Vishwakarma Yojana : ధోబి ఘాట్ ల అభివృద్ధికి కృషి చేస్తున్నాం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

by Sumithra |   ( Updated:2024-10-27 07:56:52.0  )
Vishwakarma Yojana : ధోబి ఘాట్ ల అభివృద్ధికి కృషి చేస్తున్నాం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
X

దిశ, ముషీరాబాద్ : దేశంలో చేతివృత్తులు కనమరుగవుతున్నాయని, వాటి పై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు ఉపాధి కోల్పోతున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ( Union Minister Kishan Reddy ) అన్నారు. గ్రామాల్లో ఇప్పటికీ చేతివృత్తుల ద్వారా అన్ని పనులు పూర్తవుతాయన్నారు. చేతివృత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ విశ్వకర్మ యోజన ( Vishwakarma Yojana ) పేరుతో చేతివృత్తులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్ పరిధిలోని లోయర్ ట్యాంక్ బండ్, కుక్కలతూము ధోబి ఘాట్ లో 26 లక్షల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హల్ పనులకు ఆదివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వకర్మ యోజనలో భాగంగా కోట్లాది మంది ప్రజలకు చేతివృత్తిలో నైపుణ్య శిక్షణ అందించి పరికరాలు, ఆర్థిక సాయం మోడీ ప్రభుత్వం అందిస్తుందన్నారు. సికింద్రాబాద్​ నియోజకవర్గం పరిధిలోని రజక సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న దోబీఘాట్ల ( Dobighat ) అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా దోబీఘాట్ల వద్ద మౌలిక వసతుల కల్పనకు కృషి చేశానని, ఇప్పుడు ఒక పార్లమెంట్​ సభ్యుడిగా కూడా ఆ పరంపరను కొనసాగిస్తున్నానని చెప్పారు.

ట్యాంక్​ బండ్​ కింద ఉన్న కుక్కలు తూము దోబీఘాట్ కమ్యూనిటీ హాల్ భవనం నిర్మాణం ఇతర సౌకర్యాలు కల్పించాలని రజక సంఘం సభ్యులు కోరారని చెప్పారు. వెంటనే పార్లమెంట్​ నిధుల నుంచి రూ.26 లక్షలు దోబీఘాట్​ నిర్మాణానికి కేటాయించి భూమి పూజ చేశామన్నారు. వీలైనంత త్వరగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించానని ఆయన తెలిపారు. చేతివృత్తులు చేసుకునే వారికి మోదీ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. రాబోయే రోజుల్లో వేలాది మందికి నైపుణ్య శిక్షణ, పరికరాలు అందించడంతో పాటు ఆర్థిక సాయం కూడా చేస్తామన్నారు. అన్ని రకాల వృత్తుల వారికి ఉపాధి మెరుగుపరచి వారి కుటుంబాలకు ఆర్థిక ధైర్యాన్ని కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సర్కిల్ 15 ముషీరాబాద్ డీఎంసీ ఖాదర్, డీఈ సన్నీ, వాటర్ వర్క్స్ డీజీఎం కార్తీక్ రెడ్డి, సర్కిల్ 6 ఎఎస్ఒ దీప్తి, ఎలక్ట్రిసిటీ సంపత్, కవాడిగూడ కార్పొరేటర్ జి.రచనశ్రీ, రజక సంఘం నాయకులు ఎం.నరసింహ, చంద్రమోహన్, శ్రీనివాస్, కృష్ణ, రవి, సురేష్, శ్రీశైలం, వెంకటేష్, నాగరాజు, ముత్యాలు, బీజేపీ నాయకులు పరిమళ్ కుమార్, సి.కె.శంకర్, పూసరాజు, సలంద్రి శ్రీనివాస్ యాదవ్, జి.వెంకటేష్, రమేష్ రామ్, మహేందర్ బాబు, రాజు, దిలీప్ యాదవ్, బాణు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story