- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రేటర్ పరిధిలో అప్రకటిత విద్యుత్ కోతలు..
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో విధిస్తున్న అప్రకటిత కరెంటు కోతలతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఓ వైపు మండుతున్న ఎండలు, మరోవైపు కరెంటు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 40 డిగ్రీల సెల్పియస్ కు పైగా ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. వడగాల్పులు వీస్తున్నాయి. అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దు, ఇంటి పట్టునే ఉండండి, బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోండి అంటూ ప్రతినిత్యం వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తుండగా ప్రజలు ఇండ్లలో కూడా ఉండలేని విధంగా కరెంటు కోతలు ఉంటున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండడం, గంటల పాటు విద్యుత్ అధికారులకు ఫోన్లు చేసినా పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. దీనికి తోడు అకాల వర్షాలు, గాలులతో పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
అనధికారికంగా కోతలు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పిన ప్రభుత్వం కొన్నేళ్ల పాటు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంది. ఇటీవల కాలంలో నగరవ్యాప్తంగా తరచుగా కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. అనధికారికంగా కోతలు విధిస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వం నిరంతర విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ వాస్తవానికి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అంతరాయానికి కొంత మంది అధికారులు చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా విద్యుత్ నిలిపి వేస్తున్నామని చెబుతున్నారు. ఇలా నగరంలోని చాలా ప్రాంతాలలో అనేకమార్లు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తుండడం పరిస్థితికి అద్దం పడుతుండగా వినియోగదారులకు ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితులు ఉన్నాయి.
స్పందించని అధికారులు..?
ప్రస్తుతవేసవిలో జీహెచ్ఎంసీ పరిధిలో తరచుగా విద్యుత్ కోతలు ఉంటుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వీఐపీలు, సంపన్నులు ఉండే ప్రాంతాలలో ఒకవేళ ఏదేని సాంకేతిక కారణాలతో సరఫరా నిలిచిపోతే వెంటనే పునరుద్ధరిస్తున్న అధికారులు ఇతర ప్రాంతాలలో పట్టించుకోవడం లేదు. గంటల పాటు విద్యుత్ లేకపోవడంతో ప్రజలు తీవ్రఇబ్బందుల పాలవుతున్నారు. ఫ్యూజ్ ఆఫ్ కాల్ తో పాటు ఏఈ, లైన్ మెన్ లకు ఫోన్ చేసినా స్పందించడం లేదని, కొంత మంది అధికారులు అసలు ఫోన్ కూడా ఎత్తకపోవడం పట్ల బస్తీల ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఎల్బీనగర్ లోని చాలా బస్తీలలో సమస్య జఠిలంగా ఉంది. ఒక్కో సారి రోజులో పదుల సార్లు విద్యుత్ నిలిచిపోతోంది. హైదరాబాద్ నగరంలో అనధికార కోతలు విధిస్తూనే 24 గంటలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
చెడిపోతున్న గృహోపకరణాలు..
విద్యుత్ సరఫరా హెచ్చుతగ్గులు కూడా ఉండడంతో గృహోపకరణాలు కూడా పాడవుతున్నాయని పలువురు వాపోతున్నారు. తరచుగా కరెంటు వస్తూ, పోతూ ఉండడంతో ఇండ్లలో టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఇతర విద్యుత్ వస్తువులు చెడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని గతంలో మాదిరి నిరంతరం కరెంటు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రేటర్ వాసులు కోరుతున్నారు.
నిరంతర సరఫరా చేయాలి.. లక్ష్మినరసింహా, కొత్తపేట
ఇటీవల కాలంలో తరచుగా కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. అసలే వేసవి కాలం ఎండలు మండుతుండగా ఇలా విద్యుత్ సరఫరా నిలిచిపోతుండడం ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా మధ్యాహ్నం, రాత్రి సమయాలలో చోటు చేసుకుంటున్న కరెంటు కోతలతో చిన్న పిల్లలు, వృద్ధులు పడరాని పాట్లు పడుతున్నారు. దీనికితోడు కరెంటు వస్తూపోతూ ఉండడంతో ఇండ్లలో విద్యుత్ తో నడిచే ఉపకరణాలు చెడిపోతున్నాయి. మరో నెలరోజుల పాటు వేసవి ఎండలు ఉండే అవకాశం ఉన్నందున అధికారులు నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుని విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.