Hydra: ఓవైసీ ఫాతిమా కాలేజీ కూల్చివేత కు రంగం సిద్ధం

by Ramesh Goud |   ( Updated:2024-08-27 15:35:56.0  )
Hydra: ఓవైసీ ఫాతిమా కాలేజీ కూల్చివేత కు రంగం సిద్ధం
X

దిశ, డైనమిక్ బ్యూరో: చెరువులు కుంటలు పరిరక్షణే ద్యేయంగా ఏవీ రంగానాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థ ఝూలు విధిలిస్తోంది. హైదరాబాద్ పరిధిలో చెరువులను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై ఉక్కుపాదం మోపుతోంది. చెరువులపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో హైడ్రానే హాట్ టాపిక్ గా మారింది. దీనిపై రేవంత్ రెడ్డి కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టినది ఎంతటి వారైనా వదిలి పెట్టేది లేదని తెగేసి చెప్పారు. దీంతో హైడ్రాకు మరింత ఊపు నిచ్చినట్టు అయ్యింది. చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి వరుసగా నోటీసులు పంపించి కూల్చివేతలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే అక్బరుద్దీన్ ఓవైసీకి చెందిన ఫాతిమా ఉమెన్స్ కాలేజీ కూల్చివేతకు హైడ్రా అధికారులు రంగం సిద్దం చేసినట్టు తెలుస్తోంది.

చాంద్రాయన్ గుట్టలో సలకం చెరువులో 12 ఎకరాలు కబ్జా చేసి ఫాతిమా ఓవైసీ కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యూకేషన్ కాలేజీ నిర్మాణం చేపట్టినట్లు హైడ్రాకు పలు ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై బీజేపీ నాయకులు ఓవైసీ సలకం చెరువును కబ్జా చేసి అక్రమంగా కాలేజీ నిర్మాణం చేపట్టారని, హైడ్రా అదికారులు చర్యలు చేపట్టి ఫాతిమా కాలేజీని కూల్చివేయాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఇప్పటికే కాలేజీ యాజమాన్యానికి నోటీసులు కూడా పంపారు. ఈ క్రమంలోనే హైడ్రా అధికారులు ఇవాళ సలకం చెరువు ఏరియాను పరిశీలించినట్లు తెలుస్తోంది. దీంతో రేపో మాపో సలకం చెరువును కూడా కూల్చివేయనున్నట్లు ప్రచారం ఊపందుకుంది. సోషల్ మీడియాలో సలకం చెరువుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలతో పాటు ఫాతిమా కాలేజీ భవనాల వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై హైడ్రా అధికారులు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఎంఐఎం పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. దీంతో ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీపై హైడ్రా అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed