మనుషుల నిజస్వరూపం బయటపడేది అప్పుడే... అసలు రంగు చూడాల్సిందే..

by Sujitha Rachapalli |
మనుషుల నిజస్వరూపం బయటపడేది అప్పుడే... అసలు రంగు చూడాల్సిందే..
X

దిశ, ఫీచర్స్ :జీవితం చాలా విచిత్రమైనది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించనట్లే.. ఏ వ్యక్తి ఎలాంటి సందర్భంలో ఏ విధంగా ప్రవర్తిస్తారో కూడా అంచనా వేయలేం. పరిస్థితిని బట్టి వారి నిజస్వరూపం బయటపడుతుంది. మనం ఎంత దూరంగా లేదా దగ్గరగా ఉండాలో హెచ్చరిస్తుంది. అయితే ఇన్నాళ్లు మన పక్కనే ఉండి మంచి అనే మాస్క్ వేసుకుని తిరుగుతున్న వ్యక్తి అకస్మాత్తుగా మాస్క్ తీసేస్తే చాలా మంది తట్టుకోలేరు. కాగా అలాంటి మాస్క్ తీసి.. అసలైన క్యారెక్టర్ ను బయటపెట్టే సందర్భాలు కొన్ని ఉంటాయని చెప్తున్న నిపుణులు.. అవేంటో వివరిస్తున్నారు. అలా జరిగినా కూడా తట్టుకొని నిలబడాలని సూచిస్తున్నారు.

సంక్షోభ సమయం

లైఫ్ ఎప్పుడు పట్టుపరుపులు మాత్రమే ఇవ్వదు. కొన్నిసార్లు నేలపై ఉన్నావని కూడా గుర్తుచేస్తుంది. అలాంటి సంక్షోభ సమయమే అసలు మిత్రులు, నకిలీ దోస్తులు, దగ్గరి బంధువులు దూరం పెట్టడం, దూరపు చుట్టాల్లోనూ దగ్గరితనం కనిపించడం చూపిస్తుంది. ఇలాంటి గందరగోళ సమయాల్లోనే మనిషి నిజమైన రంగులను ప్రదర్శించే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఒక వ్యక్తి సంక్షోభం సమయంలో ప్రతిస్పందించే విధానం కూడా ఈ కోవలోకే వస్తుంది. పరిస్థితికి భయపడుతున్నాడా? ప్రశాంతంగా సంయమనంతో ఉన్నాడా? బాధ్యత తీసుకుంటాడా లేక ఎదుటివారిపై నిందలు వేస్తాడా? అనేది నిర్ణయిస్తుంది.

నైతిక గందరగోళం

జీవితంలో ఎదురయ్యే నైతిక సందిగ్ధత.. మన విలువలు, సూత్రాలను నిజంగా పరీక్షించే క్షణం. కడుపున పుట్టిన వారు అయినా.. కన్న తల్లిదండ్రులు అయినా.. తప్పు చేస్తే తప్పు అని చెప్పేంత గొప్ప గుణం కలిగి ఉంటామా లేదా అనేది చెప్తుంది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా నిజాయితీకి కట్టుబడి ఉంటామా లేక అసౌకర్య పరిస్థితికి తలొగ్గి తప్పును కప్పి పుచ్చుతామా అనేది నిర్ధారిస్తుంది. సౌలభ్యం, సంస్కారం మధ్య ఏది ఎంచుకుంటామో.. మన వ్యక్తిత్వం ఏంటో ఈ నైతిక సందిగ్ధత బయటపెడుతుంది.

ఊహించని పవర్ పొందినప్పుడు

ఒక వ్యక్తి నిజమైన వ్యక్తిత్వం బయటపడేది ఊహించని శక్తిని పొందిన సమయం. అకస్మాత్తుగా అధికారం లేదా నియంత్రణ శక్తిని పొందితే వారి ప్రవర్తన నాటకీయంగా మారుతుంది. యజమానిగా అధికారం చెలాయిస్తారా లేక తమ పవర్ ను బాధ్యతాయుతంగా, న్యాయం కోసం ఉపయోగిస్తారా తెలుపుతుంది. తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు దయ, వినయం కలిగి ఉండటం సులభం. కానీ అగ్రస్థానంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరిస్తారనేది మీ అసలైన క్యారెక్టర్ ను రివీల్ చేస్తుంది.

వైఫల్యం

వైఫల్యం మనిషిని ఉత్తమంగా పరీక్షించే పరిస్థితి. జీవితం మన చేతుల్లో ఉన్నప్పుడు మనోహరంగా, సానుకూలంగా ఉండటం సులభం. కానీ ఎదురుదెబ్బలు తగిలినప్పుడే మన నిజస్వరూపం బయటపడుతుంది. వైఫల్యం ఎదుర్కొన్నప్పుడు తప్పుకుంటారా లేక మళ్లీ ప్రయత్నిస్తారా? తమ చర్యలకు బాధ్యత వహిస్తారా లేదా ఇతరులను నిందిస్తారా? తప్పుల నుండి నేర్చుకుంటారా లేదా పునరావృతం చేస్తారా? అనేది తెలుస్తుంది. మొత్తానికి ఓటమి మన స్థితిస్థాపకత, సంకల్పాన్ని పరీక్షిస్తుంది. ఇది మన వేషాలను తీసివేసి, నిజమైన రంగులను బయటకు తెస్తుంది.

ఒత్తిడి

ఒక వ్యక్తి అసలు రంగు బయటపెట్టే పరిస్థితుల్లో ఒత్తిడి ఒకటి. ఇది ముఖం వెనుక ఉన్న మాస్క్ తొలగించి.. అత్యంత ప్రామాణికమైన స్వభావాలను బహిర్గతం చేస్తుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు కొంతమంది చిరాకు, అసహనానికి గురవుతారు, మరికొందరు ప్రశాంతంగా, కంపోజ్‌గా ఉంటారు. కొందరు వెనక్కి వెళ్లి తమను తాము ఒంటరిగా చేసుకోవచ్చు. ఇంకొందరు మద్దతు కోసం చేరుకోవచ్చు.ఈ సవాలు సమయాల్లో ఒత్తిడితో

కృంగిపోతారా? లేక సందర్భానుసారంగా ముందుకు సాగుతారా? తేలుస్తుంది.

ఆకస్మిక మార్పు

మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా మార్పు అనేది జీవితంలో ఒక భాగం. కానీ ఊహించని మార్పులకు మనం ఎలా స్పందిస్తామో మన క్యారెక్టర్ ను డిసైడ్ చేస్తుంది. ఉదాహరణకు ఉన్న ఊరును వదిలి వెళ్లాలనేది ఆకస్మిక నిర్ణయం అయినప్పుడు కొందరు భయపడతారు. వెళ్లేందుకు సంకోచిస్తారు. ఇంకొందరు దాన్ని సవాలుగా స్వీకరిస్తారు. మరో మెట్టు ఎదిగేందుకు వాడుతారు. అంటే ఈ పరిస్థితి బలం, స్థితిస్థాపకత, వృద్ధికి వారి సామర్థ్యాన్ని వెల్లడిస్తుంది.

గాసిపింగ్

చాలా మందికి గాసిప్స్ మాట్లాడుకోవడం అంటే చాలా ఇష్టం. ఒక దగ్గర గుమిగూడినప్పుడు.. అక్కడ లేని వ్యక్తి గురించి చర్చించడం, నెగెటివ్ చేయడం కామన్. కానీ ఇలాంటి సందర్భాల్లోనూ అలాంటి సమాచారం వ్యాప్తి కాకుండా వ్యతిరేకించడం గొప్ప క్యారెక్టర్ ను ప్రదర్శిస్తాయి. రసవంతమైన ఇన్ఫర్మేషన్ చేతిలో ఉన్నప్పుడు కూడా గాసిపింగ్ కు అవకాశం ఇవ్వకపోవడం నిజంగా గొప్ప విషయమే.

మరొకరి విజయం

మనం సక్సెస్ అయినప్పుడు ఇంకొకరు విజయవంతమైతే ఓకే కానీ మనకు ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు ఎదుటివారు సక్సెస్ అయితే మన రియాక్షన్ ఎలా ఉంటుందనేది.. అసలు స్వరూపాన్ని బయటపెడుతుంది. సంతోషిస్తారా? అసూయ పడుతారా? ప్రేరణ పొందుతారా? అనేది ఆ వ్యక్తి ఆత్మ విశ్వాసం, గౌరవం, మంచితనాన్ని వివరిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed