న్యూ ఇయర్ కి న్యూ రూల్స్

by Kalyani |
న్యూ ఇయర్ కి న్యూ రూల్స్
X

దిశ, శేరిలింగంపల్లి : నూతన సంవత్సర వేడుకలకు సమయం ఆసన్నమైంది. న్యూ ఇయర్ వేడుకలకు అంతా సిద్ధమైపోతోంది. ఎవరి ప్లాన్లు వారు చేసుకుంటున్నారు. ఎలా ఎంజాయ్ చేయాలి అన్నదానిపై ఎవరికి తోచిన విధంగా వారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. హోటల్స్, పబ్ లు, రెస్టారెంట్లు, రిసార్ట్స్ అప్పుడే న్యూ ఇయర్ వేడుకలకు ఫుల్ గా రెఢీ అయిపోతున్నాయి. యూత్ కు నచ్చేలా, స్నేహితులతో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఎవరు ఏం చేయాలనుకున్నా కండిషన్స్ ఫాలో కావాల్సిందే అంటున్నారు పోలీసులు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు పలు నిబంధనలు పెట్టారు.

రూల్స్ ఇవే..

త్రీ స్టార్‌ అంతకంటే పెద్ద హోటళ్లు, పబ్బులు, క్లబ్బులు రాత్రి 1 గంట వరకు నిర్వహించే వేడుకలకు 15 రోజుల ముందుగానే అనుమతులు ఇచ్చేశారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, పార్కింగ్ ప్రదేశాల్లో విధిగా సీసీటీవీ కెమెరాలు అమర్చాలి. వేడుకల్లో శబ్ద తీవ్రత 45 డెసిబెల్స్ మించకూడదు. మద్యం సేవించినవారు పార్టీ తర్వాత డ్రైవింగ్‌ చేయకుండా, ఇంటికి చేరేలా చూసే బాధ్యత ఆయా పబ్ లు, రిసార్ట్స్ యాజమాన్యాలదే అని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు పబ్ లలో డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వినియోగంపై దృష్టి పెట్టాలని, అలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. అలాగే ఎలాంటి శాంతిభద్రతలకు ముప్పు తలెత్తకుండా, శాంతియుత వాతావరణంలో వేడుకలు జరిగేలా చూడాలని స్పష్టం చేస్తున్నారు.

పెరుగుతున్న డ్రగ్స్ కల్చర్

కొత్త సంవత్సరం వేడుకల్లో యూత్ మత్తులో జోగేలా చేసేందుకు డ్రగ్స్ సరఫరాదారులు సైతం పక్కా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో నగరంలో ఏదో ఒకచోట తరచూ డ్రగ్స్ ముఠాలు పట్టుబడుతూనే ఉన్నాయి. వీరందరి టార్గెట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీదనే.. ఇయర్ ఎండ్ పార్టీల మీద ఫోకస్ చేసిన విక్రయదారులు గోవా, కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్ తో పాటు ఆయా రాష్ట్రాల నుంచి డ్రగ్స్ ను నగరానికి తెప్పించడంలో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు నగర శివారుల్లోనూ లోకల్ మేడ్ గా తయారు చేస్తూ.. ఈ ఇయర్ ఎండ్ లో వీలైనంత ఎక్కువగా సప్లై చేసి కోట్లకు పడగెత్తాలని కొందరు అక్రమార్కులు ఈ బిజినెస్ లోకి దిగుతున్నారట. అలాంటి వారు ఈ న్యూ ఇయర్ మంచి అవకాశంగా భావిస్తున్నారు.

మహా నగరం పై ఫోకస్

ఇదివరకు చిన్నా చితకా గంజాయి కేసులు నమోదయ్యే హైదరాబాద్ లో ఇప్పుడు తరచుగా డ్రగ్స్ కేసులు నమోదవుతున్నాయి. అలాగే ఒకప్పుడు డ్రగ్స్ పట్టుబడ్డాయి అంటే ఆఫ్రికన్ల అరెస్టులు ఉండేవి. ఇప్పుడు లోకల్ ముఠాలే డ్రగ్స్ తయారు చేస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్ వినియోగంలో గోవా, ఢిల్లీ నగరాల తర్వాత... హైదరాబాద్ మూడో స్థానంలో ఉందంటే అతిశయోక్తి కాదు. ప్రతీ చిన్న పార్టీలో కూడా డ్రగ్స్ వాడకం కామన్ గా మారింది. పబ్లు, బార్లు, రిసార్టులు, ఫామ్ హౌసుల్లో చాలాకాలంగా ఈ దందా సాగుతుండగా ఈ మధ్య ఈ కల్చర్ అన్నిచోట్లకు పాకింది. బర్త్ డే వేడుకలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే చాలు ఏదో ఒక రకమైన డ్రగ్స్ లేకపోతే నామోషీగా ఫీలవుతున్నారు కొందరు. అదేదో స్టేటస్ సింబల్ అన్నట్లు ఫోజ్ లు కొడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే డ్రగ్స్ వాడకం అనేది ఇప్పుడు నయా ట్రెండ్ అంటున్నారు యూత్.

మత్తుకు బానిసలు..

గతంలో సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ మత్తు మందులు ఇప్పుడు సామాన్యుల చెంతకు కూడా చేరాయి. చివరికి స్కూలు విద్యార్థులకు సైతం మత్తుమందులు దొరుకుతున్నాయంటే ఈ డ్రగ్స్ ముఠాలు ఏ స్థాయిలో తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. చిత్రసీమను, ఐటీ ఎంప్లాయిస్ ను టార్గెట్ గా చేసుకుని రంగంలోకి దిగిన డ్రగ్స్ ముఠాలు.. సామాన్యులను సైతం తమ ఉచ్చులోకి లాగుతున్నాయి. వారికి ఏదో ఓ రూపంలో అందిస్తూ విద్యార్థి దశ నుంచి డ్రగ్స్ కు దాసోహం అనేలా చేస్తున్నాయి.

ఇది వరకు నైజీరియా, ఉగాండా లాంటి ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి అయ్యే అత్యంత ఖరీదైన మత్తుపదార్థాలు ఇప్పుడు లోకల్ గానే లభిస్తున్నాయి. గోవా, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ నుంచి ఖరీదైన డ్రగ్స్ హైదరాబాద్ వచ్చి చేరుతున్నాయి. వీటి సరఫరా కోసం పటిష్టమైన నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు సరఫరాదారులు. ఎప్పటికప్పుడు పోలీసులకు దొరక్కుండా కొత్త కొత్త పద్ధతుల్లో ఈ డ్రగ్స్ దందాను కంటిన్యూ చేస్తున్నారు. ఈ ఇయర్ ఎండ్ టార్గెట్ గా డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వారిని కట్టడి చేసేందుకు అధికారులు కూడా పూర్తిస్థాయిలో అప్రమత్తమవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed