- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీరామ శోభాయాత్ర పై సస్పెన్స్..!
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 30న నగరంలో నిర్వహించే శోభాయాత్రకు సర్వం సిద్ధం కాగా బీజేపీ వైఖరి ఏమిటనేది అందరిలో చర్చనీయాంశమైంది. బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే టీ.రాజాసింగ్ ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా శోభాయాత్ర కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే గత శోభాయాత్రలకు, తాజా యాత్రకు తేడా కనబడుతుంది. అప్పట్లో రాజాసింగ్ బీజేపీ పార్టీలో ఉండి పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో విజయవంతంగా యాత్రను పూర్తి చేసేవారు. గత యేడాది ఆగస్టు నెలలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించగా పోలీసులు ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేయడంతో జైలుకు కూడా వెళ్లి వచ్చారు.
ఇప్పుడు ఆయనపై బీజేపీ ఏడు నెలల క్రితం విధించిన బహిష్కరణ ఇంకా ఎత్తివేయలేదు. ఈ నేపథ్యంలో మరికొన్ని గంటలలో సీతారాంబాగ్‌లోని ద్రౌపది గార్డెన్ నుంచి హనుమాన్ టేక్డీలోని హనుమాన్ వ్యాయామ శాల వరకు శ్రీరామ శోభాయాత్ర జరుగనుంది. ఈ యాత్రకు బీజేపీ సపోర్ట్ ఉంటుందా? లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది. ఈ నేపథ్యంలో శోభాయాత్ర విజయవంతానికి ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారనేది ఫోన్ ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
బీజేపీ అభిమానులు కలిసి వస్తారా?
శ్రీరామనవమి శోభాయాత్రలో యువతది ప్రధాన పాత్ర. కాషాయ జెండాలు చేతబట్టి జై శ్రీరామ్, జైజై శ్రీరామ్ అంటూ దారిపొడవునా నినాదాలు చేస్తూ వేల సంఖ్యలో ముందుకు కదులుతారు. వీరిలో బీజేపీ అభిమానులే కాకుండా హిందూ యువత కూడా పాల్గొంటారు. అయితే రాజాసింగ్ పై పార్టీ బహిష్కరణ ఎత్తి వేయకపోవడంతో బీజేపీ అభిమానులు ఇందులో పాల్గొంటారా? లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. దీనికితోడు ఆయనను పీడీ యాక్ట్ కేసులో జైలు నుంచి విడుదల చేసే క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయరాదని న్యాయస్థానం హెచ్చరించింది. దీంతో కొన్ని రోజుల పాటు మౌనంగా ఉన్న ఆయన తిరిగి అలాంటి వ్యాఖ్యలు చేయడంతో మరోమారు మంగళ్ హాట్ పీఎస్‌లో ఈ నెలలో మూడుకేసులు నమోదయ్యాయి.
ఈ నెల 9న రాజాసింగ్ హిందూ కమ్యూనిటీ ప్రజలు ప్రత్యేక వ్యక్తుల నుంచి వస్తువులను కొనుగోలు చేయరాదని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. మరో కేసు నాందేడ్ బిలోలి సభలో రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని వచ్చిన ఫిర్యాదుతో కేసు బుక్ చేశారు. అంతకు ముందు హోళీ పండుగ రోజు చేసిన వ్యాఖ్యలపై మరో కేసు నమోదైంది. ఈ నెల 8న బక్రీద్ పండుగకు రోడ్లపై రక్తంపారితే లేని తప్పు హోళీకి రంగులు చల్లితే వచ్చిందా అంటూ వ్యాఖ్యలు చేశాడని పోలీసులు కేసు నమోదు చేశారు.
గతంలో రాజాసింగ్ పై నమోదైన కేసులలో కొన్ని..
2014లో మొదటిసారిగా గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజాసింగ్ 2018 లో కూడా బీజేపీ నుంచి విజయం సాధించిన ఏకైక ఎమ్మెల్యే గా నిలిచారు. అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, కేసులతో ఆయనను పార్టీ బహిష్కరించింది. శ్రీరామనవమిని పురస్కరించుకుని చేపట్టనున్న శోభాయాత్ర సందర్భంగా కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో దాని ప్రభావం శోభాయాత్రపై పడినట్లుగా కనబడుతోంది.
తాజాగా మంగళ్‌హాట్ పీఎస్‌లో ఆయనపై కేసులు నమోదు కావడంతో శోభాయాత్రకు పోలీసులు మరిన్ని ఆంక్షలు విధిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. 2015లో ఓ పెళ్లి వేడుకలో డీజేను ఆపేందుకు వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించి రాజాసింగ్ మొదటిసారి వార్తల్లో నిలిచారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మ్యూజిక్ ప్లే చేస్తే ఆపేందుకు వెళ్లిన పోలీస్‌పై దాడి చేశాడు. దీంతో రాజాసింగ్‌పై కేసు నమోదైంది.
అదే ఏడాది ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని ఓవర్గం విద్యార్థులు ప్రకటించినప్పుడు రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గోమాతను రక్షించేందుకు ప్రాణాలైనా అర్పిస్తాం, అవసరమైతే ప్రాణాలు తీస్తాం అని బెదిరించారు. 2018లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తనపై మొత్తం 43 కేసులు నమోదైనట్లు రాజాసింగ్ పేర్కొన్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం, విద్వేష ప్రసంగాలు, ప్రార్థనా స్థలాన్ని అపవిత్రం చేయడం, హత్యాయత్నం వంటి కేసులు తనపై ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు.2020లో రాజాసింగ్‌ను ప్రమాదకరమైన వ్యక్తిగా ఫేస్‌బుక్ లేబుల్ చేసింది.
ఆ ఏడాది సెప్టెంబర్‌లో విద్వేష ప్రసంగాలు చేసినందుకు ఆయనపై నిషేధం విధించింది. రోహింగ్యా ముస్లింలపై, ముస్లింల పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై ఈ చర్యలు తీసుకుంది. 2022 ఏప్రిల్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. భారత్ త్వరలోనే హిందూ దేశంగా మారుతుందని ఆయన పాట కూడా పాడారు. మునావర్ ఫరూఖీ షో సందర్భంగా రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ షో వేదికను తగలబెడతానని బెదిరించారు. దీంతో ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
శోభాయాత్ర మార్గాలను పరిశీలించిన సీపీ..
ఈ నెల 30న మధ్యాహ్నం ఒంటి గంటకు సీతారాం బాగ్ నుంచి శోభాయాత్ర ప్రారంభమై బోయిగూడ కమాన్, మంగళ్‌హాట్, జుమ్మెరాత్ బజార్, చుడిబజార్, బేగంబజార్, మోజంజాహి మార్కెట్, సిద్దం బజార్, కోఠి, సుల్తాన్ బజార్‌ల మీదుగా సాయంత్రం 6.30 గంటల వరకు హనుమాన్ వ్యాయామ్ శాలకు చేరుకుంటుంది. యాత్ర మొత్తం 6.8 కిలోమీటర్ల మేర సాగనుంది. కాగా శోభాయాత్ర సాగే మార్గాలను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఇతర పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి సోమవారం పరిశీలించారు. యాత్ర సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.