ఆరు గ్యారెంటీల అమలుకు ఇంకా 40 రోజులే సమయం

by Sridhar Babu |
ఆరు గ్యారెంటీల అమలుకు ఇంకా 40 రోజులే సమయం
X

దిశ, బేగంపేట : రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకు ఇంకా 40 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం నియోజకవర్గ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్ లు, డివిజన్ అధ్యక్షులతో మంత్రి నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఈ నెల 10న సనత్ నగర్ నియోజకవర్గం సమావేశం మహబూబ్ కాలేజీ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గడువులోగా ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజల పక్షాన పోరాడేందుకు వెనుకాడబోమని చెప్పారు.

ఇప్పటికే 2 హామీలను అమలు చేస్తున్నామని చేస్తున్న ప్రచారం అవాస్తవమని, కేవలం ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కార్యక్రమం ఒక్కటే అమలు అవుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా తాము అధికారంలో లేమని అధైర్య పడొద్దని, గతంలో మాదిరిగానే అన్ని వేళలా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనులను మంజూరు చేసినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం నిధులు లేవనే కారణంతో పనులను అడ్డుకొనే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారని అన్నారు. కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లు,

పార్టీ నాయకులు నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, కార్పొరేటర్ లు కొలను లక్ష్మి, టి.మహేశ్వరి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్, ఆకుల రూప, డివిజన్ అధ్యక్షులు కొలను బాల్ రెడ్డి, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, వెంకటేషన్ రాజు, ఆకుల హరి కృష్ణ, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed