- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బడా వ్యాపారులకు కొమ్ముకాస్తున్న ఓవైసీ
దిశ, చార్మినార్ : బడా వ్యాపారులకు మాత్రమే అసదుద్దీన్ ఓవైసీ కొమ్ముకాస్తున్నారని, ఓవైసీలపై పాతబస్తీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ లు ఆరోపించారు. ఎలాగైనా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం లో బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం భాగ్యనగర్ జిల్లా లోని చార్మినార్ ఖబుతర్ఖానా, ఛత్రినాక ప్రాంతాలలో విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు. అంతకుముందు శాలిబండ నుంచి ప్రారంభమైన విజయ సంకల్పయాత్ర లాల్‌దర్వాజ మోడ్, అలియబాద్, రాజన్న బావి, లాల్ దర్వాజ శ్రీ మహంకాళి దేవాలయం, నెహ్రు విగ్రహం, సుధా టాకీస్, గౌలిపుర మీదుగా ఛత్రినాక చేరుకున్నారు. అనంతరం ఛత్రినాక చౌరస్తా లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు పాల్గొని ప్రసంగించారు.
తొమ్మిది రోజులుగా విజయ సంకల్ప యాత్రలు నిర్వహిస్తున్నామని, భాజపా విజయ సంకల్ప యాత్రలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు కూడగడుతున్నామన్నారు. మూడోసారి మోదీని ప్రధాని చేయడానికి దేశ వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని భాజపా కైవసం చేసుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నామని, ఉచితాల పేరుతో కాంగ్రెస్ ఓట్లు దండుకునే కార్యక్రమం చేపట్టిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో గారడీ చేసి.. అధికారంలోకి వచ్చాక ప్రజలను మభ్య పెడుతుందన్నారు. ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే ముఖ్యమంత్రి షరతులు వర్తిస్తాయి అనడం హాస్యాస్పదం అన్నారు. నిన్న ప్రకటించిన రెండు గ్యారంటీల్లో అనేక ఆంక్షలు విధించారని, లబ్ధి దారులను తగ్గించేందుకు ప్రభుత్వం షరతులు విధించడం సిగ్గుచేటన్నారు.
పార్లమెంట్ ఎన్నికల కోసం పథకాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని, మహాలక్ష్మి పథకం అమలు అయ్యేది లేదు మహారాణులు అయ్యేది లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని, రైతు బంధు 15 వేలకు పెంచి ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన ఏ పథకం ప్రజల కడుపు నింపదని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చి.. బస్సులను తగ్గించిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వం తరహాలో తెలంగాణ వనరులను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ అధిష్టానానికి కప్పం కడుతుందన్నారు. మతం పేరుతో మజ్లీస్ రాజకీయాలు చేస్తూ పాత బస్తీ ప్రజలను మోసం చేస్తుందని, అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకు మజ్లీస్ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన చేరుతుందన్నారు.
పాకిస్థాన్ జిందాబాద్ అన్న నాయకుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదో సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని, భాజపాకు అవకాశం ఇస్తే హైదరాబాద్ రూపు రేఖలను మారుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సంరెడ్డి సురేందర్ రెడ్డి, సీనియర్ బీజేపీ నాయకులు ఉమా మహేంద్ర, కార్పొరేటర్లు ఆలే భాగ్యలక్ష్మి,శ్వేతా రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ జీ,మాజీ కార్పొరేటర్ ఆలే జితేంద్ర, నాయకులు రూప్ రాజ్, కౌడి మహేందర్, డాక్టర్ పండరీ, జె.చంద్రశేఖర్, చిరంజీవి, పండరినాథ్, వీరేందర్ యాదవ్ ,మాధురి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.