Bogus Pensions: కుప్పలు తెప్పలుగా బోగస్ పింఛన్లు.. విచారణలో అక్రమాలు బట్టబయలు

by Shiva |
Bogus Pensions: కుప్పలు తెప్పలుగా బోగస్ పింఛన్లు.. విచారణలో అక్రమాలు బట్టబయలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఆసరా పింఛన్లలో తవ్విన కొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఇప్పటి వరకు చేసిన విచారణలో వేలాది మంది అనర్హులు పింఛన్లు పొందుతున్నట్లుగా వెల్లడైంది. వారంతా రెండు రకాల పింఛన్లు తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో వారందరికీ పింఛన్లు నిలిపివేశారు. రిటైర్డ్ ఉద్యోగులు, చేయూత పింఛన్‌దారుల వివరాలను మ్యాచ్ చేస్తూ వెరిఫై చేయగా అసలు కథ వెలుగులోకి వచ్చింది. దాదాపు 5వేలకు పైగా మంది అనర్హుల పేర్లను వెలికితీశారు. ఓ వైపు వేల రూపాయల ఫ్యామిలీ పెన్షన్‌ పొందుతూనే చేయూత పింఛను తీసుకుంటున్నట్లుగా గుర్తించారు. వారికి పింఛన్​కట్​చేయడంతోపాటు గతంలో తీసుకున్న మొత్తాన్ని రికవరీ చేయాలని నిర్ణయించారు. కానీ.. దానికి రాజకీయ రంగు పులుముకోవడంతో గతంలో తీసుకున్న మొతాన్ని వెనక్కి తీసుకోవాలనే నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు.

సెర్ప్ ఉద్యోగులకు ‘చేయూత’

చేయూత పింఛన్లను సెర్ప్​ఉద్యోగులు సైతం పొందుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దాంతో వారందరి వివరాలను అధికారులు పింఛన్ల డేటాతో మ్యాచ్ చేసి చూశారు. సెర్ప్​ఉద్యోగుల్లో 316 మంది వరకు చేయూత పింఛన్లు కూడా పొందుతున్నట్లుగా గుర్తించారు. దాంతో వారికి చేయూత పింఛన్ నిలిపివేశారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన సెర్ప్​ఉద్యోగులే అనైతిక కార్యకలాపాలకు పాల్పడటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. సెర్ప్​అధికారులు ఒక్కో రంగాన్ని జల్లెడ పడుతుండటంతో అక్రమాలు రోజుకు కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రంగాలను విచారణ చేస్తే ఇంకా పెద్దఎత్తున అక్రమాలు, అనర్హులు బయటపడుతారని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేయూత పింఛను ద్వారా 45 లక్షల మంది లబ్ధిపొందుతున్నారు. ఇందులో ఐదు లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన పింఛన్లలో ఎక్కువగా అనర్హులు ఉన్నట్లు తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పట్లో సోషల్​మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఉపాధి హామీ ఉద్యోగులు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న వారు ఇలా రకరకాలుగా ఉద్యోగులు చేయూత పింఛను పొందుతున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇందులోభాగంగానే ఆయా విభాగాలపై ఎంక్వయిరీ నడుస్తున్నట్లు తెలుస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed