ప్రతి పండుగ వెనుక విజ్ఞానం దాగి ఉంది

by Sridhar Babu |
ప్రతి పండుగ వెనుక విజ్ఞానం దాగి ఉంది
X

దిశ, సికింద్రాబాద్ : తెలంగాణలోని ప్రతి పండుగ వెనుక విజ్ఞానం దాగి ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రకృతిని పూజిస్తూ జరుపుకునే బతుకమ్మ సంస్కృతిని ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగకు, తెలంగాణ సమాజానికి వందల ఏళ్లుగా ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. పూలు, చెట్టు, పుట్ట, నీటిని పూజించుకునే అద్భుతమైన సమాజం తెలంగాణ అని కొనియాడారు.

సహజమైన ఔషధ గుణాలు కలిగిన పూలను పూజించి చెరువుల్లో నిమజ్జనం చేయటం ద్వారా నీరు శుద్ధి అవుతుందన్నారు. అనంతరం ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పోరాటాల ప్రతిరూపం సీతక్క ఉస్మానియా గడ్డపై జరుగుతున్న బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం గర్వకారణమని అన్నారు. ఉత్సవాల్లో ఓఎస్డీ ప్రొఫెసర్ రెడ్యానాయక్, యూజీసీ డీన్ ప్రొఫెసర్ జి. మల్లేశం, ఓయూ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, ఫ్యాకల్టీ ఆఫ్ లా డీన్ విజయలక్ష్మి, ప్రొఫెసర్ లావణ్య, ఉద్యోగ సంఘాల నాయకులు నాగరాజు, శివశంకర్, అక్బర్ బేగ్, విజయ్ కుమార్, రాకేష్, అవినాష్, ప్రణీత, హైమావతి, స్వాతిరెడ్డి, సుధ, సుహాసిని, లక్ష్మి, అపర్ణ, సునిత, రేణుక, భూలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

Next Story