గ్రేటర్ హైదరాబాద్‌లో వర్ష బీభత్సం

by Aamani |
గ్రేటర్ హైదరాబాద్‌లో వర్ష బీభత్సం
X

దిశ,హైదరాబాద్ బ్యూరో : జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం కుండపోతగా వర్షం కురిసింది.నల్లటి మబ్బులు, ఉరుములు, మెరుపులతో గంటల పాటు కురిసిన వర్షానికి జనజీవనం అస్థవ్యస్థ మైంది. గత మూడు రోజులుగా నగరంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, చైతన్యపురి, ఉప్పల్, రామంతపూర్, మలక్ పేట్, ముసారాంబాగ్,అంబర్ పేట్, కోఠి, అబిడ్స్ , బంజారాహిల్స్, సోమాజిగూడ, జూబ్లీహిల్స్, నాంపల్లి, బషీర్ బాగ్ తదితర ప్రాంతాల్లో వర్షం ఏకధాటిగా కురియడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

రోడ్లపై మోకాలి లోతులో నీరు నిలిచిపోయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. వర్షం ప్రభావంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో గంటల పాటు అంతరాయం ఏర్పడింది. కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు వదిలే సమయంలో వర్షం మొదలు కావడంతో ఉద్యోగులు, విద్యార్థులు ఇండ్లకు వెళ్లేందుకు పడరాని పాట్లు పడ్డారు . ఎల్బీ నగర్ నియోజకవర్గం మారుతి నగర్ , కొత్తపేట, నాగోల్ తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. అపార్ట్ మెంట్ లు, ఇండ్లలోకి వరద నీరు చేరడంతో వాటిలో ఉంటున్న వారు పడరాని పాట్లు పడ్డారు.

అధికారులను అప్రమత్తం చేసిన కమిషనర్...

గ్రేటర్ హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని బల్దియా కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసుకోకుండా చూడాలని సూచించారు. బుధవారం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు, సిబ్బందిఅప్రమత్తంగా ఉండాలని, క్షేత్ర స్థాయిలో పర్యటించాలని కోరారు . ఈ మేరకు మాన్సూన్ ఎమర్జెన్సీ, స్టాటిక్ బృందాలను సైతం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఎప్పటికప్పుడు వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద చేరిన నీటిని తొలగించాలన్నారు. నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అవసరం ఉంటేనే ఇండ్ల నుంచి బయటకు రావాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed