కవితను ఈడీ ప్రశ్నిస్తున్న వేళ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్!

by S Gopi |   ( Updated:2023-03-21 14:06:16.0  )
కవితను ఈడీ ప్రశ్నిస్తున్న వేళ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్నించడంపై బీఆర్ఎస్ భగ్గుమంటోంది. ఇది రాజకీయ దురుద్దేశంతో వచ్చిన ఆరోపణలపై జరుగుతున్న విచారణ అని కొట్టిపారేస్తున్నది. మరోవైపు బీఆర్ఎస్ విమర్శలపై బీజేపీ కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఆసక్తిరేకెత్తిస్తోంది. ఇవాళ ఒకరు తనకు గిప్ట్ గా ఇచ్చారంటూ ఓ పుస్తకాన్ని కేటీఆర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. 'టు కిల్ ఎ డెమోక్రసీ: ఇండియాస్ పాసేజ్ టు డెస్పోటిజం' పేరుతో ఉన్న ఈ పుస్తకం కేటీఆర్ షేర్ చేశారు. ఈ పుస్తకం మినిస్టర్ కేటీఆర్ వద్దకు రావడంపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

కేసీఆర్ బాటలో కేటీఆర్:

బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాలు చేయాలని భావిస్తున్న నాటి నుంచి సీఎం కేసీఆర్ మోడీ ప్రభుత్వంపై నేరుగా ఎటాక్ చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాల పర్యటనలో వివిధ రంగాల వారీగా లెక్కలను ప్రజలకు వివరించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో కేసీఆర్ టేబుల్ పై ‘ప్రైస్ ఆఫ్ ది మోడీ ఇయర్స్’ అనే పుస్తకం దర్శనం ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. ఈ పుస్తకంలో ఉన్న అంశాలపై కేసీఆర్ మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో తన చెల్లి కవితను ఈడీ విచారిస్తున్న సమయంలో కేటీఆర్ సైతం తన తండ్రి బాటలో పుస్తకపఠం వైపు మళ్లడం చర్చగా మారుతోంది. కేటీఆర్ షేర్ చేసిన పుస్తకాన్ని దేబాసిష్ రాయ్ చౌదరి, జాన్ కీన్ రచించారు. దీనిని 2021లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ ప్రచురించగా ఇండియన్ ఎడిషన్‌ను పాన్ మాక్‌మిలన్ ప్రచురించింది. ఈ బుక్ లో మోడీ పరిపాలనలో పౌర హక్కులు, ప్రజాస్వామ్య సంస్థలపై దాడులకు సంబంధించిన చారిత్రక కారణాలు విశదీకరించబడినట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు మాత్రమే కాదని ప్రజలు గౌరవంగా జీవించే జీవన విధానం అని రచయితలు ఈ పుస్తకంలో పేర్కొన్నారు. ముఖ్యంగా న్యాయశాఖ, కార్యనిర్వహాక శాఖ మధ్య అధికార విభజన అంశాలను ఈ పుస్తకంలో చర్చిచారు.

దేశంలోని పౌరుల హక్కులపై ప్రస్తుతం విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు కోర్టులు, మాజీ న్యాయమూర్తులు, కోలీజియం వ్యవస్థపై ఉప రాష్ట్రపతి, కేంద్ర న్యాయశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, గవర్నర్ పై పెండింగ్ బిల్లుల అంశం, ఢిల్లీ లిక్కర్ స్కాం వంటి కేసులపై బీఆర్ఎస్ కోర్టులకు వెళ్లింది. జడ్జిల్లో కొంతమంది బీజేపీకి చెందినవారు ఉన్నారంటూ ఇటీవలే కేటీఆర్ ప్రెస్ మీట్ లో వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ చేతిలో ఈ పుస్తకం రావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేసీఆర్ బాటలో కేటీఆర్ సైతం పక్కా ఆధారాలతో బీజేపీపై ఎటాక్ చేయడంలో భాగంగానే ఈ తరహా పుస్తకాలు తిరగేయబోతున్నారా అనేది చర్చగా మారింది.

Advertisement

Next Story