ను టార్గెట్ చేస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో గురువారం మీడియాతో చిట్ చాట్ చేశారు. లగచర్లలో భూముల సేకరణ అంశంలో ప్రభుత్వం తీవ్రంగా భంగపడిందన్నారు. దాన్ని కవర్ చేసుకునేందుకే ఇది కుట్ర అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వం రైతుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తోందని, దాడి చేశారంటూ దాదాపు 50 మంది రైతులను స్థానిక ఎస్పీ దగ్గరుండి కొట్టించాడని ఆరోపించారు. బీఆర్ఎస్ వాళ్లను కొట్టి మిగతా పార్టీ వాళ్లను వదిలేశారని, సంఘటన జరిగినప్పుడు అక్కడ లేని బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా తీసుకెళ్లి అమానుషంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే గతంలో మానవ హక్కుల గురించి మాట్లాడిన కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్లు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.

నిజంగా లగచర్లలో మేము కుట్ర చేసినట్లైతే మీడియా వాళ్లు వెళ్లి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు అని, మీరు ఆ గ్రామానికి వెళ్తే ప్రజలే ఏమీ జరిగిందో చెబుతారన్నారు. సురేష్ అనే వ్యక్తి మా పార్టీ కార్యకర్తేనని, ఆయనకు భూమి ఉందన్నారు. భూమి లేని వాళ్లే గొడవ చేశారంటూ పోలీసులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు, ఐపీఎస్ అధికారుల్లారా ఇంత స్వామి భక్తి వద్దు... అని మళ్లీ నాలుగేళ్ల తర్వాత మేమే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. లగచర్ల లో జరిగిన ఘటనలో పూర్తిగా ఇంటలిజెన్స్, పోలీసుల వైఫల్యం ఉందన్నారు. అభిప్రాయ సేకరణ జరుగుతున్న సమయంలో పోలీసులు ఎందుకు అక్కడ లేరన్నారు. పట్నం నరేందర్ రెడ్డి ఏదో నా పేరు చెప్పాడని రిమాండ్ రిపోర్ట్ లో రాశారని, కానీ అదంతా బాక్వాస్ అని పట్నం నరేందర్ రెడ్డి లేఖ రాశారన్నారు. రైతులపై దాడికి పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ కు వెళ్లినట్లు వెళ్లారన్నారు. పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తూ రైతులను ఇష్టమొచ్చినట్లు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

నా మీద కేసు పెడితే నేను ఊరుకుంటా.. అనుకుంటే రేవంత్ రెడ్డి అంతే పిచ్చోడు మరొకరు ఉండరన్నారు. జైలు నుంచి వచ్చాక కూడా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. రైతులను పోలీసులు తీవ్రంగా కొట్టారు. వారికి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేయించలేదన్నారు. ఈ విషయాన్ని ఇంతటితో నేను వదిలిపెట్టనని, ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల, మహిళా కమిషన్ వరకు ఈ విషయాన్ని తీసుకెళ్తానని వెల్లడించారు. ఇప్పుడు సీఎం ప్రతిపాదిస్తున్న ఫార్మా విలేజ్ లకు పర్మిషన్ రావటానికి కూడా ఏడాది కి పైగా సమయం పడుతుందన్నారు. ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ అంటూ రేవంత్ రెడ్డి మాటలు చెబుతున్నాడని, కానీ అది జరగటం సాధ్యం కాదన్నారు. ఫార్మా విలేజ్ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. వెల్దడలో వాళ్ల బంధువులు, కుటుంబ సభ్యులకు భూములు ఉన్నాయన్నారు. సీఎం కు తన సొంత నియోజకవర్గంపై కూడా పట్టులేదని, కలెక్టర్ పై దాడి చేసేంత బలమైన వ్యక్తులా మేము? అన్నారు.అలా మేము చేయగలిగితే ఈ ప్రభుత్వం ఉన్నది ఎందుకు? మేము చెబితే రైతులు దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ లు, పెట్టుబడులు తేవాలంటే ఎంతో కష్టపడాలి. మా ప్రభుత్వంలో ప్రాజెక్ట్ లు పూర్తి చేసేందుకు హరీష్ రావు ఎంత కష్టపడ్డారో గుర్తు లేదా? వీళ్లకు ప్రభుత్వాన్ని నడపటం చేతకావటం లేదు.. ప్రాజెక్ట్ లు ఎలా పూర్తి చేయాలో తెలియదు అన్నారు.

నేను డ్రగ్స్ తీసుకోలేదు, ఫోన్లు ట్యాపింగ్ చేయలేదు, అవినీతి అంతకన్నా చేయలేదన్నారు. మోడీనే మోడీయా బోడీయా ఏం పీక్కుంటారో పీక్కో అన్నానని, చిట్టి నాయుడికి కూడా అదే చెబుతున్నా.. ఏం పీక్కుంటావో పీక్కో అని సవాల్ చేశారు. ఎంత ధైర్యం ఉంటే నేను ఈ మాట అనగలుగుతాను... నిజాయితీకి ఉన్న ధైర్యమే అదన్నారు. ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఫినిష్ చేస్తా అంటాడు. ముందు నువ్వు ఫినిష్ కాకుండా చూసుకో అని సూచించారు. నీ పదవికి ఎసరు పెట్టటానికి నల్గొండ, ఖమ్మం బాంబులు వేచి చూస్తున్నాయన్నారు. సొంత నియోజకవర్గం మీద కూడా పట్టు లేని నువ్వు అసలు ఏం సీఎం వి అని ప్రశ్నించారు. రైతులకు ఆ భూములే ఆసరా అని, అలాంటి భూములను గుంజుకుంటా అంటే వారికి కోపం రాదా? అన్నారు. అధికారం పోయిందని నాకు ఎలాంటి ఫ్రస్ట్రేషన్ లేదు.

అసలు అధికారం వస్తుందని కలలో కూడా నేను ఊహించలేదన్నారు. 10 ఏళ్లు ప్రజలు మాకు అవకాశం ఇవ్వటాన్ని అదృష్టంగా భావించానన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలని నేను కోరుకుంటున్నానన్నారు. వాళ్లు పూర్తికాలం అధికారంలో ఉంటేనే మళ్లీ బీఆర్ఎస్ 15 ఏళ్ల పాటు అధికారంలోకి ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో మార్పు అనేది వచ్చింది. కానీ అది మంచి మార్పు కాకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే మార్పు అయ్యిందన్నారు. అసలు ఫోర్త్ సిటీ కోసం ఈ ప్రభుత్వం ఒక్క ఎకరాం ల్యాండ్ అయినా సేకరించిందా? ఫార్మాసిటీ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తే ఊరుకోం అని స్పష్టం చేశారు. ప్రజలను ఎప్పటికీ మోసం చేస్తామంటే కుదరదు అన్నారు. నేను ఢిల్లీ కి పోయి కాంగ్రెస్ వాళ్ల మీద ఫిర్యాదు చేశాను... బీజేపీ తో దోస్తీ మాకు అవసరం లేదన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్లు ఇక్కడ గల్లీల్లోనే బీజేపీ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని మండిపడ్డారు.

Advertisement

Next Story