డిస్కౌంట్ ఇవ్వలేదని హోటళ్లపై దాడులకు ఆదేశం

by Anjali |   ( Updated:2023-03-22 06:33:45.0  )
డిస్కౌంట్ ఇవ్వలేదని హోటళ్లపై దాడులకు ఆదేశం
X

దిశ, సిటీ బ్యూరో: మహానగర ప్రథమ పౌరురాలైన గద్వాల్ విజయలక్ష్మి కార్యాలయ సిబ్బంది ఓవరాక్షన్ రోజురోజుకి పెరిగిపోతుంది. ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న అధికారులు తమ సొంత ప్రయోజనాల కోసం చూప్రుతున్న శ్రద్ధను ప్రజలకు సేవలందించటంలో చూపటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మేయర్ వ్యక్తిగత సహాయకుడినంటూ ఓ వ్యక్తి మహానగరంలో నిర్మాణం జరుగుతున్న భవనాల వద్దకు వెళ్లి, పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలుండగా, ఇపుడు తాజాగా కార్యాలయంలో విధులు నిర్వర్తించే ఓ అధికారి తన బంధువులకు నగరంలోని ఓ హోటల్ లో గది అద్దెలో డిస్కౌంట్ ఇవ్వకపోవటంతో నగరంలోని అన్ని హోటళ్లలోని ఆహారంపై తనిఖీలు నిర్వహించాలని ఏకంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో హుకూం జారీ చేయించినట్లు జీహెచ్ఎంసీలో చర్చ జరుగుతుంది.

తన బంధువులకు హోటల్ రూమ్ కావాలని, తాను మేయర్ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నానంటూ తాను ఫోన్ చేసి, చెప్పినా డిస్కౌంట్ ఇవ్వకపోవటంతో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్న సదరు అధికారి హోటళ్లపై మేయర్ కు తప్పుడు సమాచారమిచ్చి, ఆమెను తప్పుదారి పట్టించి సోమవారం ఫుడ్ సేఫ్టీ అధికారులను పిలిపించి, ఆగమేఘాలపై సమీక్ష నిర్వహింపజేసినట్లు సమాచారం. హోటళ్లపై దాడులు చేయాలని, ఆహారం తనిఖీ చేసి, అవసరమైతే హోటళ్ల ఫుడ్ సేప్టీ లైసెన్స్ లను రద్దు చేయాలని అధికారులకు ఆదేశిలిప్పించటం చర్చనీయాంశంగా మారింది. ఆఫీసు సిబ్బందిలో ఓ అధికారి ఎప్పటికపుడు మేయర్ కు తప్పుడు సమాచారమిచ్చి, ఆమెకు మిస్ గైడ్ చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నట్లు కూడా ఆరోపణలున్నాయి.

వాట్సప్ గ్రూప్ ఎందుకో?

మేయర్ ఆఫీసులో కీలక విధులు నిర్వర్తించే ఓ అధికారి తమకు అవసరమైనపుడల్లా ఫుడ్ ఇన్ స్పెక్టర్లు నగరంలో పేరుగాంచిన మిఠాయి షాపుల నుంచి ఆఫీసుకు 50 కిలోల స్వీట్లు పంపాలని వత్తిడి చేస్తున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. అంతేగాక, సదరు అధికారి వివిధ విభాగాల వారీగా అధికారుల ఫోన్ నెంబర్లతో ప్రత్యేక వాట్సప్ గ్రూప్ లను ఏర్పాటు చేసినట్లు కూడా సమాచారం. తమకు ఏం అవసరమైన వాట్సప్ లో సమాచారం పెట్టగానే సంబంధించి విభాగాధిపతి వెంటనే స్పందించాలన్న నిబంధనను కూడా బలవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల టౌన్ ప్లానింగ్ జరిగిన ఏసీపీల బదిలీలకు సంబంధించిన పలువురు ఏసీపీల నుంచి భారీగా ముడుపులు తీసుకుని, వారికి అవసరమైన చోట పోస్టింగ్ లు ఇప్పించటంలో సదరు సార్ చక్రం తిప్పినట్లు కూడా ఆరోపణలున్నాయి.

హోదా ఏమిటీ? సీటు ఎక్కడ?

జీహెచ్ఎంసీలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ (ఏఎంసీ) హోదాలో పని చేసి, సోమేశ్ కుమార్ జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్నపుడు 2016లో ఉప్పల్ సర్కిల్ కు ఇన్ ఛార్జి డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వర్తించిన ఈ అధికారి మేయర్ నిర్వహించిన సమీక్షల్లో తనకన్నా పై హోదాలో ఉన్న అధికారులను ప్రశ్నించటం, మేయర్, కమిషనర్, జోనల్ కమిషనర్ ల వరుసలో కూర్చోవటం పట్ల పలువురు అధికారులు అసహనం వ్యక్తం చేసిన సందర్భాల్లేకపోలేవు. అప్పట్లో రోజుకో చోట నిర్వహించే ఆంగడిలోని దుకాణాల నుంచి మామూళ్లు వసూలు చేసిన ఘనత కూడా ఈ సారే వహించినట్లు ఆరోపణలున్నాయి.

Advertisement

Next Story

Most Viewed