Hydra: పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యాసంస్థలకు హైకోర్టులో ఊరట

by Ramesh Goud |
Hydra: పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యాసంస్థలకు హైకోర్టులో ఊరట
X

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యాసంస్థల కూల్చివేత విషయంలో బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డికి కాస్త ఊరట లభించింది. ఈ పిటీషన్ పై విచారణను వాయిదా వేసిన కోర్టు.. తదుపరి విచారణ జరిగే వరకు విద్యాసంస్థలను కూల్చవద్దని ఆదేశాలు ఇచ్చింది. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చెరువులను కబ్జా చేసి విద్యాసంస్థలు నిర్మించారని ఫిర్యాదులు రావడంతో.. హైడ్రా నోటీసులు జారీ చేసింది. దీంతో పల్లా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై బుధవారం విచారణ జరిపిన కోర్టు.. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అంతేగాక ఎల్లుండి విచారణ ముగిసే వరకు అనురాగ్, నీలిమ విద్యాసంస్థలను కూల్చవద్దని హైడ్రాకు ఆదేశాలు జారీ చేశింది. అలాగే కొర్రెముల, నల్లచెరువు రికార్డులు సమర్పించాలని ప్రభుత్వానికి చెప్పింది.

కాగా చెరువులు, కుంటలు పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్ పరిధిలో చెరువు భూమి కబ్జా చేసి, అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు అందిన ఫిర్యాదులపై నోటీసులు జారీ చేసి కూల్చివేతలు చేపడుతోంది. ఈ నేపధ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘట్‌కేసర్ మండలం వెంటాపూర్ పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్లో ఉన్న భూమిని ఆక్రమించి అనురాగ్, నీలిమా విద్యాసంస్థలు నిర్మాణాలు జరిపారని హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విద్యాసంస్థలపై హైడ్రా నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డికి నోటీసులు అందాయి. దీనిపై తమ విద్యాసంస్థలు అన్ని అనుమతులతోనే నిర్మించామని, ఆక్రమణల పేరుతో అధికారుల్లో తమ ఆస్తుల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పల్లా హైకోర్టు మెట్లు ఎక్కారు.

Advertisement

Next Story

Most Viewed