Collector Anudeep Durishetti : పాఠశాలల అభివృద్ధికి బాధ్యతగా పనిచేయాలి

by Sridhar Babu |
Collector Anudeep Durishetti : పాఠశాలల అభివృద్ధికి  బాధ్యతగా పనిచేయాలి
X

దిశ, చార్మినార్​ : ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య బోధనతో పాటు పాఠశాల అభివృద్ధికి పోటీపడి పనిచేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ బహదూర్ పుర ఉమ్డా ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా పాఠశాలల్లో చేపట్టిన టాయిలెట్, ఫ్లోరింగ్, కలర్ పెయింటింగ్, నల్లాల ఫిట్టింగ్, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పాఠశాలకు హెచ్ఎండబ్ల్యూఏ ద్వారా నీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల వెనకవైపు చెత్త చెదారం ఉండటాన్ని గమనించి పాఠశాల ప్రధానోపాధ్యాయుని పై ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే చెత్తను తొలగించి పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

పాఠశాలలో హాజరు రిజిస్టర్ పరిశీలించి రికార్డులు అప్డేట్ చేయాలని ఆదేశించారు. పిల్లలందరికీ నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫారాలు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఐఎస్ఎం ఎస్ పోర్టల్ లో ఆన్లైన్లో ఎప్పటికప్పుడు డేటా అప్డేట్ చేయాలని డేటా ఎంట్రీ ఆపరేటర్ ను ఆదేశించారు. అనంతరం పాఠశాలలోని ల్యాబ్, ఆరో సెంటర్ స్టోర్ రూమ్ పరిశీలించి పాఠశాలలో ఉన్న స్క్రాప్ ను తొలగించాలని సూచించారు. పాఠశాల ఆవరణలోని భవిత సెంటర్ ను పిల్లలతో ముచ్చటించి వారి పేర్లను అడిగి తెలుసుకున్నారు. ఫిజియోథెరపీ డాక్టర్, ఉపాధ్యాయురాలి సేవలు బాగున్నాయని ప్రశంసించారు.

భవిత సెంటర్ లో బాగా వెలుతురు ఉండేలా అదనంగా 4 ట్యూబ్ లైట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వారంలో రెండు రోజులు స్పీచ్ థెరపి డాక్టర్ సేవలు అందేలా ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలల అభివృద్ధికి పోటీపడి పనిచేసి పాఠశాలను అందంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈవో కె. రోహిణి, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి ఆశన్న, డిప్యూటీ డీఈఓ ఏ.సత్యవతి, డిప్యూటీ ఐఓఎస్ ఖలీల్, డీఈ రాజన్న, ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ రఫీ, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed