బల్దియాలో ప్రశ్నార్థకంగా బదిలీలు.. ఆ ఆఫీసర్లకే పోస్టింగ్స్..!

by srinivas |
బల్దియాలో ప్రశ్నార్థకంగా బదిలీలు.. ఆ ఆఫీసర్లకే పోస్టింగ్స్..!
X

దిశ, సిటీబ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో భారీగా బదిలీలు చేపట్టేందుకు సర్కారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ బదిలీలకు సంబంధించిన ప్రక్రియను సిద్దం చేసుకునేందుకు విధించిన డెడ్‌ లైన్‌కు శనివారంతో తెరపడనుంది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీలో ఏళ్లతరబడి విధులు నిర్వహిస్తున్న వివిధ ఇతర ప్రభుత్వ శాఖల అధికారులకు బదిలీల భయం పట్టుకుంది. ఒకే చోట, ఒకే జిల్లాలో రెండేళ్ల పదవీకాలం ముగిసిన అధికారులకు స్థానచలనం కలిగించాలన్న ఆదేశాలున్నాయి.

హోదాకు సరిపోయే పోస్టులు లేక..

జీహెచ్ఎంసీలో ఏళ్లతరబడి విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన జాయింట్ డైరెక్టర్, రీజినల్ డైరెక్టర్ హోదాలు మినహా మిగిలిన ఆఫీసర్లకు స్థానచలనం కలిగించే అవకాశాల్లేవని తెలిసింది. ముఖ్యంగా సెలక్షన్ గ్రేడ్, స్పెషల్ గ్రేడ్ కమిషనర్ల హోదాలోని అధికారులు ప్రస్తుతం జీహెచ్ఎంసీలో అదనపు కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ముఖ్యంగా అదనపు కమిషనర్లుగా విధులు నిర్వహిస్తున్న అధికారులను జీహెచ్ఎంసీ నుంచి స్థానచలనం కలిగించాలని భావించినా, వారికి బయట ఇతర శాఖల్లో తమ హోదాకు సరిపోయే పోస్టులు లేకపోవడంతో జీహెచ్ఎంసీ నుంచి పెద్ద సంఖ్యలో అధికారులు బదిలీలయ్యే అవకాశాల్లేనట్టు సమాచారం.

జీహెచ్ఎంసీలోకి 94 మంది కొత్త ఆఫీసర్లు..

గతంలో జీహెచ్ఎంసీలో అదనపు కమిషనర్లుగా విధులు నిర్వహించిన వారికి స్థానచలనం కలిగించేందుకు వారిని వివిధ కార్పొరేషన్లకు కమిషనర్లుగా నియమించే వారు. కానీ ఇప్పుడు ఆ కార్పొరేషన్ల కమిషనర్లుగా ఐఏఎస్ ఆఫీసర్లను నియమించడంతో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మూడు కార్పొరేషన్ల కమిషనర్ల పోస్టులు మాత్రమే వారికి అందుబాటులో ఉన్నట్లు సమాచారం. ఆఫీసర్ల బదిలీల్లో నిక్కచ్చితంగా వ్యవహరించే సర్కారు జీహెచ్ఎంసీలోని సీడీఎంఏ, ఎంఏయూడీలోని వివిధ క్యాటగిరీలకు చెందిన ఆఫీసర్లను ఇక్కడే కొనసాగించే పరిస్థితులు ఎదుర్కోనున్నట్లు సమాచారం. కానీ సర్కారు చేపట్టిన ఈ బదిలీలతో జీహెచ్ఎంసీ నుంచి బయటకెంత మంది వెళ్తారన్న సమాచారం అధికారుల వద్ద లేకపోయినా, జీహెచ్ఎంసీలోకి మాత్రం 94 మంది ఆఫీసర్లు వివిధ హోదాల్లో రానున్నట్లు అధికారవర్గాల సమాచారం.

250 మందికి అంతర్గత బదిలీలు..

జీహెచ్ఎంసీ కార్పొరేషన్‌కు చెందిన ఉద్యోగుల్లో చాలా మంది ఏళ్లతరబడి ఒకే చోట విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన గత కమిషనర్ రొనాల్డ్ రోస్ వారికి స్థానచలనం కలిగించేందుకు ఇటీవలే విభాగాల వారీగా మూడేళ్లు పదవీకాలం దాటిన కార్పొరేషన్ ఉద్యోగుల వివరాలను సర్కిళ్ల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి మరీ సేకరించారు. వారికి స్థానచలనం కలిగించాలని భావించిన ఆయన అనూహ్యాంగా ట్రాన్స్‌ఫర్ అయి వెళ్లారు. దీంతో ఈ బదిలీలకు బ్రేక్ పడింది. కానీ స్థానచలనం కలిగించే సూపరింటెండెంట్ పోస్టుకు సంబంధించిన సుమారు 250 మంది ఉద్యోగుల జాబితా సిద్దంగా ఉండటంతో త్వరలోనే వారికి ప్రమోషన్ కమ్ ట్రాన్స్‌ఫర్ల ప్రక్రియను చేపట్టనున్నట్లు ఓ అధికారి వెల్లడించారు.

ప్లానింగ్ సిబ్బందికి బదిలీల కౌన్సెలింగ్..

జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్లానింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సెక్షన్ ఆఫీసర్ మొదలుకుని డిప్యూటీ చీఫ్ ప్లానర్ పోస్టు వరకు అసిస్టెంట్ సిటీ ప్లానర్ పోస్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ)లో ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించిన కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని ఈ నెల 17 నుంచి నిర్వహిస్తున్నట్లు సమాచారం. గడిచిన మూడు రోజుల్లో మూడు క్యాటిగిరీలకు చెందిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లకు ఈ కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిసింది.



Next Story