- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYDRA: చెరువుల దత్తత ఉత్తదే.. సీఎస్ఆర్‌తో లాభమెవరికి?
చెరువుల దత్తత.. ఉత్తదే
సీఎస్ఆర్ తో లాభమెవరికి?
రెండేండ్లల్లో చేసింది శూన్యం
బడా కంపెనీలకు ధారదత్తం
లేక్ వ్యూ ప్రాజెక్టులంటూ ప్రచారం
అదే చెరువు చుట్టూ వారి ప్రాజెక్టులే
కంపెనీలకు చెరువులను కట్టబెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం
25 చెరువులపై హైడ్రా ఎంక్వయిరీ చేస్తే నిజాలు
-శిరందాస్ ప్రవీణ్ కుమార్
దిశ, తెలంగాణ బ్యూరో: చెరువు పక్కనే స్థలం. అది ఎఫ్టీఎల్, బఫర్ జోన్.. అలాంటి పట్టింపులు ఏం లేవు. లేక్ వ్యూ ఫ్లాట్స్.. హై రైజ్డ్ బిల్డింగ్స్. డోర్ ఓపెన్ చేస్తే చాలు.. ఎదురుగా వాటర్ బాడీ కనిపిస్తుంది. అందమైన పక్షుల సౌండ్స్ మీకు వినిపిస్తాయి. ఆ చెరువు మనదే.. మనమే దత్తత తీసుకున్నాం. డెవలప్ చేస్తున్నాం. బోటింగ్, వాకింగ్ ట్రాక్స్, సైక్లింగ్, గేమ్స్, పార్క్.. అన్నీ చేసేస్తాం.. అంటూ అమ్మకాలు సాగిస్తున్నాయి. జీహెచ్ఎంసీ రాసిచ్చిన ఎంవోయూ కూడా చూపిస్తారు. సీఎస్ఆర్ కింద ఆ చెరువును అప్పగించినట్లు ప్రూఫ్స్ కస్టమర్లకు అందజేస్తారు. బల్దియా జారీ చేసిన సర్టిఫికేట్ ద్వారా బడా కంపెనీల ప్రచారం నడుస్తున్నది. ఇంకేముంది? ఆహా.. ఎంత భాగ్యం. నగరం నడిబొడ్డున ఇంట్లో కూర్చొని కూడా పల్లె వాతావరణాన్ని, ప్రకృతిని ఆస్వాదించొచ్చునంటూ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ చెరువు వారిది కాదు. దత్తత కూడా ఎల్లకాలం కాదు. కానీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అసలేం జరుగుతుంది? చెరువులను డెవలప్ చేస్తామని ఎంవోయూ కుదుర్చుకొని ఏం చేస్తున్నారు? దీని వల్ల ప్రభుత్వానికి ఏం ఉపయోగపడింది? సామాన్యులకు ఏం ఒరిగింది? అసలీ రెండేండ్లల్లో ఏ కంపెనీ ఎన్ని పనులు చేశాయి? ఇచ్చిన హామీలేమైనా నెరవేర్చిన డెవలపర్స్ ఉన్నారా? ఇప్పటి దాకా తట్టెడు మట్టి ఎత్తారా? కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సీఎస్ఆర్ పేరిట దత్తత సర్టిఫికేట్ తో మాత్రం సొమ్ము చేసుకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
25 చెరువుల అప్పగింత
రెండేండ్ల పాటు జీహెచ్ఎంసీతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద బ్యూటిఫికేషన్ చేయాలి. దీంట్లో భాగంగా చెరువు కట్ట అభివృద్ధి, ల్యాండ్ స్కేపింగ్, గ్రీనరీ, లైటింగ్, వాకింగ్ ట్రాక్స్, స్ట్రీట్ ఫర్నిచర్, పిల్లలు ఆడుకునేందుకు సదుపాయాలు కల్పిస్తామని ఈ కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 2022 జూలై ఆరో తేదీన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ తీర్మానం ప్రకారం 24 నెలల పాటు అప్పగించారు. కానీ చాలా కంపెనీలు ఏ పని చేయలేదు. కొన్ని నామమాత్రంగా ఏదో చేశామని చూపించాయి. ఇంకొన్ని తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ఈ కంపెనీలు బ్యూటిఫికేషన్ చేస్తే కబ్జాలు కాస్తయినా ఆగేవి. ఐతే నిర్మాణ సమయంలో ఎవరినీ రాకుండా నియంత్రించడానికే తామే చెరువును అభివృద్ధి చేస్తున్నామంటూ చెప్పుకోవడానికే ఈ ప్లాన్ వేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అందుకే జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఇంత కాలంగా వారేం పనులు చేయకపోయినా అడిగిన పాపాన పోలేదు. కానీ వాళ్లు మాత్రం లేక్ వ్యూ, లేక్ ఫ్రంట్ పేరిట మార్కెటింగ్ చేసుకుంటున్నారు.
ఆ చెరువులే ఎందుకు?
జీహెచ్ఎంసీ పరిధిలో.. ప్రధానంగా అత్యంత ఖరీదైన ప్రాంతాల్లోని చెరువులనే ఈ డెవలపర్స్ తాము డెవలప్ చేస్తామని దత్తత తీసుకోవడానికి కారణాలేమిటో తెలిస్తే షాక్ గురి కావాల్సిందే. చాలా కంపెనీలకు ఆ చెరువుల పక్కనే రూ.వందల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి. కొన్నేమో ఆ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి చొచ్చుకొచ్చాయి. ఇంకొన్నేమో బఫర్ జోన్ వదలకుండానే నిర్మాణాలు కొనసాగిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దాదాపు అన్నీ 25 ఎకరాలకు పైగా విస్తీర్ణం కలిగిన చెరువులే. ఎఫ్టీఎల్ తో పాటు కనీసం 30 మీటర్ల బఫర్ జోన్ ఉండాలి. వీటికి తిలోదకాలిస్తూ లగ్జరీయస్ అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నాయి. ఐతే ఈ చెరువులను తామే డెవలప్ చేస్తున్నామంటూ ప్రచారం చేయడం వెనుక బిజినెస్ మంత్రం ఉంది. దాన్ని ఆసరాగా చేసుకొనే మార్కెటింగ్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా స్థానికులు ఫిర్యాదు చేయడానికి ఆస్కారం కూడా లేకుండా చెరువు కూడా తమదేనంటూ దబాయించడానికి సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. కింది స్థాయి అధికారులు కూడా ఆ బడా కంపెనీ పట్ల ఉదాసీనంగా వ్యవహరించేందుకు దోహదపడింది. ప్రభుత్వంలోని పెద్దల అండదండలు పుష్కలంగా ఉండడంతో ఆ ఏరియా దరిదాపులకు కూడా వెళ్లే సాహసం చేయడం లేదు. పక్కనే ఖరీదైన ప్రాజెక్టులు ఉండడం, మార్కెటింగ్ కి దోహదపడుతుందన్న నేపధ్యంలోనే సీఎస్ఆర్ పేరిట చెరువులను చెరబట్టారు. అందుకే కొన్ని కంపెనీలు ఈ చెరువుకు వెళ్లే దారులు కూడా మూసేశారు. సామాన్యులెవరూ అటువైపు వెళ్లేందుకు వీల్లేకుండా సెక్యూరిటీని పెట్టారు. లోపల ఏం జరుగుతుందో తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవడం విశేషం.
ఆ చెరువులు కబ్జా పక్కా
గ్రేటర్ హైదరాబాద్ లో బడా కంపెనీల హస్తగతంలోని చెరువుల వాస్తవ విస్తీర్ణానికి, ప్రస్తుతం ఉన్న దాని మధ్య పొంతనే లేదు. హెచ్ఎండీఏ మ్యాపుల్లో చూపిస్తున్న విస్తీర్ణం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు మాయమయ్యాయి. కొన్ని చెరువులైతే సగానికి పైగా కబ్జాకు గురయ్యాయి. ఈ కంపెనీలు కూడా డెబ్రీస్ పోస్తూ డెవలప్మెంట్ పేరును వాడుతున్నాయి. నాలాలు, తూములు కూడా మూసుకుపోయాయి. అనేక రకాల నిర్మాణాలతో పాటు అడ్వర్టయిజ్మెంట్ హోర్టింగ్స్ కూడా కంపెనీలు ఏర్పాటు చేశాయి.
సీఎస్ఆర్ పై హైడ్రా దృష్టి పెట్టాలి
రాష్ట్రంలో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తున్నది. జీహెచ్ఎంసీలో చెరువుల పక్కనే ప్రాజెక్టులు నిర్మిస్తోన్న డెవలపర్స్ ఈ చెరువులను ఎందుకు దత్తత తీసుకున్నాయి? అసలీ చెరువుల విస్తీర్ణం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఆక్రమించేందుకే ఈ డెవలప్మెంట్, బ్యూటిఫికేషన్ వ్యవహారాన్ని నడిపారా? అన్న అనుమానాలకు హైడ్రా రంగంలోకి దిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. దత్తత తీసుకున్న ఈ రెండున్నరేండ్లల్లో ఏమేం పనులు చేశారు? ఆ పనులు వారి కస్టమర్లకేనా? స్థానికులందరికీ ఉపయోగపడుతున్నాయా? ప్రచారంలో లేక్ వ్యూ పేరిట లాభం పొందినది ఎంత? ప్రభుత్వమే చెరువుల రక్షణ చర్యలు చేపట్టకుండా వాటి పక్కనే ఉన్న ఈ డెవలపర్స్ కి ఇవ్వడం వెనుక రహస్యం ఏమిటో అంతుచిక్కని ప్రశ్నలకు క్షేత్ర స్థాయి దర్యాప్తుతోనే తెలుస్తుంది. ఎకరం రూ.100 కోట్లు పలుకుతున్న ఏరియాలో ఈ చెరువులను కాపాడే బాధ్యతను అప్పటి ప్రభుత్వం ఈ బడా కంపెనీలకు అప్పగించడం వెనుక ఏం దాగి ఉన్నదో హైడ్రా లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉంది.
చెరువు వెనుక ప్రాజెక్టులు
ప్రతి చెరువు ముందు వెనుకా హైరైజ్డ్ ప్రాజెక్టులే ఉన్నాయి. వారి ప్రాజెక్టులను ప్రమోట్ చేసుకునేందుకు సీఎస్ఆర్ పేరిట దత్తత తీసుకున్నారు. ఇతర చెరువులను అభివృద్ధి చేస్తామని చెప్పకుండా వారి స్వలాభం కోసమే ముందుకొస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించింది. ఎల్లమ్మ చెరువు ఎదురుగా భవ్యా తులసి వనం పేరిట నిర్మాణాలను చేపట్టింది. అలాగే గోపన్ పల్లి పెద్ద చెరువు పక్కనే తమ ప్రాజెక్టు అంటూ హానర్ కంపెనీ బ్రోచర్లలో అందంగా డిజైన్ చేయించుకున్నది. గోపన్ పల్లి చెరువు దగ్గరే అరబిందో హైరైజ్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇలాగే ప్రతి చెరువు దగ్గర దత్తత తీసుకున్న కంపెనీలే ఉండడం గమనార్హం. లేక్ వ్యూ, లేక్ ఫ్రంట్ అపార్ట్మెంట్స్ అంటూ ప్రచారానికి పనికొచ్చాయి.