సచివాలయం చుట్టూ ట్రాఫిక్ జామ్.. పత్తాలేని ట్రాఫిక్ నియంత్రణ!

by Mahesh |
సచివాలయం చుట్టూ ట్రాఫిక్ జామ్.. పత్తాలేని ట్రాఫిక్ నియంత్రణ!
X

దిశ, సిటీబ్యూరో : కొత్తగా నిర్మించుకున్న సచివాలయం చుట్టూ ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది. ఆధునిక హంగులతో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించుకున్న సచివాలయం చుట్టూ ట్రాఫిక్ నియంత్రణ పత్తాలేకుండా పోయింది. పైగా కొత్త సచివాలయాన్ని ప్రారంభించుకున్న తర్వాత ట్రాఫిక్ జంక్షన్లు, సిగ్నల్స్‌లలో భారీగా మార్పులు చేయటంతో ట్రాఫిక్ జామ్ తప్పటం లేదు. ముఖ్యంగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ కిందనున్న సిగ్నల్ నుంచి బీఆర్కేఆర్ భవన్, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి నిన్నమొన్నటి వరకు ప్రతిరోజు వందలాది మంది రాకపోకలు సాగించేవారు. ప్రస్తుతం బీఆర్కేఆర్ భవన్ వద్ద పనులు జరుగుతున్నందున అటు వైపు వెళ్లే దారిని పూర్తిగా మూసి వేశారు.

చాలా రోజుల నుంచి ఈ ఫ్లై ఓవర్ కిందనున్న సిగ్నల్‌ను కూడా బంద్ చేసి, అక్కడి నుంచి కొద్ది దూరంలోనే ఫ్లైఓవర్ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుని ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లేలా వాహనాలను అనుమతిస్తున్నారు. ఫలితంగా ఇక్బాల్ మినార్ నుంచి అంబేద్కర్ విగ్రహమున్న చౌరస్తా వరకు పీక్ అవర్స్‌లలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీని కారణంగా ఈ చౌరస్తాలోనున్న ఫ్రీ లెఫ్ట్ ఏ మాత్రం అమలు కాకపోవడంతో, వాహనదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తెలుగుతల్లి ఫైఓవర్ కింద ఇదివరకున్న సిగ్నల్ మూసివేసినందున పీక్ అవర్స్‌లో ఒక్కోసారి ఇక్బాల్ మినార్ వరకు వాహనాలు క్యూ కడుతున్నాయి. దీని వల్ల తమ వాహనాల్లోని ఇంధనంతో పాటు అంతకన్నా విలువైన తమ సమయం వృథా అవుతుందని వాహనదారులు వాపోతున్నాయి. అంబులెన్స్‌లు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఘటనలున్నాయి.

యూటర్న్ ఎంత దూరమో?

కొత్త సచివాలయానికి ఎన్టీఆర్ గార్డెన్స్ వైపున్న గేటు నుంచి బయటకు వస్తున్న వాహనాలు సికింద్రాబాద్, హిమాయత్ నగర్ వెళ్లాలంటే ఐమాక్స్ వద్దనున్న ఇందిరాగాంధీ విగ్రహం వరకు వెళ్లి అక్కడి నుంచి యూటర్న్ తీసుకుని సచివాలయం ముందు వేసిన కొత్త రోడ్డు మీదుగా ట్యాంక్ బండ్ చౌరస్తా వరకు వచ్చి లిబర్టీ, దోమల్ గూడ మీదుగా వెళ్లాల్సి వస్తుంది. ఇక ఇదే సచివాలయ గేటు నుంచి బయటకు వచ్చి కోఠి, నాంపల్లి, లక్డీకాపూల్ ప్రాంతాలకు వెళ్లాల్సిన వాహనాలు లిబర్టీ సర్కల్‌కు వచ్చి, యూటర్న్ తీసుకుని మళ్లీ బీఆర్కేఆర్ భవన్ పక్క నుంచి హోటల్ అన్‌మోల్, ఇక్బాల్ మినార్‌ల మీదుగా వెళ్లాల్సి వస్తుంది. మొత్తానికి కొత్త సచివాలయం ప్రారంభించిన తర్వాత ఇక్కడ చేసిన సిగ్నల్స్ మార్పు, జంక్షన్ల మూసివేత కారణంగా సచివాలయం చుట్టున్న ఇక్బాల్ మినార్, లిబర్టీ, రవీంద్రభారతి, లక్డీకాపూల్ అయోధ్య జంక్షన్‌తో పాటు కొన్నిసార్లు ఖైరతాబాద్ జంక్షన్లలో కూడా ట్రాఫిక్ స్తంభిస్తుంది.

Advertisement

Next Story