ఆ అధికారులకు వరంలా కొత్త ఉత్తర్వులు.. కోట్లలో GHMC ఆదాయానికి గండి..!

by Satheesh |   ( Updated:2022-11-29 15:27:43.0  )
ఆ అధికారులకు వరంలా కొత్త ఉత్తర్వులు.. కోట్లలో GHMC ఆదాయానికి గండి..!
X

జీహెచ్ఎంసీ ఈస్ట్ జోన్ పరిధిలో టౌన్ ప్లానింగ్ అధికారులు మహానటులను మించిపోయారు. వీరికి ఆస్కార్ అవార్డు ఇచ్చిన తక్కువే అంటున్నారు ఎల్బీనగర్ ప్రజలు. పట్టణ ప్రణాళిక విభాగంలో పారదర్శకంగా ఉండేందుకు కమిషనర్ తెచ్చిన కొత్త ఉత్తర్వులు వీరికి వరంగా మారాయి. కమిషనర్ ఆదేశాలను సాకుగా చూపి తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. దీంతో జోనల్ పరిధిలోని డిప్యూటీ కమిషనర్ల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది. ఈస్ట్ జోన్ పరిధిలో వందల సంఖ్యలో అక్రమ నిర్మాణదారుల నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఆదాయం పెంచడం కోసం కమిషనర్ తెచ్చిన కొత్త ఉత్తర్వులు ఇప్పుడు టౌన్ ప్లానింగ్ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ ఆదాయానికి కోట్లలో గండి పడుతుంది.

దిశ, ఎల్బీనగర్: బల్దియా అంటేనే అక్రమార్జనకు మారుపేరు..! అయితే అక్రమార్జనను అరికట్టేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ తీసుకొచ్చిన కొత్త ఉత్తర్వులు ఈస్ట్ జోన్ టౌన్ ప్లానింగ్ అధికారులకు వరంగా మారాయని విమర్శలు వినిపిస్తున్నాయి. కమిషనర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. అక్రమ నిర్మాణాలను అరిట్టేందుకు డిప్యూటీ కమిషనర్లను నోడల్ అధికారులుగా, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ (ఎఎంసీ) లను ఫిర్యాదులు స్వీకరించేందుకు, డిప్యూటీ ఇంజనీర్ (డీఇ) లను స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంకు అధికారిగా నియమించారు. ప్రస్తుతం అయితే టౌన్ ప్లానింగ్ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తుంది. అక్రమ నిర్మాణాలతో తమకేమీ సంబంధం లేదంటూ చేతులెత్తేస్తూ మహానటులను తలపిస్తున్నారు. దీంతో వీరికి ఆస్కార్ అవార్డు ఇచ్చిన తక్కువే అంటున్నారు నగర ప్రజలు.

న్యాక్, ఎస్‌ఎఫ్‌టీ ఉన్నట్టా.. లేనట్టా..?

జీహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం అక్రమ నిర్మాణాలు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ (ఎన్ఎసి) ఇంజనీర్లు అక్రమ నిర్మాణాలను గుర్తించి ఏఎంసికి రిపోర్ట్ చేయాలి. న్యాక్ ఇంజనీర్ల రిపోర్ట్ ఆధారంగా ఏఎంసి అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంకు సిఫార్సు చేయాలి. ఏఎంసీ సిఫార్సు మేరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడే మరో చిక్కు వచ్చి పడింది. జోనల్ పరిధిలోని డిప్యూటీ కమిషనర్లకు నోడల్ అధికార బాధ్యతలు ఇవ్వడంతో అంతా వారి కనుసన్నల్లోనే జరుగుతుంది. న్యాక్ ఇంజనీర్లు తాత్కాలిక ఉద్యోగులు కావడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు, డిప్యూటీ కమిషనర్‌లు తానా అంటే.. తందానా అంటున్నారు..! ఇక జీహెచ్ఎంసీలో భూగర్భ డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం, మరమ్మత్తుల కోసం ఏర్పాటైన ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఇంజనీరింగ్ అధికారులను టౌన్ ప్లానింగ్ భాగంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం అధికారిగా నియమించడం పట్టణ ప్రణాళిక విభాగం అధికారులకు వరంగా మారింది.

అవినీతి కేరాఫ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్స్..?

జీహెచ్ఎంసీ ఈస్ట్ జోన్ పరిధిలో అసిస్టెంట్ సిటీ ప్లానర్స్ (ఏసీపీ)లు అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారారని విమర్శలు వినిపిస్తున్నాయి. బల్దియా కమిషనర్ తీసుకువచ్చిన కొత్త నిబంధనలు ఇప్పుడు వీరికి మరింత కాసుల పంట పండిస్తున్నాయి. ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న నిర్మాణదారుడికి ఏసీపీలే అనుమతులు మంజూరు చేయాలి. అయితే నిర్మాణదారుడు అక్రమ నిర్మాణం చేపడితే వీరి పర్యవేక్షణలోనే న్యాక్ బృందం పనిచేయడం గమనార్హం. దీంతో ఎల్బీనగర్ జోన్ పరిధిలో అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, డిప్యూటీ కమిషనర్ లు అక్రమ నిర్మాణదారులతో కుమ్మక్కై స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంకు రిపోర్టులు అందజేయడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. న్యాక్ ఇంజనీర్లను అక్రమ నిర్మాణాల జోలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం స్థానికులు ఇచ్చే ఫిర్యాదులపైనే ఏఎంసీలు ఆధారపడడం పలు అనుమానాలకు భావిస్తుంది. అయితే ఆ ఫిర్యాదులను కూడా బుట్ట దాఖలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయమై అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) లను అడిగితే తమకు ఎలాంటి అధికారాలు లేవంటూ దాటవేయడం గమనార్హం. కానీ అక్రమ నిర్మాణదారుల నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారంటూ పలువురు విమర్శిస్తున్నారు.

జోనల్ కమిషనర్‌కు వాటా..?

జీహెచ్ఎంసీ ఈస్ట్ జోన్ పరిధిలోని జోనల్ కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులను సమన్వయం చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగం నుండే అధిక మొత్తంలో ముడుపులు అందుతుండడంతో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఈస్ట్ జోన్ టౌన్ ప్లానింగ్ విభాగం నుండి జోనల్ కమిషనర్‌కు పెద్ద మొత్తంలో వాటా అందుతుందన్న అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ఎన్ ఫోర్స్ మెంట్ అండ్ విజిలెన్స్ దృష్టి సారించాలి..

ఈస్ట్ జోన్ టౌన్ ప్లానింగ్ విభాగం అవినీతిపై జీహెచ్ఎంసీ ఎన్ ఫోర్స్ మెంట్ అండ్ విజిలెన్స్ అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. కోట్లాది రూపాయల బల్దియా ఆదాయానికి గండి కొడుతున్న అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed