HYDRA: హైడ్రాకు రెవెన్యూ నుంచి పూర్తి సహకారం

by Praveen Kumar Siramdas |   ( Updated:2024-08-29 12:21:27.0  )
HYDRA: హైడ్రాకు రెవెన్యూ నుంచి పూర్తి సహకారం
X

హైడ్రాకు రెవెన్యూ నుంచి పూర్తి సహకారం

వరద ముప్పును తగ్గించేందుకు ప్రణాళికలు

విపత్తుల నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేస్తాం

తొమ్మిది విభాగాలతో సమీక్షలో రెవెన్యూ మంత్రి

దిశ, తెలంగాణ బ్యూరో:

రాష్ట్రంలో విపత్తులు సంభవించినప్పుడు వాటిని తట్టుకుని ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించడానికి, ఆకస్మికంగా ఎదురయ్యే పరిస్థితులను సైతం ఎదుర్కొనేలా విపత్తుల నిర్వహణ వ్యవస్థను(డిజాస్టర్ మేనేజ్మెంట్) బలోపేతం చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం సచివాలయం వరద కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పదేండ్ల తర్వాత తర్వాత తొలిసారిగా వరదలపై యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు. వరదలతో సంబంధం ఉన్న ప్రతి విభాగం రాష్ట్ర, జిల్లా స్థాయిలో వరదలపై కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాలలో వరద ముప్పును తగ్గించడానికి అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ తరపున ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. వరదలు, కాలువలు, చిన్న డ్రైనేజీల నుంచి మొదలుకుని, హైరైజ్ భవనాల వరకు ఏ పరిస్థితి ఎదురైనా దానిని అధిగమించడానికి వీలుగా అధునాతన పరికరాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అన్ని విభాగాలు వరద ముప్పును ఎదుర్కోవడానికి కావలసిన ప్రణాళికలను సిద్ధం చేసుకొని రావాలని, త్వరలో దీనిపై మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు. హైడ్రా పరిధిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించారు. గతంలో 30 బృందాలు ఉండగా దాన్ని 70 కి పెంచామని, సిబ్బంది సంఖ్యను 1800 నుంచి 3500 వరకు పెంచామన్నారు. దీనికి మంత్రి స్పందిస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ కు సంబంధించి హైడ్రాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. హైడ్రాకు కావలిసిన అధునాతన పరికరాలు అందిస్తామని, ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను పంపించాలని కమిషనర్ కి సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, రెవెన్యూ జాయింట్ సెక్రటరీ ఎస్.హరీష్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, రెవెన్యూ, ఇరిగేషన్, మునిసిపల్, పంచాయతీరాజ్, ప్లానింగ్, వాతావరణ శాఖ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed