ఈ నెల 21వ తేదీలోగా సమస్యలు పరిష్కరించండి : తెలంగాణ ఉద్యోగుల జేఏసీ

by Aamani |
ఈ నెల 21వ తేదీలోగా సమస్యలు పరిష్కరించండి : తెలంగాణ ఉద్యోగుల జేఏసీ
X

దిశ,హైదరాబాద్ బ్యూరో : ఉద్యోగుల పెండింగ్ సమస్యలకు ఈ నెల 21వ తేదీ లోగా పరిష్కారం చూపాలని లేని పక్షంలో 22వ తేదీన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది.ఈ మేరకు శుక్రవారం జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్,సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావుల నేతృత్వంలో జేఏసీ ప్రతినిధులు సీఎస్ శాంతికుమారి ,సీఎం ప్రత్యేక కార్యదర్శి శేషాద్రిలను కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం నాంపల్లి లోని టీఎన్జీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుసేనీ, టీజీఓ ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ గత కొన్ని నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉద్యోగుల ఆకాంక్షల మేరకు కొత్త ప్రభుత్వం ఏర్పడిందని సంతోషిస్తూ సంబరాలు చేసుకున్నట్లు తెలిపారు.

అందుకు అనుగుణంగానే నూతన ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ఉద్యోగులందరికీ మొదటి తారీఖుననే జీతాలు చెల్లించడం, 2018 సంవత్సరం తర్వాత ఉద్యోగుల బదిలీలను చేపట్టడం,జీఓ 317 తో ఉత్పన్నమైన సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం, పెండింగ్ లో ఉన్న కొన్ని బిల్లులను మంజూరు చేయడం, కొన్ని శాఖలలో పదోన్నతులను కల్పించడం, ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేయడం, కొత్తగా ఉద్యోగ ఉపాధ్యాయ నియామకాలు చేయడం లాంటి ఉద్యోగ అనుకూల విధానాలను ప్రభుత్వం చేపట్టిందని, దీనిని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ స్వాగతించిందని గుర్తు చేశారు.

అలాగే తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పాటు అయితే ఉద్యోగుల పెండింగ్ సమస్యలన్నీ వెంటనే పరిష్కరిస్తామని ప్రధానంగా అప్పటికి పెండింగులో ఉన్న మూడు డి ఏ లను, అలాగే అన్ని పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని, మెరుగైన ఫిట్మెంట్ లతో పీఆర్సీ అమలు చేస్తామని, ఉద్యోగ పెన్షనర్లు అందరికీ హెల్త్ కార్డులను మంజూరు, సీపీఎస్ ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమును అమలు చేయడం, 317 జీవో లో జరిగిన అనేక తప్పులను సవరించి ఉద్యోగులందరికీ న్యాయం చేసేటట్టుగా అనేక ఉద్యోగ అనుకూల విధానాలను చేపడుతామని చెప్పి తెలియజేసినందుకు యావత్ తెలంగాణ ఉద్యోగ వర్గం కొత్త ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో మద్దతుగా నిలవడం జరిగిందన్నారు . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు పూర్తి కాబోతున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో చేర్చిన ఉద్యోగుల ప్రధానమైన 9 డిమాండ్లతో పాటు ఇతర 41 డిమాండ్లు దాదాపు 50 డిమాండ్లకు సంబంధించి సమస్యలను పరిష్కరించ కపోవడంతో ఉద్యోగులు చాలా అసంతృప్తిగా ఉన్నారన్నారు.

ఈ విషయమై పలు పర్యాయాలు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు . తుఫాను బీభత్సంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొని తమ ధన,ప్రాణాలకు, ఆస్తులకు తీవ్ర నష్టం అయిన సందర్భంలో తెలంగాణలో ఉన్న పది లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు, కాంట్రాక్టు పలుమార్లు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు దసరా పండుగ ముందు భారమైనప్పటికీ సెప్టెంబర్ నెలలో ఒకరోజు బేసిక్ వేతనాన్ని దాదాపుగా రూ 130 కోట్ల మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయడం జరిగిందన్నారు . సమస్యలను పరిష్కరించు కోవడం కోసం ప్రభుత్వం తోటి స్నేహపూర్వకంగానే ఉండాలని చెప్పి గత 10 నెలల నుండి ఉద్యోగుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తున్నప్పటికీ కూడా మేము ఎలాంటి కార్యచరణని ప్రకటించలేదన్నారు.

సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఉద్యోగ జేఏసీ నాయకత్వం మీద భౌతిక దాడులకు కూడా ప్రాథమిక సభ్యులు సిద్ధమవుతున్న సందర్భాన్ని గమనించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మా సమస్యలను అక్టోబర్ 21 లోగా మాతో చర్చించి పరిష్కరించండి , ఉద్యోగుల ఆందోళనను దూరం చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.లేనట్లయితే అక్టోబర్ 22న మా భవిష్యత్ కార్యాచరణను రూపకల్పన చేయాల్సిందిగా భాగస్వామ్య సంఘాలు కోరుతున్నందున ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల గురించి ఆలోచించి వెంటనే పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు . ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కస్తూరి వెంకటేశ్వర్లు, ఎం సత్యనారాయణ గౌడ్, గోల్కొండ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed