ఖరీదైన ప్రధాన మంత్రి మోడీ : మంత్రి మల్లారెడ్డి

by Sumithra |
ఖరీదైన ప్రధాన మంత్రి మోడీ : మంత్రి మల్లారెడ్డి
X

దిశ, అంబర్ పేట్ : దేశ పబ్లిక్ సెక్టార్లు అమ్మేసి పెట్రోలు, డీజిల్ తో పాటు గ్యాస్ రేట్లు పెంచి అధానీ లాంటి కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్న ఖరీదైన భారతదేశ ప్రధానిగా నరేంద్రమోడీ ఉన్నారని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో మేడే వేడుకలు రవీంద్ర భారతీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మల్లారెడ్డి పాల్గొని రాష్ట్ర ఎక్సైజ్ పర్యటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది సంవత్సరాల కాలంలో ఆదాని ఆస్తులు అమాంతంగా పెరిగిపోయాయని, కార్మికుల ఉసురు నరేంద్ర మోడీకి తగులుతుందన్నారు.

గతంలో కార్మికులు బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లేవారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో మల్టీ నేషనల్ కంపెనీలను నిర్మించడానికి అవకాశం కల్పించి అభివృద్ధి చేసిన ఘనత కేసిఆర్ కి దక్కుతుందని, అన్ని రాష్ట్రాలలో కార్మికులు బతుకుదెరువు కోసం తెలంగాణకు వస్తున్నారని వివరించారు. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని, త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టు నిర్మించేది కూడా తామేనన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షపాతి అని కార్మికులందరూ ఐక్యంగా ఉండి 2024లో కేసీఆర్ ప్రధానమంత్రి చేయాలని కోరారు. కాళేశ్వరం, యాదగిరి గుట్ట, సెక్రటేరియట్ లాంటి ప్రతిష్టాత్మక కట్టడాలు కార్మికులు నిర్మించి చరిత్ర సృష్టించారన్నారు.

కరోనా సమయంలో కార్మికులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, త్వరలో కార్మికులకు మంచి రోజులు వస్తాయన్నారు. కార్మిక శాఖలో 18వేల కోట్లు ఉన్నాయని కార్మికుల కోసం కార్మిక భవనాలతో పాటు పిల్లలకు పాఠశాలు, ఆసుపత్రులను నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ఎక్సైజ్ పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు భరోసా కల్పించిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కార్మికులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అనంతరం కార్మికులకు కార్మిక శక్తి అవార్డులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్, కార్మిక శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed