వికలాంగుల పరికరాలపై TGHCS చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

by srinivas |
వికలాంగుల పరికరాలపై TGHCS చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పదేళ్లలో వికలాంగుల పరికరాలకు రూ. 64 కోట్లు కేటాయించారని తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య పేర్కొన్నారు. గురువారం ఆయన తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ కార్యాలయంలో మాట్లాడుతూ..కార్పొరేషన్ చరిత్రలో కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన తర్వాత అతి తక్కువ సమయంలోనే మేనేజ్‌మెంట్ కమిటీ నిర్వహించామన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్లలో రెండు సార్లు మాత్రమే ఇలాంటి సమావేశం నిర్వహిస్తే, ఇక నుంచి ప్రతి నెలలో రెండు సార్లు నిర్వహిస్తామన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టిన వికలాంగుల హక్కుల చట్టం -2016ని సంపూర్ణంగా అమలు చేస్తామని ముత్తినేని వీరయ్య తెలిపారు.

దేశంలోనే మొదటిసారిగా బెంచ్ మార్క్ వైకల్యం 40 శాతంకే పరికరాలు అందించేలా తీర్మానం చేశామన్నారు. మోటరైజ్డ్ వాహనాలను కూడా 40% వైకల్యం ఉన్న వాళ్ళకి కూడా అందిస్తామన్నారు. వికలాంగులకు బ్యాటరీ వీల్ చైర్‌లు కూడా అందజేస్తాన్నారు. డిగ్రీ, ఆపై ఉత్తీర్ణత పొందినోళ్లకు ల్యాప్ టాప్‌లు కూడా అందజేసేందుకు కృషి చేస్తామన్నారు. విద్యార్ధి నేస్తం పేరుతో టాబ్‌లను ఇస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా వికలాంగులకు 33 శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఈ కోటాలో ఎవరూ లేకపోతే జనరల్ కోటాలోనూ అందిస్తామన్నారు. వికలాంగులకి అందించే అన్ని పరికరాలలో 5 శాతం రిజర్వేషన్‌ని పారా క్రీడాకారులకు కేటాయించేలా తీర్మానం చేశామన్నారు. మెట్రో స్టేషన్, జిల్లా కేంద్రాల్లో ఉపాధి పొందేందుకు 7 సీటర్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్లను కూడా అందించేందుకు చొరవ తీసుకుంటామన్నారు. తొలుత పైలట్ ప్రాజెక్టులుగా 15 నియోజకవర్గాలను ఎంచుకొని, ఆ నియోజకవర్గాలలో వికలాంగుల స్థితి గతులపై పూర్తి స్థాయి అధ్యయనం, ఈ విధానాలను అమలు చేస్తామని ముత్తినేని వీరయ్య పేర్కొ్న్నారు.

Advertisement

Next Story

Most Viewed