ktr farm house: జన్వాడ ఫామ్‌హౌస్‌పై హైకోర్టుకు వెళ్లడం వెనుక అసలు రీజన్ ఇదేనా?

by Prasad Jukanti |
ktr farm house: జన్వాడ ఫామ్‌హౌస్‌పై హైకోర్టుకు వెళ్లడం వెనుక అసలు రీజన్ ఇదేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: అక్రమార్కులపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అంట్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పంజా విసురుతున్నది. అక్రమ నిర్మాణాలే లక్ష్యంగా దూసుకుపోతున్నది. ఇప్పటికే గండిపేట, మొయినాబాద్, చందానగర్, చిత్రిపురి కాలనీలోని ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్లు దూసుకుపోతున్న నేపథ్యంలో 111 జీవో పరిధిలో ఉన్న జన్వాడలోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫామ్‌హౌస్ వైపు హైడ్రా రావొచ్చన్న అనుమానం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో కేటీఆర్ ఫామ్‌హౌస్‌ను కూల్చివేయకుండా స్టే ఇవ్వాలని తాజాగా ఆయన అనుచరుడు, ఫామ్‌హౌస్ యజమానిగా చెబుతున్న బద్వేల్ ప్రదీప్‌రెడ్డి కూల్చవద్దని పిటిషన్ దాఖలు చేశారు. ఈనెల 14న తన ఫాం‌హౌజ్‌ను నీటి పారుదల శాఖ అధికారులు పరిశీలించారని, రాజకీయ కారణాలతోనే తన ఆస్తికి నష్టం చేకూర్చాలని చూస్తున్నారని ప్రదీప్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా కమిషన్‌ రంగనాథ్, రంగారెడ్డి కలెక్టర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు, శంకర్‌పల్లి రెవెన్యూ అధికారి, చీఫ్ ఇంజనీర్లను పిటిషనర్ చేర్చారు.

చెరువుల పరిరక్షణ కోసమే : ఏఏజీ

పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన జస్టిస్ లక్ష్మణ్ బెంచ్.. జన్వాడ పరిధిలోని నిర్మాణాలను రేపటి వరకు కూల్చొద్దని ఆదేశించింది. ఈ సందర్భంగా హైడ్రా కూల్చివేతల తీరును హైకోర్టు ప్రశ్నించింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారని, స్థానిక సంస్థల అనుమతితో నిర్మాణాలు జరుగుతాయని కోర్టు పేర్కొన్నది. 15-20 ఏళ్ల తర్వాత హైడ్రా వచ్చి అక్రమ నిర్మాణం అని కూల్చివేయడమేంటని ప్రశ్నించింది. కూల్చివేతల గురించి చర్చించాల్సి ఉందన్న హైకోర్టు.. హైడ్రాకు ఉన్న లీగల్ స్టేటస్ గురించి చెప్పాలని ఏఏజీకి సూచించింది. దీంతో చెరువుల పరిరక్షణ కోసమే హైడ్రా ఏర్పాటైందని ఏఏజీ కోర్టుకు వివరించారు. హైడ్రా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని తెలిపారు. హైడ్రాకు ఉన్న పూర్తి లీగల్ స్టేటస్ వివరాలు వెల్లడించాలంటూ తదుపరి విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది. వివరాలు వెల్లడించకుంటే రేపటికి వాయిదా వేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.

గతంలో రేవంత్‌ వర్సెస్ కేటీఆర్ ఫామ్‌హౌస్..

జన్వాడలోని కేటీఆర్ ఫామ్‌హౌస్ చుట్టూ రాజకీయ వివాదాలు, ఆరోపణలు కొత్తేమీ కాదు. ప్రతిపక్షంలో ఉండగా గతంలో పీసీసీ చీఫ్‌గా రేవంత్ జన్వాడ ఫామ్‌హౌస్ అక్రమ నిర్మాణం అని ఆరోపించారు. ఈ క్రమంలో ఫామ్‌హౌస్‌ను డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించడం రాజకీయ దుమారం రేపింది. రేవంత్ అక్రమంగా డ్రోన్ ఎగరవేశారంటూ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనపై కేసులు పెట్టి చివరకు జైలుకు సైతం పంపింది. నాటి ఘటనపై హైడ్రాతో బదులు తీర్చుకోవాలని సీఎం చూస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తుంటే, నిబంధనల ప్రకారమే హైడ్రా తన పని చేసుకుంటూ పోతున్నదని, ఇందులో ఎలాంటి కక్షసాధింపు చర్యలు లేవని అధికార పక్షం వాదిస్తున్నది. దీంతో మొత్తంగా హైడ్రా కూల్చివేతల వ్యవహారం జన్వాడ ఫామ్‌హౌస్ చుట్టూ చేరడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed