దర్యాప్తు సంస్థల దూకుడు.. రాజకీయ నాయకుల్లో మొదలైన వణుకు..!

by Hajipasha |   ( Updated:2022-11-23 07:09:00.0  )
దర్యాప్తు సంస్థల దూకుడు.. రాజకీయ నాయకుల్లో మొదలైన వణుకు..!
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడుతో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్‌లో అధికార పార్టీ నాయకులలో వణుకు మొదలైంది. ఓ వైపు కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, మరోవైపు ఆదాయ పన్ను శాఖల దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే చికోటి ప్రవీణ్ క్యాసినో, గ్రానైట్ కేసుల విచారణ జరుగుతుండగా తాజాగా ఐటీ అధికారులు కూడా తనిఖీలు చేయడంతో నాయకులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

ఆదాయ పన్ను శాఖ అధికారులు ఏకంగా రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డికి చెందిన విద్యా, వైద్య సంస్థలు, సోదరులు, బందువుల ఇండ్లపై కూడా ఏక కాలంలో సుమారు 50కి పైగా బృందాలు దాడి చేయడం, తాళం వేసి ఉన్న లాకర్లను సైతం తీయించి తనిఖీలు చేపడుతుండడంతో ఇతర నాయకులలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. మంత్రి స్థాయి నాయకులనే వదలనప్పుడు తమను ఎలా వదులుతారని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలతో పాటు ఇతర చోటా, మోటా నాయకులు మదన పడుతున్నారు.

ఎప్పుడు ఎవరికి నోటీసులు వస్తాయో.?

చికోటి ప్రవీణ్ క్యాసినో గేమ్‌లో అంటాకాగి అతనితో పరిచయం పెంచుకున్న నాయకులకు తాజాగా నెలకొన్న పరిస్థితులు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. తీగ లాగితే డొంక కదలిందన్నచందగా క్యాసినో వ్యవహరాంలో రోజుకో పేరు బయటకు వస్తోంది. ఈడీ అధికారులు ఏ ఒక్కరిని వదలకుండా నోటీసులు జారీ చేయడం, విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తుండడంతో ఎప్పుడు ఎవరికి నోటీసులు వస్తాయోనని నాయకులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. సుమారు నెల రోజుల క్రితం మంత్రి గంగుల కమలాకర్‌కు చెందిన గ్రానైట్ వ్యాపార సంస్థలపై మొదలైన దాడులు ఇంకా కొనసాగుతుండడం, ఈడీ, ఐటీ అధికారులు మరింత దూకుడు పెంచిన నేపథ్యంలో ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

నాయకుల సమావేశం..

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సీ మల్లారెడ్డికి చెందిన వ్యాపార సంస్థలు, సోదరులు, ఇతర బందువుల ఇండ్ల పై కేంద్ర ఆదాయ పన్ను శాఖ అధికారులు ఏక కాలంలో దాడులు చేపట్టడం నగర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనికితోడు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గం ఇంచార్జ్ లు, కార్పొరేటర్లు తదితర నాయకులతో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ సమావేశం కావడం కూడా ఇంకా ఏదో జరునుందనే సంకేతాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో దాడులకు భయపడటమని మంత్రులు మాట్లాడడం వంటివి ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు . అయితే నగరానికి చెందిన మరికొంత మంది ఎమ్మెల్యేలు, ఇతర నాయకులకు త్వరలో ఈడీ నోటీసులు అందే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.

హాట్ హాట్..

చలికాలంలోనూ రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు అందరిలో వేడిని పుట్టిస్తున్నాయి. చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారం, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులు, మొయినాబాద్ ఫాం హౌజ్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం ఆరోపణలు వంటివి నడుస్తుండగానే మంత్రి గంగుల కమలాకర్ కు చెందిన గ్రానైట్ సంస్థలపై దాడులు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు సోదరులు, పీఏలను ఈడీ అధికారులు ప్రశ్నించడం, తాజాగా మరో మంత్రి మల్లారెడ్డికి చెందిన ఆస్తులపై ఆదాయ పన్ను శాఖ అధికారుల దాడులపై చర్చలు గ్రేటర్ హైదరాబాద్‌లో హాట్ హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందనేది నగర వ్యాప్తంగా ఆసక్తిగా మారింది. దర్యాప్తు సంస్థల అధికారులు ఇంకా ఎవరెవరిటి నోటీసులు ఇవ్వనున్నారు ? అనేది కూడా ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. మొత్తానికి గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, దాడులతో నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed