నలుగురు సెక్యూరిటీ గార్డుల వేధింపులు.. మియాపూర్ యువతి కేసులో బిగ్ ట్విస్ట్..

by Nagam Mallesh |
నలుగురు సెక్యూరిటీ గార్డుల వేధింపులు.. మియాపూర్ యువతి కేసులో బిగ్ ట్విస్ట్..
X

దిశ, శేరిలింగంపల్లిః మియాపూర్ కోరుకొండ కోచింగ్ సెంటర్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. అదే కోచింగ్ సెంటర్ లో పనిచేస్తున్న నలుగురు సెక్యూరిటీ గార్డుల వేధింపులు తాలలేకనే యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన గీతాంజలి (21) నగరానికి వలసవచ్చి మియాపూర్ మయూరినగర్ లో ఉన్న కోరుకొండ కోచింగ్ సెంటర్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంది. ఈనెల 5వ తేదీ నుండి కోచింగ్ సెంటర్ కు సెలవులు ఇచ్చారు. అయినా సెక్యూరిటీ సిబ్బంది తమ విధుల్లోనే కొనసాగారు. రోజులాగే ఈనెల 8వ తేదీన కూడా డ్యూటీకి వెళ్లిన గీతాంజలి అదే రోజు టవల్ తో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే గీతాంజలి మృతిపై తల్లి అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా కోరుకొండ కోచింగ్ సెంటర్ లోనే సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అశ్విన్ కుమార్ మండల్, గౌతమ్ కుమార్ మండల్, శంకర్ ఠాగూర్, మిథున్ కుమార్ మండల్ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా మృతురాలితో అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనతో మనోవేదనకు గురైన యువతి గీతాంజలి అదే రోజు రాత్రి ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విచారణ అనంతరం నలుగురు నిందితులను అరెస్టు చేసిన మియాపూర్ పోలీసులు నిందితులను రిమాండ్ కు తరలించారు. ఈ కేసు దర్యాప్తుపై మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

Next Story

Most Viewed