ఫ్లై ఓవర్లకు రిపేర్లు.. గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన స్టాండింగ్ కమిటీ

by Anjali |
ఫ్లై ఓవర్లకు రిపేర్లు.. గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన స్టాండింగ్ కమిటీ
X

దిశ, సిటీ బ్యూరో: హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకి పట్టణీకరణ వేగంగా పెరుగుండటంతో దానికి తగ్గట్టుగానే రద్దీ, ట్రాఫిక్ కూడా పెరుగుతుండటంతో వాహనదారులకు కాస్త ఊరట కల్గించేందుకు వీలుగా ఎంతో ముందు చూపుతో సుమారు మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన నగరంలోని పలు ఫ్లై ఓవర్లకు మరమ్మతులు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఇందులో భాగంగా మహానగరంలో ఇప్పటికే వాహనదారులకు అందుబాటులో ఉన్న పలు ఫ్లై ఓవర్లకు మెయింటనెన్స్ కింద మరమ్మతులు చేపట్టాలన్న ప్రతిపాదనకు ఇటీవలే స్టాండింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో తదుపరి పరిపాలనపరమైన మంజూరీ కోసం ప్రతిపాదనలను జీహెచ్ఎంసీ సర్కారుకు పంపింది. వీటిలో అత్యంత రద్దీగా ఉండే, రికార్డు స్థాయిలో వాహనదారులు రాకపోకలు సాగించే బేగంపేట ఫ్లై ఓవర్ కు మరమ్మతులు, పునరావాస చర్యలు కోసం రూ. 20 కోట్లను స్టాండింగ్ కమిటీ ఆమోదించింది.

దీంతో పాటు సికింద్రాబాద్ జోన్ పరిధిలోని రామకృష్ణాపురం రోడ్ ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ)కి రూ.6కోట్లతో రిపేర్ల కోసం తయారు చేసిన ప్రతిపాదనలకు కూడా స్టాండింగ్ కమిటీ ఆమోదించటంతో తదుపరి పరిపాలన పరమైన మంజూరీకి కోసం జీహెచ్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. సుమారు రూ.26కోట్ల అంచనా వయ్యాలతో కూడిన ఈ రెండు ప్రతిపాదనలకు సర్కారు పరిపాలనపరమైన ఆమోదాన్ని ఇస్తే వెంటనే టెండర్లను ఆహ్వానించి పనులు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఈ రెండు వంతెనలకు అవసరమైన మరమ్మతులను ఇప్పటికే జీహెచ్ఎంసీ ఇంజనీర్లు గుర్తించినట్లు సమాచారం. మరమ్మతుల పనులను పగటి పూట చేపడితే ట్రాఫిక్ కు అంతరాయమేర్పడే అవకాశం ఉండటంతో నగర పోలీసుల అనుమతులను తీసుకుని రాత్రి పూట చేపట్టేందుకు వీలుగా జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

నాలుగు జంక్షన్లలో గ్రేడ్ సెపరేటర్లు, ఎఫ్ఓబీకి రూ. 515 కోట్లు

ఫ్లై ఓవర్ల మరమ్మతుల ప్రతిపాదనతో పాటు ఎల్బీనగర్ వద్దనున్న నాలుగు జంక్షన్ల దగ్గర గ్రేడ్ సెపరేటర్లు, ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.515కోట్ల వ్యయంతో తయారు చేసిన ప్రతిపాదనలకు స్టాండింగ్ కమిటీ ఆమోదించి, తదుపరి పరిపాలన పరమైన ఆమోదం కోసం సర్కారుకు పంపినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలను 2015 సెప్టెంబర్ మాసంలో అప్పటి సర్కారు రూ.448 కోట్లతో రూపకల్పన చేయగా, అవే ప్రతిపాదనలను సవరించి, ఎస్ఎస్ఆర్ రేటు ప్రకారం ప్రతిపాదనలను గత ఫిబ్రవరి 6వ తేదీన సవరించి మరో రూ. 67 కోట్లను కలిపి, రూ. 515 కోట్లకు పెంచుతూ స్టాండింగ్ కమిటీకి పంపగా ఆమోదం లభించింది. ఎస్ఆర్డీపీ-1 కింద చేపట్టనున్న ఈ పనులకు సర్కారు ఆమోదిస్తే, టర్మ్ కీ ఈపీసీ మోడ్ కింద చేపట్టేందుకు జీహెచ్ఎంసీ సిద్ధంగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed