వేడుక ఏదైనా.. వేదిక వాళ్లదే.. ఓట్ల కోసం మందు పార్టీలు

by Disha Web Desk 12 |
వేడుక ఏదైనా.. వేదిక వాళ్లదే.. ఓట్ల కోసం మందు పార్టీలు
X

దిశ, మేడ్చల్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుండడంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు వ్యూహాత్మకంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు రాజకీయ చదివింపులు మొదలెట్టారు. అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా ముందుకెళుతున్నారు. అన్ని కేటగిరీల ఓటర్లను టార్గెట్ చేస్తూ అడిగినంతా తాయిళాలు సమర్పిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు, పుట్టిన, పెళ్లి రోజు వేడుకలతో ప్రత్యేక దావతులు ఏర్పాటు చేస్తున్నారు.

ఆత్మీయ సమ్మేళనాలు..

కేడర్‌ను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా ఆత్మీయ సమ్మేళనాలు దోహదం చేస్తున్నాయి. పార్టీ నాయకత్వంపై అలక వహించిన వారిని, కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న వారిని, అనుమానాస్పదంగా ఉన్న కార్యకర్తలు , నాయకులను తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో బుజ్జగింపులకు దిగారు. అదే సమయంలో ప్రతిపక్షాల్లోని అసంతృప్త నాయకులు, కార్యకర్తలను తమ వైపు మళ్లించేందుకు ఈ సమ్మేళనాలు ఫలితాలను ఇస్తున్నట్లు జాతీయ పార్టీకి చెందిన ఓ నేత పేర్కొన్నారు. వీటిని ఎక్కువగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు, నాయకుల ప్రసంగాలు, కేడర్ నుంచి వచ్చే వినతులతో సభలు సాగుతున్నాయి. మధ్యాహ్నం భోజనం తర్వాత సమ్మేళనాలు ముగుస్తున్నాయి. ఒక విధంగా ఇవి ఆయా పార్టీలు తమ కేడర్ ను బలోపేతం చేసుకునేందుకు ఏర్పాటు చేసే సమావేశాలు మాత్రమే. కానీ ఇప్పుడు సమ్మేళనాలతో పాటు దావత్ లు జోరుగా సాగుతున్నాయి.

వేడుక మీది.. వేదిక మాది..

సాధరణంగా ఇండ్లలో కుటుంబ సభ్యుల సమక్షంలో స్నేహితుల సమక్షంలో చేసుకునే పుట్టిన రోజులు ఎన్నికల వేళ ఫంక్షన్ హాళ్లకు వచ్చి చేరాయి. పుట్టిన రోజు చేసుకునే వ్యక్తి ఏ కాలనీ సంఘానికో లేదా బస్తీ సంఘానికో నాయకుడైతే చాలు వేడుకలు ఘనంగా జరిగిపోతున్నాయి. అపార్టు మెంట్ సంఘాలకు చెందిన ప్రతినిధులు, వాకర్స్ ఆసోసియేషన్లకు చెందిన నాయకులు వివిధ కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం వహించే నాయకులకు సైతం వేడుకలు ఘనంగా జరిగిపోతున్నాయి. ఏకంగా ఫంక్షన్ హాళ్లను బుక్ చేసి ‘దావత్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా వేడుకల ఏర్పాటులో డివిజన్ నాయకులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల తిరుమలగిరిలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఓ జాతీయ పార్టీకి చెందిన అభ్యర్థి బర్త్ డే పేరిట ఓ ఫంక్షన్ హాల్ ను అద్దెకు తీసుకుని మందు పార్టీ ఏర్పాటు చేశారు. అభ్యర్థి కొద్ది సేపు ఉండి ఎన్నికల పరిశీలకులకు చిక్కే ప్రమాదం ఉన్న దృష్ట్యా ఆ బాధ్యతలను డివిజన్ స్థాయి నాయకులకు అప్పగించి వెళ్లారు.

స్పీడ్ పెంచిన అభ్యర్థులు

ఎన్నికల ప్రచారానికి కేవలం 3 రోజులు, పోలింగ్ కి 5 రోజులు మాత్రమే గడువు ఉంది. దీంతో అన్ని పార్టీలు ఓటింగ్ శాతాన్ని పెంచుకునేందుకు ఎక్కడికక్కడ కార్నర్ మీటింగులు, సభలు, సమావేశాలతో ప్రచారాన్ని హీటెక్కిస్తున్నాయి. పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసే అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, సీనియర్ సిటిజన్ సంఘాలు, మహిళా, దివ్యాంగుల సంఘాలతో విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. బస్తీ, కాలనీ సంఘాలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగులు జరుపుతున్నాయి. కుల సంఘాలను ఏకం చేసి వారికి కావాల్సినవి సమకూరుస్తున్నాయి. బలహీనంగా ఉన్న కాలనీల్లో చోటా మోటా నాయకులను, కుల సంఘాల ప్రతినిధులను మచ్చిక చేసుకునేందుకు ఖర్చుతో కూడుకున్న వారి కోరికలను తీర్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో పలుకుబడి ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు చివరి క్షణంలో పార్టీ ఫిరాయించకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓవైపు దావత్ లు మరోవైపు కాలనీల్లో సమస్యలు తీరే మార్గం కనిపించడంతో ఓటర్లు ఎంజాయ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed