జన్వాడ ఫామ్‌హౌస్ పై హైడ్రా ఫోకస్

by Mahesh |
జన్వాడ ఫామ్‌హౌస్ పై హైడ్రా ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : జన్వాడలో ఫామ్ హౌస్ పై హైడ్రా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. నిబంధనల మేరకే అక్కడ నిర్మాణాలు జరిగాయా? లేదా? అని ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఒకవేళ రూల్స్ కు విరుద్ధంగా నిర్మాణాలు జరిగినట్లు ఆధారాలు లభిస్తే, వెంటనే ఫామ్ హౌస్ ను కూల్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సిటీ తో పాటు, శివారులోని అక్రమ కట్టడాలను అరికట్టేందుకు హైడ్రాను (హైద‌రాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ఏర్పాటు చేశారు. ఆ సంస్థకు చెందిన అధికారులు కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలను గుర్తించి, యుద్ధప్రాతిపదికన నేలమట్టం చేస్తున్నారు. అందులో భాగంగా 111 జీవోను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టిన జన్వాడ ఫామ్ హౌస్‌ను సైతం కూల్చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్నది.

రూల్స్ కు విరుద్ధంగా నిర్మాణాలు?

జన్వాడ ఫామ్ హౌస్‌లో జరిగిన నిర్మాణాలపై హైడ్రా ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది. ఫామ్ హౌస్ నిర్మాణాల కోసం ఏ ఏ శాఖలకు చెందిన అధికారులు అనుమతులు ఇచ్చారనే కోణంలో సమాచారం సేకరిస్తున్నట్టు సమాచారం. ఇచ్చిన అనుమతుల మేరకే నిర్మాణాలు జరిగాయా?లేకపోతే జీవో 111 ను ఉల్లంఘించారా? అనే కోణంలో డిటేయిల్ రిపోర్టును హెచ్ఎండీఏ, పీసీబీ, ఇరిగేషన్ శాఖల నుంచి సేకరిస్తున్నట్టు టాక్. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ హౌస్ నిర్మాణాలు చేపడితే హైడ్రా అధికారులు నిర్మాణాలను కూల్చేస్తారని టాక్ నడుస్తున్నది. ఎందుకంటే ఈ మధ్య సిటీ శివారులో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను వరుసగా కూల్చేశారు. అలాగే అక్రమ నిర్మాణాలను ఎంకరేజ్ చేస్తున్నాడని కారణంతో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై హైడ్రా అధికారులు కేసులు నమోదు చేశారు.

పెద్ద దుమారమే లేపిన ఫామ్ హౌస్ కేసు

సుమారు నాలుగేళ్ల క్రితం జన్వాడ ఫామ్ హౌస్ అంశం రాజకీయంగా పెద్ద దుమారాన్ని లేపింది. మంత్రి హోదాలో కేటీఆర్ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారని మల్కాజిగిరి ఎంపీ హోదాలో రేవంత్ రెడ్డి ఆరోపించారు. జీవో 111 ను అతిక్రమించి స్విమ్మింగ్ పూల్, ఇతర సదుపాయాలతో నిర్మాణాలు జరిగాయని, అలాగే ఉస్మాన్ సాగర్ లోకి వర్షపు నీరు చేరే సహజసిద్ధమైన నాలాను ఆక్రమించి నిర్మాణాలు జరిగాయని వివరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేశారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను రేవంత్ ఆశ్రయించగా, కేటీఆర్ తో పాటు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. అయితే ఎలాంటి అనుమతి లేకుండా ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగరేశారని రేవంత్ పై పోలీసులు కేసు నమోదు నమోదు చేసి జైలుకు పంపారు. అయితే ఈ కేసులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేటీఆర్ హైకోర్టుకు వెళ్లారు. ఆ ఫామ్ హౌజ్ తనది కాదని ఆయన అప్పీలు చేయగా, కోర్టు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.

సోషల్ మీడియా వేదికగా డిస్కస్

జన్వాడ ఫామ్ హౌస్‌ను కూల్చేస్తారని సోషల్ మీడియా వేదికగా డిస్కషన్ జరుగుతున్నది. ‘ఎక్స్’ లో ‘రేవంత్ సైన్యం తె లంగాణ’ పేరు తో ఉన్న అకౌంట్ వేదికగా శనివారం ‘మిత్తి తో సహా చెల్లిస్తాం’ అంటూ జన్వాడ ఫామ్ హౌస్ కూల్చబోతున్న హైడ్రా? అనే ఫామ్ హౌజ్ ఫొటోతో ఓ పోస్ట్ పెట్టారు. దీనికి కౌంటర్ గా కేటీఆర్ అభిమానాలు ‘ ఫామ్ హౌజ్ కూల్చేస్తే ఒకటో.. రెండు కోట్లు లాస్ అవుతది. కానీ తాము రూ.200 కోట్లు లాస్ చేస్తాం.. జాగ్రత్త.’ అంటూ డిస్కషన్ జరిగింది. దీనికి కొనసాగింపుగా చాలా మంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

నేతలు, బడాబాబుల ఫామ్ హౌస్‌లపై ఫోకస్

సిటీ శివారులోని రాజకీయ నేతలు,బ్యూరోక్రాట్స్ కు చెందిన ఫామ్ హౌస్‌లపై హైడ్రా దృష్టిపెట్టినట్టు తెలుస్తున్నది. అలాగే కొన్ని ప్రైవేటు యూనివర్సిటీలు, కాలేజీలు ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్టు ఫిర్యాదులు ఉన్నాయి. ఓ మాజీ మంత్రికి చెందిన కాలేజీ నిర్మాణాలు, బీఆర్ఎస్ కు చెందిన ఓ ఎమ్మెల్యే కాలేజీ బిల్డింగ్స్ కూడా ప్రభుత్వ భూముల్లో నిర్మించినట్టు ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపై కూడా హైడ్రా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. సమయం, సందర్భం చూసుకుని ఒక్కొక్క అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు సమాచారం.

Advertisement

Next Story