అసెంబ్లీలో శేరిలింగంపల్లి అభివృద్ధిపై ఎమ్మెల్యే గాంధీ ప్రస్తావన..

by Kalyani |
అసెంబ్లీలో శేరిలింగంపల్లి అభివృద్ధిపై ఎమ్మెల్యే గాంధీ ప్రస్తావన..
X

దిశ, శేరిలింగంపల్లి: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం జరిగిన చర్చల్లో అసెంబ్లీలో శేరిలింగంపల్లి అభివృద్ధిపై ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రస్తావించారు. ప్రజా సౌకర్యార్థం మియాపూర్ చౌరస్తా నుంచి బీహెచ్ఈఎల్ చౌరస్తా వరకు పూణే నమూనా ప్రకారం మెట్రో మార్గం, ఫ్లై ఓవర్ ను ఒకే పిల్లర్ మీదుగా వచ్చే విధంగా నూతనంగా నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే కోరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ దూర దృష్టితో ఐటీ మంత్రి కేటీఆర్ ప్రణాళికలతో ఎస్సార్ డీపీ ప్రాజెక్ట్ లో భాగంగా అయ్యప్ప సొసైటీ అండర్ పాస్ ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పథకంలో నియోజకవర్గంలో మొత్తం 10పనులకు గాను 9 పనులు పూర్తయ్యాయని, మరొకటి పురోగతిలో ఉందని వెల్లడించారు. ప్రత్యమ్నాయ రోడ్లు, ఫ్లై ఓవర్లు, అండర్ బ్రిడ్జిలు కొత్త ప్రతిపాదనలతో కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఇన్ని రోడ్లు అభివృద్ధి చేయడం ఆనందంగా ఉందన్నారు.

మియాపూర్ చౌరస్తా, ఆల్విన్ చౌరస్తాల మీదుగా నిత్యం రోజు వారిగా లక్షకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయని కావున రెండు చౌరస్తాల మీదుగా బీహెచ్ఈఎల్ వరకు ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ విధానం ద్వారా నిర్మాణం సాఫీగా సాగుతుందని, స్థల సేకరణ, భవనాల తొలగిపు వంటి ఇతర అంశాలు అవసరం ఉండదని, తక్కువ ఖర్చుతో త్వరితగతిన నిర్మాణం జరుగుతుందన్నారు. మియాపూర్ బొల్లారం చౌరస్తా నుంచి గండి మైసమ్మ వరకు చేపడుతున్న 200 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, జేఎన్ టీయూ నుంచి ప్రగతినగర్ వరకు రోడ్డు విస్తరణ, ఉషాముళ్ళపూడి కమాన్ నుంచి గాజులరామరం వరకు చేపడుతున్న 100 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. శేరిలింగంపల్లి ప్రాంతంలో రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు బస్సులతో నిత్యం రద్దీగా మారి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయంగా బస్ టెర్మినల్ నిర్మించి అక్కడికి బస్ లను తరలించి, ప్రజలకు ట్రాఫిక్ సమస్య నుంచి ఉపశమనం కలిగించాలని కోరారు.

ఎమ్మెల్యే గాంధీ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 2వ దశ ఎస్సార్ డీపీ పనులు త్వరలోనే ఆమోదిస్తామని, రూ.4,305 కోట్ల ఖర్చుతో చేపడుతామని, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ వరకు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు ఆగస్టులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. మియాపూర్ చౌరస్తా, ఆల్విన్ చౌరస్తా మీదుగా బీహెచ్ ఈఎల్ వరకు డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మాణంకు కృషి చేస్తామని, పూణే నమూనా ప్రకారం మెట్రో మార్గం, ఫ్లై ఓవర్ ను ఒకే పిల్లర్ మీదుగా వచ్చే విధంగా నూతనంగా నిర్మాణం చేపట్టే విధంగా పరిశీలిస్తామని కేటీఆర్ తెలిపారు.

Advertisement

Next Story