కేసీఆర్ ది తుగ్లక్ పాలన : ఎమ్మెల్యే ఈటల రాజేందర్

by Sridhar Babu |
కేసీఆర్ ది తుగ్లక్ పాలన : ఎమ్మెల్యే ఈటల రాజేందర్
X

దిశ, ముషీరాబాద్ : కేసీఆర్ ది తుగ్లక్ పాలన అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఈ ప్రభుత్వానికి సోయి, జ్ఞానం ఉందా ? అని ప్రశ్నించారు. ఎంఐఎం మెప్పు కోసం ప్రజలను వేధిస్తే ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. బోడుప్పల్ బాధితులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలంటూ, వక్ఫ్ భూములు పేరుతో రిజిస్ట్రేషన్ నిలిపివేయడంతో వక్ఫ్ బాధితుల ఐక్యవేదిక ( జేఏసీ ) చేస్తున్న పోరాటం 30వ రోజులకు చేరుకుంది. ఈ పోరాటంలో భాగంగా హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ లో ఆదివారం బాధితుల జేఏసీ ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టింది. ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఇంటినుండి బయటికి రాకుండా సుఖంగా జీవిస్తున్న మీకు కంటిమీద కునుకులేకుండా చేసి కేసీఆర్ ప్రభుత్వం మిమ్మల్ని హింసపెడుతుందన్నారు. ఏ ఒక్క మంత్రికి, ఎమ్మెల్యేకి మీ సమస్యను సీఎంకి చెప్పే దమ్ము లేదని, రోడ్డు ఎక్కితే తప్పా మీ దుఃఖం ఆగదు అని చెప్పానని ఈటల గుర్తు చేశారు.

ఏనాడూ బయటికి వెళ్లని వారు ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నారంటే ప్రభుత్వానికి సోయి ఉండాలని పేర్కొన్నారు. ప్రగతి భవన్, ఫామ్ హౌస్ ల నుండి బయటికి రాని సీఎం ఎవరో అడిగారని ఇచ్చిన ఓ ఆదేశం వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున పడి ఏడుస్తున్నాయో చూస్తున్నారా ? లేదా ? మీకు జ్ఞానం ఉందా ? అని ఈటల కేసీఆర్ ను నిలదీశారు. ఇలాంటి సమస్య ఎల్ బీ నగర్ లో కూడా ఉండేదని, మునుగోడు ఎన్నికల కోసం వారి భూములు అమ్ముకోవడానికి కేటీఆర్ స్వయంగా వెళ్లి జీఓ ఇచ్చి వచ్చారని గుర్తు చేశారు. 300 ఎకరాలకు సంబంధించిన సమస్య కాదు.. ఈ 500 మంది ఆక్రంధనలకు తెలంగాణ సమాజం అంతా స్పందిస్తుందన్నారు. ఇంటిలిజెన్స్ పోలీసులు ఈ సమస్య గ్రావిటీని సీఎం దృష్టికి తీసుకొని వెళ్లండని కోరారు. ఎవరు భూమి మీద శాశ్వతంగా ఉండేందుకు రాలేదని, అధికారం ఎల్లకాలం ఉండదని, అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారని, ప్రజల ఉసురు పోసుకున్న వారు ఎక్కువ కాలం ఉండరని అన్నారు. నీకు సీఎం పదవి ఇచ్చింది 2023 వరకే అని, నీ కుర్చీ, అధికారం ప్రజల చేతుల్లో ఉందని, ఫీజు పీకేస్తే ఇంటికి పోతారని కేసీఆర్​కు సూచించారు.

చట్ట ప్రకారం కోనుకున్న భూముల మీద మీ దౌర్జన్యం ఏంది అని ప్రశ్నించారు. బోడుప్పల్ వక్ఫ్ భూమి బాధితులకు బీజేపీ అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. రాంచందర్ రావు, వి.హనుమంతరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరైందికాదన్నారు. బోడుప్పల్లో మధ్యతరగతి, సామాన్య తరగతి ప్రజలు అప్పులు చేసి కొనుగోలు చేసిన ఈ భూమిని ప్రభుత్వం వక్ఫ్ బోర్డుగా ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నాడు అనుమతి ఇచ్చి నేడు ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. ఈ నిరాహార దీక్షలో జేఏసీ కన్వీనర్ శ్రీధర్ రెడ్డి, కో చైర్మన్లు, బీజేపీ కార్పొరేటర్ కుంభం కిరణ్ కుమార్ రెడ్డి, కొత్త దుర్గమ్మ, పోగుల నర్సింహ రెడ్డి, కిషోర్ గౌడ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు మోహన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, నర్సయ్య, లక్ష్మణ్ రావు, జేఏసీ నాయకులు, కార్యకర్తలు, సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed