TG News: మళ్లీ మళ్లీ అవే అబద్ధాలు..!

by srinivas |
TG News: మళ్లీ మళ్లీ అవే అబద్ధాలు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తనకు మంత్రి పదవులు కొత్తకాదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంత్రిపదవి కోసమో, ఇతర పదవులకు ఆశపడి మాట్లాడే నైజం తనది కాదన్నారు. రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టమైన వివరాలు ఎప్పటికప్పుడు వెల్లడించినప్పటికీ బీజేపీ నాయకులు రైతులను గందరగోళపరిచి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు దీక్షల పేరిట కొత్త డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు. గురువారం మీడియా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం 65.56 లక్షలమంది రైతులు ఉన్నారన్నారు. భూములు ఉండి బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య 42 లక్షలు అన్నారు. 2018 రుణమాఫీ పథకంలో గత ప్రభుత్వానికి అందిన ఖాతాలు 40 లక్షలు మాత్రమే అన్నారు. అందులో కనీసం 20 లక్షల మందికి కూడా రుణమాఫీ కాలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిన 42 లక్షల మందికి మొదటి పంటకాలంలోనే రుణమాఫీ ఈ ఏడాదిలోనే అమలు చేయడానికి చిత్తశుద్ధితో ఉందన్నారు. వీరందరికి 2 లక్షల వరకు రుణమాఫీ చేయడానికి కావాల్సిన మొత్తం అంచనా 31 వేల కోట్లు అని, వీరిలో 2 లక్షలలోపు రుణాలు తీసుకొని కుటుంబ నిర్దారణ చేసిన 22,37,848 మంది అని, వారికి 17933.19 వేల కోట్లతో రుణమాఫీ చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి పంటకాలంలోనే 2 లక్షలలోపు రుణాలను రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల వెల్లడించారు.

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మిగతా 20 లక్షల మందికి 2 లక్షల వరకు రుణమాఫీ చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదే అని, ఆర్థిక వెసులుబాటు చూసుకుంటూ పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. లెక్కల్లో అనుమానాలు ఉంటే బ్యాంకువారీగా వివరాలు తీసుకోవచ్చన్నారు. ఇంత పారదర్శకంగా లెక్కలు ఉన్నప్పటికీ రుణమాఫీ 2024 పథకం పూర్తి అయినట్లు తాము ప్రకటించినట్లు మళ్లీ మళ్లీ అవే అబద్ధాలు చెప్పి స్థాయిని దిగజార్చుకోవద్దు అని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం విపత్తు నివారణ కింద 10 వేల కోట్ల సహాయం ఆర్ధిస్తే కేవలం 400 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందని, తక్కువ ఎందుకు ఇచ్చారని బీజేపీ నేతలు ప్రశ్నించారా? అని నిలదీశారు. తెలంగాణలో మీ పరపతిని పెంచుకోవాలనుకుంటే వచ్చే నిధుల కోసమో.. రైతుల ప్రయోజనాల కోసమో రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రంపై పోరాడాలని సూచించారు. సన్నాలకు 500 బోనస్ తో ఈ పంట కాలం నుంచే కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. దొడ్డు రకం రేషన్ బియ్యం దుర్వినియోగం కాకుండా రాష్ట్రంపై 2వేలకోట్ల అదనపు భారం పడినా సన్నబియ్యంను సేకరించి అన్ని రేషన్ షాపుల ద్వారా తెల్ల రేషన్ కార్డు దారులకు, అన్ని వసతి గృహాలకు సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ లబ్దిదారుల సంఖ్యను 37 లక్షల నుంచి 30 లక్షలకు కుదించారని దీనిపై సమాధానం చెబితే రైతాంగం హర్షిస్తుందన్నారు. బీజేపీ నాయకులు తనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మంత్రి తుమ్మల సూచించారు.

Next Story