ఫస్ట్ కిస్తీ రూ.275 కోట్లు.. అసెంబ్లీ సమావేశాల తర్వాత విడుదల చేసే ఛాన్స్

by Anjali |
ఫస్ట్ కిస్తీ రూ.275 కోట్లు.. అసెంబ్లీ సమావేశాల తర్వాత విడుదల చేసే ఛాన్స్
X

దిశ, సిటీబ్యూరో : తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీకి కాస్త ఊరట లభించింది. అసెంబ్లీలో ప్రకటించిన విధంగానే జీహెచ్ఎంసీకి రూ.1100 కోట్ల ఆర్థిక సాయాన్ని చేస్తామన్న సర్కారు ఎట్టకేలకు మాట నిలబెట్టుకున్నట్లు సమాచారం. గత గులాబీ సర్కారు హయాంలో స్తోమతకు మించి వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టడం, రోడ్ల మెయింటనెన్స్ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు సీఆర్ఎంపీ కార్యక్రమాన్ని తెరపైకి తీసుకురావటం వంటి కారణాలతో జీహెచ్ఎంసీ ఏకంగా రూ.6,500 కోట్ల మేరకు అప్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీ ప్రతి నెల రూ.వంద కోట్లను అసలు, మిత్తీలకు చెల్లిస్తున్నట్లు సమాచారం. చేసిన అప్పులకు గాను జీహెచ్ఎంసీ రోజువారీగా రూ.కోటి 36 లక్షలను మిత్తీగా చెల్లిస్తున్నట్లు తెలిసింది.

నాలుగు కిస్తీలుగా చెల్లింపు..

ఇటీవల సీఎం రేవంత్ వద్ద జరిగిన పలు సమీక్ష సమావేశాల్లో అధికారులు జీహెచ్ఎంసీ ఆర్థిక సంక్షోభం గురించి ప్రస్తావించగా, జీహెచ్ఎంసీకి చేయాలనుకున్న రూ.1100 కోట్ల ఆర్థిక సాయాన్ని నాలుగు కిస్తీలుగా చెల్లించేందుకు సర్కారు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇందులో మొదటి కిస్తీ రూ.275 కోట్లను త్వరలోనే విడుదల చేసేందుకు సర్కారు అంగీకరించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని రాష్ట్ర సర్కారు త్వరలో ప్రవేశపెట్టనున్న తన ఓటాన్ బడ్జెట్‌లో కూడా పెట్టనున్నట్లు తెలిసింది. తొలి కిస్తీని త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల తర్వాత విడుదల చేయనున్నట్లు సర్కారు స్పష్టం చేసినట్లు సమాచారం. మిగిలిన మూడు కిస్తీలను రానున్న ఆరు నెలల్లో విడుదల చేస్తామని కూడా సర్కారు హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భవనాల ఆస్తి పన్ను బకాయిలు రూ.2,980 కోట్ల వరకు పేరుకుపోగా, కేంద్ర ప్రభుత్వ భవనాల ట్యాక్స్ కూడా పెండింగ్‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వ ట్యాక్స్‌కు సంబంధించిన న్యాయపరమైన చిక్కులుండగా, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భవనాల ఆస్తి పన్ను బకాయిలను కూడా త్వరలోనే అడిగే యోచనలో జీహెచ్ఎంసీ అధికారులున్నట్లు సమాచారం. పెద్ద మొత్తంలో పేరుకుపోయిన స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలను జీతాల చెల్లింపులకు అందేలా నెలసరి కిస్తీలుగా చెల్లించేలా సర్కారుకు వినతి చేయాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు సమాచారం.

సర్కారు సాయమే గాక..

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సాయమే గాక, జీహెచ్ఎంసీ సైతం అంతర్గతంగా పలు ఆదాయ వనరుల కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం. సుమారు 20 ఏళ్ల నుంచి నగరంలో ప్రాపర్టీ ట్యాక్స్‌ను సవరించలేదు. రెసిడెన్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లి్స్తూ కమర్షియల్ కార్యకలాపాలను కొనసాగిస్తున్న ప్రాపర్టీలను గుర్తించేందుకు ఇప్పటికే నియోజియో సంస్థతో కలిసి మూడంచెల సర్వేను మియాపూర్ నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శాటిలైట్ సర్వే ముగిసి, డ్రోన్ సర్వేల స్థాయిలో ఉంది.

ఇది ముగిసిన తర్వాత శాటిలైట్, డ్రోన్ సర్వేలతో సేకరించిన సమాచారాన్ని డోర్ టూ డోర్ వెళ్లి వెరిఫై చేసి, పలు సంస్కరణలను తీసుకురావాలని జీహెచ్ఎంసీ యోచిస్తున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ అడ్వర్‌టైజ్‌మెంట్ల విభాగంలో గత సర్కారు హయాంలో భారీగా అవకతవకలు, అక్రమాలు జరిగాయంటూ కౌన్సిల్‌లో కార్పొరేటర్లు ఆరోపించిన నేపథ్యంలో ఈ అక్రమాలను వెలికితీయడంతో పాటు అడ్వర్‌టైజ్‌మెంట్ విభాగంలో కూడా పలు సంస్కరణలను ప్రవేశపెట్టాలన్న ఆలోచనతో కమిషనర్ ఆమ్రపాలి అదనపు కమిషనర్ వద్దనున్న ఆ విభాగాన్ని రెండు రోజుల క్రితం తన పరిధిలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed